పెద్దల సభకు.. కథల బాహుబలి

ABN , First Publish Date - 2022-07-07T08:08:17+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ చిత్ర కథా రచయిత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి.

పెద్దల సభకు.. కథల బాహుబలి

రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌కు రాజ్యసభ సభ్యత్వం

ఇళయరాజా, పీటీ ఉష, వీరేంద్రహెగ్గడేకు కూడా!


రాష్ట్రపతి కోటాలో నామినేట్‌ చేసిన కేంద్రం

ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు మాత్రమే అవకాశం

4 రాష్ట్రాల నుంచి నలుగురు ప్రముఖులకు స్థానం

ఇసైజ్ఞాని కీర్తి కిరీటంలో మరో కలికితురాయి

పరుగుల రాణి ప్రస్థానంలో కొత్త అధ్యాయం

సమాజ సేవకుడు హెగ్గడేకు సముచిత గౌరవం


న్యూఢిల్లీ, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ‘బాహుబలి’ చిత్ర కథా రచయిత, దర్శక దిగ్గజం రాజమౌళి తండ్రి.. కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్‌ రాజ్యసభకు నామినేట్‌ అయ్యారు! ఆయనతోపాటు.. కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను తన సంగీతంతో రంజింపజేసిన ఇసైజ్ఞాని ఇళయరాజా, భారతదేశ తొలితరం మేటి అథ్లెట్లలో ఒకరైన పీటీ ఉష, ‘ధర్మస్థల’ క్షేత్ర ధర్మాధికారి, ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్గడేను కూడా రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నామినేట్‌ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నలుగురూ దక్షిణాది రాష్ట్రాలకు చెందినవారే కావడం గమనార్హం. విజయేంద్ర ప్రసాద్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు కాగా.. ఇళయరాజా తమిళనాడు, వీరేంద్ర హెగ్గడే కర్ణాటక, పీటీ ఉష కేరళ రాష్ట్రానికి చెందినవారు. దక్షిణాదిన బీజేపీని విస్తరించాలనే ప్రణాళికలో భాగంగానే రాజ్యసభకు వీరిని నామినేట్‌ చేసినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ నలుగురిలో ఒకరు మహిళ, ఒకరు దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, మరొకరు మతపరమైన మైనారిటీ (జైన్‌) వర్గానికి చెందినవారని.. ‘సబ్‌ కా సాత్‌ సబ్‌ కా విశ్వాస్‌’ విధానంలో భాగంగా ఇలా వివిధ వర్గాలవారికి మోదీ సర్కారు అవకాశం కల్పించిందని ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నలుగురిలో పీటీ ఉష అర్జున అవార్డీ, పద్మశ్రీ పురస్కార గ్రహీత కాగా.. ఇళయరాజా, వీరేంద్ర హెగ్గడే భారత ప్రభుత్వ రెండో అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్‌ గ్రహీతలు.


మోదీ ప్రశంసలు..

రాజ్యసభకు నామినేట్‌ అయిన నలుగురినీ అభినందిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు. విజయేంద్ర ప్రసాద్‌ కొన్ని దశాబ్దాలుగా సృజనాత్మక ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తి అని ఆయన  ప్రశంసించారు. భారతీయ సంస్కృతి వైభవాన్ని ఆయన ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు. ఇక.. సంగీత దర్శకుడు ఇళయరాజా కొన్ని తరాలుగా సంగీత ప్రియులను అలరించిన సృజనాత్మక మేధావి అని, పలు భావోద్వేగాలను అందంగా పలికించిన గొప్ప వ్యక్తి అని మోదీ ప్రశంసించారు.


ఒక సాధారణ నేపథ్యం నుంచి వచ్చి ఎన్నో విజయాలు సాధించిన ఇళయరాజా జీవిత ప్రయాణం స్ఫూర్తిదాయకమని ఆయన వ్యాఖ్యానించారు. పీటీ ఉష  భారతీయులందరికీ ప్రేరణ అని.. క్రీడా రంగంలో ఆమె సాధించిన విజయాలు అపూర్వమైనవని, గత కొన్నేళ్లుగా ఆమె ఎందరో క్రీడాకారులను తయారు చేశారని కొనియాడారు. ఇక.. వీరేంద్ర హెగ్గడే ఆరోగ్య, విద్య, సాంస్కృతిక రంగాల్లో ఎనలేని సేవ చేశారని, తాను ధర్మస్థల ఆలయంలో ప్రార్థన  జరిపినప్పుడు ఆయన మహోన్నత సేవను చూసే అవకాశం లభించిందని ప్రధాని ప్రశంసించారు.


