తిరుమలనాయకర్‌ భవనం పునరుద్ధరణ

ABN , First Publish Date - 2021-06-13T17:32:00+05:30 IST

తెలుగు తల్లి ముద్దుబిడ్డ తిరుమలనాయకర్‌ ప్రభువుకు మరింత ఘనత చేకూర్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మహనీయుని పేరుతో మదురైలో నిర్మించిన భవంతిని శనివారం మంత్రి

తిరుమలనాయకర్‌ భవనం పునరుద్ధరణ


ప్యారీస్‌(చెన్నై): తెలుగు తల్లి ముద్దుబిడ్డ తిరుమలనాయకర్‌ ప్రభువుకు మరింత ఘనత చేకూర్చేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మహనీయుని పేరుతో మదురైలో నిర్మించిన భవంతిని శనివారం మంత్రి తంగం తెన్నరసు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తిరుమలనాయకర్‌ పురాతన కట్టడాన్ని ప్రస్తుతం పురావస్తు పరిశోధన శాఖ పరామర్శిస్తోందని, దక్షిణ తమిళనాడు ప్రధాన చారిత్రాత్మక గుర్తుగా కొలువుదీరిన ఈ భవంతికి మరింత మెరుగులు చేకూర్చేలా రూ.8 కోట్లతో మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ఇలాంటి పురాతన భవనాలు సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయని, వీటిని చెక్కుచెదరకుండా పునరుద్ధరించాల్సిందిగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ సూచించారని తెలిపారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో కూడా తిరుమలనాయకర్‌ భవంతిని రూ.11 కోట్లతో పునరుద్ధరించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ భవంతి లోపల ఉన్న రంగస్థల వేదిక, సమావేశం హాలు, పురాతన వస్తువులు భద్రపరిచిన ప్రదర్శనశాల తదితర మరమ్మతులు మూడు విడతలుగా చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు. తొలివిడత పనులు త్వరలో ప్రారంభిస్తామని, భవంతి బయట నల్లరాతి శిల్పాల పార్కు, చరిత్రను గుర్తుచేసుకొనేలా గ్రంథాలయం నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. మంత్రి వెంట జిల్లా కలెక్టర్‌ అనీ్‌షశేఖర్‌, ఎంపీ వెంకటేశన్‌, ఎమ్మెల్యేలు కె.దళపతి, భూమినాథన్‌, మాజీ మంత్రి పొన్‌ ముత్తురామలింగం తదితరులున్నారు.

Updated Date - 2021-06-13T17:32:00+05:30 IST