Abn logo
Apr 17 2021 @ 23:49PM

పాల్వంచ కథ.. అంతులేని వ్యధ.. 21ఏళ్లుగా మునిసిపల్‌ ఎన్ని‘కళ’కు దూరం

పాల్వంచ మున్సిపల్‌ కార్యాలయం

‘ఏజెన్సీ’ వివాదంతో ఎలక్షన్‌కు బ్రేక్‌

హామీలతోనే సరిపెడుతున్న నాయకగణం 

పాలకులు మారుతున్నా.. మారని తలరాత 

మరోసారి చర్చనీయాంశమైన పారిశ్రామిక పట్టణం

కొత్తగూడెం కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 17: సమస్య ఏంటో తెలియదు.. పరిష్కారం ఇంకెవ్వరికీ తెలియదు. దశాబ్ధాలు గడుస్తున్నాయి.. పరిష్కరించాలన్న ఆలోచనకూడా ఎవ్వరికీ రావడం లేదు. జాతీయస్థాయిలో పారిశ్రామిక ప్రాంతంగా పేరు పొందిన పాల్వంచ మునిసిపాలిటీ 21సంవత్సరాలుగా పాలకవర్గం లేకుండా ‘ప్రత్యేక’ పాలనలో మగ్గుతోంది. ఫలితంగా అక్కడి సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పురపాలకాలు, కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపధ్యంలో మరోసారి పాల్వంచ మునిసిపాలిటీ వ్యవహారం చర్చనీయాంశమైంది.  

మున్సిపాల్టీగా రెండుసార్లే ఎన్నికలు..

ఉమ్మడి రాష్ట్రంలో మేజర్‌ పంచాయతీగా ఉన్న పాల్వంచను 1987లో మున్సిపాల్టీగా అప్‌గ్రేడ్‌ చేశారు. ఈ పట్టణంలో 24 వార్డులు, సుమారు 60వేల ఓటర్లు ఉన్నారు. 1987లో తొలిసారి మునిసిపల్‌ ఎన్నికలు నిర్వహించారు. కాంగ్రెస్‌ నాయకుడు కొమరం రాములు తొలి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 1992 వరకూ ఆ పాలకవర్గం కొనసాగింది. రెండోసారి 1995లో జరిగిన ఎన్నికల్లో  మళ్లీ కాంగ్రెస్‌ విజయంసాధించింది. బన్సీలాల్‌ చైర్మన్‌గా 2000 సంత్సరం వరకు పనిచేశారు. ఇక ఆ తరువాత 21 సంవత్సరాలుగా ఈ ద్వితీయ శ్రేణి మున్సిపాల్టీకి ఎన్నికలు నిర్వహించలేదు. ఇందుకు కారణంపై మాత్రం ఎవ్వరికీ స్పష్టత లేకపోవడం గమనార్హం.. అధికారులు మాత్రం పాల్వంచ మునిసిపాలిటీపై కోర్టులో ఏజెన్సీ, నాన్‌ ఏజెన్సీ వివాదం ఉందని అందుకే ఎన్నికలు నిర్వహించడం లేదని చెబుతున్నారు. అయితే దీనిపై ఎవరు కోర్టును ఆశ్రయించారు, ఏమని ఆశ్రయించారు, దానికి ప్రభుత్వం ఏమని కౌంటర్‌ దాఖలు చేసిందనే విషయాలపై స్పష్టతలేదు. కానీ రాజకీయ పార్టీలు మాత్రం ఈ 21సంత్సరాల్లో ఎప్పుడు ఏ ఎన్నికల ప్రచారానికి వచ్చినా పాల్వంచ మునిసిపాలిటీ త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని హామీలు గుప్పించడం, తరువాత ఆ విషయాన్ని గాలికొదిలేయడం ఓ తంతుగా మారింది. అయితే పాల్వంచ మున్సిపల్‌ ఎన్నికలు స్వార్ధ రాజకీయాల కారణంగానే నిర్వహించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  

ద్వితీయ శ్రేణి ఎదగకుండా చేసేందుకే..! 

కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగకుండా చేయాలనే స్వార్ధ రాజకీయాలతోనే పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించడం లేదన్న ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. గతం 21 సంవత్సరాల్లో పనిచేసిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ దీనిపై ఒక్క ప్రయత్నమూ చేయకపోవడాన్ని స్థానిక ప్రజలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎప్పటికప్పుడు  ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం తర్వాతా ఆ ఊసే మరిచిపోవడం గమనార్హం. కనీసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాతైన ఎన్నికలు జరుగుతాయని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురవుతోంది. 

కోర్టుకు వెళ్లిన అంశం ఏమంటే..

కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఖాయిలా పడిన పరిశ్రమలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించగా ఆ జాబితాలో పాల్వంచలోని అప్పటి స్పాంజి ఐరన్‌ ఇండియా లిమిటెడ్‌, ప్రస్తుత ఎన్‌ఎండీసీ కర్మాగారం కూడా ఉంది. దాంతో ఎన్‌ఎండీసీని ప్రైవేటు పరం కాకుండా కాపాడుకునేందుకు కార్మగారంలోని ఓ కార్మిక సంఘం ‘సమతా’ అనే స్వచ్చంద సంస్థ ద్వారా ఎన్‌ఎండీసీ కార్మగారం ఏజెన్సీ పరిధిలో ఉందని, దాన్ని ఎవరూ కొనడం, అమ్మడం చేయడం చట్ట విరద్దమని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో కర్మాగార ప్రవేటీకరణ నిలిచిపోయింది. అంతకు మించి పాల్వంచ మున్సిపాలిటీ విషయంలో ఎవరూ కోర్టును ఆశ్రయించలేదు. ఆ పిటిషన్‌ ఆధారంగా పాల్వంచ ఏజెన్సీనా నాన్‌ ఏజెన్సీనా తేలిన తర్వాతనే ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్‌ చెబుతోందని స్థానిక అధికారులు సమాధానమిస్తున్నారు. ‘ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చినట్లు’  ఎన్‌ఎండీసీ కార్మగారం ప్రవేటు పరం కాకుండా అడ్డుకొనే ప్రయత్నం మున్సిపాల్టీ ఎన్నికలకు అవరోధంగా మారింది. దీన్ని పరిష్కరించాలంటే అసెంబ్లీలో తీర్మాణం చేసి పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేయించడమే మార్గమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.