కిరోసిన్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌కు..

ABN , First Publish Date - 2022-05-17T06:28:09+05:30 IST

తన సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు దివ్యాంగురాలు సోమవారం కిరోసిన్‌ బాటిల్‌తో వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె వద్ద నుంచి బాటిల్‌ను తీసుకుని ఆమె సమస్యను తెలుసుకున్నారు.

కిరోసిన్‌ బాటిల్‌తో కలెక్టరేట్‌కు..
దివ్యాంగురాలు నాగమ్మ నుంచి కిరోసిన్‌ బాటిల్‌ను తీసుకుంటున్న పోలీసు

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 16 : తన సమస్య పరిష్కారం కోసం కలెక్టరేట్‌కు దివ్యాంగురాలు సోమవారం కిరోసిన్‌ బాటిల్‌తో వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె వద్ద నుంచి బాటిల్‌ను తీసుకుని ఆమె సమస్యను తెలుసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి చెందిన బుస్స నాగమ్మ దివ్యాంగురాలు. ఆమెకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఇచ్చిన స్థలంలో 2002లో ప్రభుత్వ సహకారంతో నాగమ్మ ఇంటిని నిర్మించుకుంది. ఆ ఇం టిని ఆమెకు తెలియకుండా గతంలో గడ్డిపల్లి గ్రామకార్యదర్శిగా పనిచేసిన ఉద్యోగి ఆమె బంధువుల పేరున రికార్డుల్లో నమోదు చేశాడు. దీంతో వారు నాగమ్మను ఇంటి నుంచి బలవంతంగా ఖాళీ చేయించారు. చేసేది లేక నాగమ్మ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. నెలానెలా అద్దె ఖర్చులు చెల్లించలేకపోతున్నానని, తన ఇంటిని అక్రమంగా ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారులకు విన్నవించింది. స్థానికంగా అధికారులు తనకు న్యాయం చేయకపోవడంతో కలెక్టరేట్‌ వద్ద కిరోసిన్‌ ఒంటిపై పోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని భావించి కిరోసిన్‌ తీసుకుని వచ్చినట్లు ఆమె తెలిపింది. కలెక్టరేట్‌ లోపలికి వెళ్లే గేట్‌ వద్ద పోలీసులు నాగమ్మ వద్ద ఉన్న సంచిని తనిఖీ చేయగా అందులో కిరోసిన్‌ బాటిల్‌ కనిపించింది. వెంటనే బాటిల్‌ను తీసుకుని ఆమెను కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి వద్దకు పోలీసులు తీసుకెళ్లారు. అనంతరం నాగమ్మ దరఖాస్తును కలెక్టర్‌ స్వీకరించారు. ఈ విషయమై విచారణ చేయించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


Updated Date - 2022-05-17T06:28:09+05:30 IST