Abn logo
Oct 26 2020 @ 09:02AM

ఒకే వేదికపై ఒకేసారి ముగ్గురు కవలలకు వివాహం

తిరువనంతపురం: కేరళలో జరిగిన ఒక వివాహం ఎంతో ఆసక్తికరంగా మారి, అందరి నోళ్లలో నానుతోంది. ఒకే వేదికపై ముగ్గురు కవల సోదరీమణులకు ఒకే సమయంలో వివాహం జరగడాన్ని అందరూ వింతగా భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే కేరళలోని తిరువనంతపురానికి చెందిన రమాదేవి అనే మహిళ 1995 నవంబరు 18న ఒకే కాన్సులో ఐదుగురు శిశువులకు జన్మనిచ్చింది. 

వారిలో నలుగురు ఆడపిల్లలు కాగా, ఒకరు మగ పిల్లవాడు. ఈ శిశువులు కేరళ క్యాలండర్ ప్రకారం ఉత్తమ్ నక్షత్రంలో పుట్టడంతో వీరికి దేవి, ప్రేమ్ కుమార్ దంపతులు ఉత్తర, ఉత్తమ, ఉత్రా, ఉత్రజా, ఉత్రాజన్ అనే పేర్లు పెట్టుకున్నారు. వీరు ఎంతో ఆరోగ్యంగా ఉంటూనే, పెరిగి పెద్దవారయ్యారు. వీరిని స్థానికులు వింతగా చూస్తుండేవారు. అలాగే వీరి గురించిన కథనాలు వార్తా పత్రికల్లో తరచూ కనిపించేవి. ఇప్పుడు ఆ నలుగురు కవల యువతులలో ముగ్గురికి ఒకే వేదికపై వివాహం జరిగింది. నలుగురు యువతులకూ ఒకేసారి నిశ్చితార్థం జరిగినప్పటికీ ముగ్గురికి మాత్రమే ఒకేసారి వివాహం జరిగింది. ఇంకొక యువతిని పెళ్లి చేసుకోబోయే వరుడు కువైట్ నుంచి సమయానికి రాలేకపోవడం వల్ల ఆమె వివాహం జరగలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకేసారి తమ ముగ్గురు కూతుర్లకు పెళ్లి జరగడంతో తల్లి రమాదేవి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఇంత మంది పిల్లలను పెంచి పోషించడం తమకు ఎంతో కష్టంగా ఉండేదని, తన భర్త ఆత్మహత్య చేసుకోవడంతో తనపై కుటుంబ భారం మరింత పెరిగిందని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, పిల్లలను ఎంతో కష్టపడి చదివించానిని తెలిపారు. వారు మంచి ఉద్యోగాలు సంపాదించారని ఆమె పేర్కొన్నారు. తన నలుగురు కుమార్తెలకు ఉద్యోగంలో స్థిరపడిన భర్తలు దొరికారని ఆమె పేర్కొన్నారు.


Advertisement
Advertisement