పేరులోనే విజయం!

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా చలించకుండా, భవిష్యత్‌ మీద ఆశను చంపుకోకుండా, నిజాయితీగా బతకాలన్న పట్టుదలను వదులుకోకుండా స్వశక్తితో ఎదిగిన వ్యక్తి.. విజయేంద్రప్రసాద్‌. ఆయన పూర్తి పేరు కోడూరి విశ్వ విజయేంద్రప్రసాద్‌. పేరులోనే విజయాన్ని తోడుగా ఉంచుకున్న ఆయన స్వస్థలం కొవ్వూరు. ‘షోలే’ చూసిన తర్వాత జంట రచయితలు సలీం-జావేద్‌లా తను కూడా మంచి రచయితగా పేరు తెచ్చుకోవాలనుకున్నారు. అన్నయ్య శివశక్తి దత్తా(సంగీత దర్శకుడు కీరవాణి తండ్రి)తో కలసి కొన్ని చిత్రాలకు రచన చేసి, తర్వాత సొంతంగా రచయితగా ఎదిగి, ఇండియాలోనే అగ్ర శ్రేణి రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. తన అన్నయ్యను దర్శకుడిగా చూడాలన్నది విజయేంద్రప్రసాద్‌ కోరిక. అందుకు ప్రయత్నించినప్పటికీ.. అన్నీ కుదిరిన తర్వాత అనుకోని అడ్డంకులు వచ్చి ఆ సినిమా ఆగిపోయింది. ఆ చిత్రం షూటింగ్‌ కోసం చెన్నై వెళ్లిన విజయేంద్రప్రసాద్‌ ఇక వెనక్కి తిరిగి ఇంటికి  వెళ్లలేదు. చెన్నైలోనే ఉండిపోయారు. శివశక్తి దత్తాకు దర్శకుడు రాఘవేంద్రరావుతో మంచి పరిచయం ఉండడంతో తమ్ముడిని తీసుకెళ్లి ఆయనకు పరిచయం చేశారు. ఆయన సినిమాల కథాచర్చల్లో విజయేంద్రప్రసాద్‌ కూడా పాల్గొనేవారు.


తన అన్నయ్యలా తను కూడా సినిమాలకు కథలు రాస్తే డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అప్పటినుంచి పరిశీలనాదృష్టితో సినిమాలు చూడడం ప్రారంభించారు. సినిమా కథ ఎలా ఉండాలి, అందులో ఏయే అంశాలు ఉంటే ప్రేక్షకులకు నచ్చుతుంది.. అనే పరిశోధన ప్రారంభించారు. ఆ సమయంలోనే రాఘేంద్రరావు ఈ సోదరులిద్దరినీ పిలిచి.. ‘‘‘మూగ మనసులు’ చిత్రం చూశారు కదా. అలా హృదయానికి హత్తుకునే కథ కావాలి. కానీ ఆ సినిమాలా ఉండకూడదు’’ అని చెప్పారు. ‘మూగమనసులు’ చిత్రాన్ని  దృష్టిలో పెట్టుకుని ‘జానకిరాముడు’ కథ తయారు చేశారీ  సోదరులు. నాగార్జున కథానాయకుడుగా వచ్చిన ఈ చిత్రం  హిట్‌ అయి, వాళ్లకు గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత అక్కినేని నటించిన ‘బంగారు కుటుంబం’ చిత్రం కథ తయారు చేశారు. అదీ హిట్‌. అనంతరం  బాలకృష్ణకు ‘బొబ్బిలి సింహం’, నాగార్జునకు ‘ఘరానా బుల్లోడు’ కథలు అందించారు. ఆ రెండూ హిట్‌ అయ్యాయి. ఆ తర్వాత.. ‘అర్ధాంగి’ అనే సినిమాకు ఈ సోదరులిద్దరూ దర్శకత్వం వహించారు. ఆ సినిమా పెద్ద ప్లాప్‌ అవడంతో కెరీర్‌లో గ్యాప్‌ వచ్చింది. మళ్లీ ‘సమరసింహారెడ్డి’ చిత్రంతో విజయేంద్రప్రసాద్‌ వెలుగులోకి వచ్చారు. ఇక అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకునే అవసరం కలగలేదు. తనయుడు రాజమౌళి దర్శకుడయ్యాక.. విజయేంద్ర ప్రసాద్‌ ఆలోచనలను తెరపై అద్భుతంగా చూపడం ప్రారంభించారు.


