చెరువు స్థలం కబ్జా చేసేందుకే

ABN , First Publish Date - 2022-08-01T05:05:08+05:30 IST

రింగురోడ్డు నుంచి జమ్మునారాయణపురం వెళ్లే దారిలో రోడ్డుకు అనుకుని ఉన్న చెరువు స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయానికి కేటాయించారని, చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సరికాదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.

చెరువు స్థలం కబ్జా చేసేందుకే
నిరసన తెలుపుతున్న టీడీపీ నాయకులు



అక్కడ వైసీపీ కార్యాలయం సరికాదు
టీడీపీ నిరసన
విజయనగరం రూరల్‌, జూలై 31
: రింగురోడ్డు నుంచి జమ్మునారాయణపురం వెళ్లే దారిలో రోడ్డుకు అనుకుని ఉన్న చెరువు స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ కార్యాలయానికి కేటాయించారని, చెరువును కబ్జా చేసేందుకు ప్రయత్నించడం సరికాదని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆ స్థలం వద్ద ఆదివారం నిరసన తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నియోజకవర్గ తెలుగుయువత నాయకుడు గంటా రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుయువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ నాయకులు కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల ప్రసాద్‌, కంది మురళీనాయుడులు మాట్లాడుతూ, వైసీపీ కార్యాలయం ఏర్పాటుకు చెరువు స్థలం కేటాయించడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. దీనిపై దశలవారీగా ఆందోళనలు చేస్తామన్నారు. ఇప్పటికే స్పందనలో జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లామని చెప్పారు. రానున్న కాలంలో ప్రజలు, ప్రజా సంఘాలు, కలిసొచ్చే పార్టీలను కలుపుకుని తీవ్రస్థాయిలో నిరసన  చేపడతామన్నారు. విలువైన స్థలంపై వైసీపీ నేతల కన్ను పడిందన్నారు. వేరే ప్రాంతంలో వైసీపీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని, చెరువు స్థలం కబ్జా కాకుండా అధికారులు చూడాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకులు అనురాధ బేగం, పి.సూర్యకుమారి, కర్రోతు రాధామణి, కొర్నాన రాజ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-01T05:05:08+05:30 IST