దీంతో, తండ్రీ కొడుకుల కాంబినేషన్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. ‘సింహాద్రి’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా వరుసపెట్టి విజయాలతో సత్తా చాటారు. ముఖ్యంగా.. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాలతో జాతీయంగానే కాక, అంతర్జాతీయ స్థాయిలోనూ రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌ ప్రాచుర్యం పొందారు. తెలుగులోనే కాకుండా హిందీ చిత్ర పరిశ్రమకు వెళ్లి ‘బజరంగీ భాయిజాన్‌’, ‘మణికర్ణిక’ వంటి చిత్రాలకు కథలు అందించి విజయాలు సాధించారు విజయేంద్రప్రసాద్‌. రచయితగా అనుకున్న లక్ష్యం సాధించిన తర్వాత దర్శకత్వం మీద కూడా దృష్టి పెట్టి ‘శ్రీకృష్ణ 2006’, ‘రాజన్న’, ‘శ్రీవల్లి’ చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే దర్శకుడిగా మాత్రం ఆయన విజయాలు సాధించలేకపోయారు.                

-సినిమా డెస్క్‌, ఆంధ్రజ్యోతి


పీటీ ఉష

కేరళలోని కోళికోడ్‌ జిల్లాలో ఒక చిన్న గ్రామంలో జన్మించిన పీటీ ఉష భారతదేశం గర్వించ దగ్గ అథ్లెట్‌. దేశంలో లక్షలాది మంది ఆడపిల్లలు క్రీడల్లోకి రావడానికి స్ఫూర్తి కలిగించిన రోల్‌మోడల్‌. పయ్యోలీ ఎక్స్‌ప్రె్‌సగా పేరొందిన పీటీ ఉష పలు అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి పతకాలు సాధించి పెట్టింది. వరల్డ్‌ జూనియర్‌ ఇన్విటేషనల్‌ మీట్‌, ఏసియన్‌ చాంపియన్‌ షిప్స్‌, ఏసియన్‌ గేమ్స్‌ల పతకాలు సాధించింది. తన కెరీర్‌లో ఎన్నో జాతీయ, ఆసియా రికార్డులను ఆమె ఛేదించింది. కొత్త రికార్డులను సాధించింది. 1984 ఓలింపిక్స్‌లో ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని సాధించిపెట్టే అవకాశాన్ని పీటీ ఉష త్రుటిలో కోల్పోయింది. 400 మీటర్ల హర్డిల్స్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది.   రిటైర్మెంట్‌ తర్వాత ‘ఉష స్కూల్‌ ఆఫ్‌ అథ్లెటిక్స్‌’ స్థాపించి అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో నిర్వహిస్తూ వేలాది మంది ప్రతిభావంతులకు శిక్షణనిస్తోంది.  


ఇళయరాజా

తమిళనాడులోని తేణి జిల్లా వన్నయపురంలో నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఇళయరాజా.. దేశంలోనే పేరెన్నికగన్న సంగీత స్వరకర్తల్లో ఒకరు. ఆయన అసలు పేరు ఆర్‌.జ్ఞానదేశిగన్‌. తండ్రి బడిలో వేసేటప్పుడు ఆయన పేరు ‘రాజయ్య’గా రాయించారు. ధనరాజ్‌ మాస్టర్‌ వద్ద సంగీత పాఠాలు నేర్చుకునేటప్పుడు.. ఆయన ‘రాజయ్య’ అనే పేరును ‘రాజా’గా మార్చారు. ఆయన సినీ రంగంలోకి ప్రవేశించేటప్పటికే.. ఏఎం రాజా పేరు మారుమోగిపోతోంది. దీంతో ఆయన తొలి చిత్ర (అన్నక్కిళి-1976) నిర్మాత ‘రాజా’ పేరుకు ముందు ‘ఇళయ (అంటే తమిళంలో చిన్న అని అర్థం)’ అనే పదాన్నిచేర్చారు. సినీ కెరీర్‌ తొలినాళ్లలో ఎన్నో ఒడుదొడుకులను, కులవివక్షను ఎదుర్కొన్న ఇళయరాజా..  వాటన్నింటినీ తట్టుకుని, చెక్కుచెదరకుండా నిలబడి గొప్ప సంగీత దర్శకుడిగా ఎదిగారు. సినిమా పోస్టర్‌ మీద సంగీత దర్శకుడి ఫొటో వేయడం ఇళయరాజాతోనే మొదలైంది. దాదాపు ఐదు దశాబ్దాల స్వరప్రస్థానంలో 1400కి పైగా చిత్రాల్లో 7000కు పైగా పాటలను స్వరపరిచారు. 400కు పైగా పాటలు ఆలపించారు.  ఐదుసార్లు జాతీయ పురస్కారాలు అందుకున్నారు. సంగీత రంగంలో ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 2018లో పద్మభూషణ్‌తో, 2018లో పద్మ విభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. 


వీరేంద్ర హెగ్గడే

ఇరవై ఏళ్ల వయసులోనే ‘ధర్మస్థల’ క్షేత్ర ధర్మాధికారిగా బాధ్యతలు స్వీకరించి, నాటి నుంచి అదే పదవిలో కొనసాగుతూ అద్భుతంగా ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రముఖ సంఘ సేవకుడు వీరేంద్ర హెగ్గడే. గ్రామీణాభివృద్ధికి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఐదు దశాబ్దాలకు పైగా ఆయన ఎనలేని కృషి చేస్తున్నారు. ఇందుకోసం ‘రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌డీసెటి)’ స్థాపించారు. హెగ్గడే స్ఫూర్తితోనే కేంద్ర ప్రభుత్వం ‘రూరల్‌ సెల్ఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. ఈయన చేపట్టిన ‘శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు’లో 6 లక్షలకు పైగా స్వయం సహాయక బృందాలు, 49 లక్షల మంది సభ్యులు ఉన్నారు. అలాగే.. ‘శ్రీ ధర్మస్థల మంజునాథేశ్వర ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌’ ద్వారా 25 పాఠశాలలు, కళాశాలలు స్థాపించి వేలాది మందికి నాణ్యమైన విద్యను చౌకగా అందిస్తున్నారు. ఆరోగ్యం, సామాజిక సంక్షేమం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ.. ఇలా పలు రంగాల్లో వీరేంద్ర హెగ్గడే అందించిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2015లో ఆయన్ను పద్మవిభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది.


సాధారణ వ్యక్తులకు రాజ్యసభ ఇవ్వడం అభినందనీయం : సంజయ్‌ 

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): అతి సాధారణ కుటుంబాల నుంచి వచ్చి ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని రాజ్యసభ సభ్యులుగా నామినేట్‌ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ సంగీత స్వరకర్త ఇళయరాజా, క్రీడాకారిణి పీటీ ఉషా, ప్రముఖ కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌, ఆధ్యాత్మికవేత్త వీరేంద్ర హెగ్డేను రాజ్యసభకు నామినేషన్‌ చేయడం గర్వకారణమని పేర్కొన్నారు. గతంలో సంపన్నులకు, పైరవీకారులకే పద్మ అవార్డులు, రాజ్యసభ నామినేటెడ్‌ పదవులు చేసేవారన్న ప్రచారం ఉండేదని, దాన్ని పటాపంచలు చేస్తూ ఊహకే అందని విధంగా అతి సాధారణ కుటుంబాల నుంచి ఆయా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారికి అవకాశాలు కల్పిస్తున్న ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని స్పష్టం చేశారు. 

Updated Date - 2022-07-07T08:08:17+05:30 IST