ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటినుంచి వెళ్లిపోయి.. తల్లిఫోన్‌కు మెసేజ్ పెట్టారు.. అందులో ఉన్నది చదివి..

ABN , First Publish Date - 2020-02-19T08:50:45+05:30 IST

ద్వారకానగర్‌ సమీపం శ్రీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌మన్‌ దంపతులతో పాటు ఉంటున్న వారి ముగ్గురు కుమార్తెలు ఇంట్లో చెప్పకుండా

ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఇంటినుంచి వెళ్లిపోయి.. తల్లిఫోన్‌కు మెసేజ్ పెట్టారు.. అందులో ఉన్నది చదివి..

  • ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లామంటూ తల్లి సెల్‌కు సందేశం
  • రంగంలోకి దిగిన పోలీసులు
  • అంతలోనే.. చెన్నైలో ఉన్నామంటూ సందేశం
  • తిరిగి వచ్చేస్తున్నామంటూ సమాచారం 

సీతంపేట(విశాఖపట్నం): ద్వారకానగర్‌ సమీపం శ్రీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద వాచ్‌మన్‌ దంపతులతో పాటు ఉంటున్న వారి ముగ్గురు కుమార్తెలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. ‘తాము చనిపోయేందుకు వెళ్లిపోతున్నామని, వెతకవద్దంటూ’ తల్లి సెల్‌ఫోన్‌కు వీరు మెసేజ్‌ పంపడంతో ఆందోళన కలిగించింది. అంతలోనే ‘చెన్నైలో ఉన్నామని, తిరిగి ఇంటికి వచ్చేస్తాం’ అంటూ ఫోన్‌ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఊరట లభించింది. ఈ నేపథ్యంలో వీరు ఎప్పుడు వస్తారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ద్వారకానగర్‌ శ్రీనగర్‌ వెనుక ప్రాంతంలోని ఓ అపార్టుమెంట్‌లో  వాచ్‌మన్‌ దంపతులతో పాటు వారి ముగ్గురు కుమార్తెలు ఉంటున్నారు. కుమార్తెలకు 22, 20, 17 ఏళ్లుంటాయి. ప్రస్తుతం చదువుతున్నారు. సోమవారం సాయంత్రం ముగ్గురు కుమార్తెలు తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. ‘తమ కోసం వెతకవద్దని, చనిపోవడానికి వెళ్లిపోతున్నాం’ అంటూ తల్లికి ఫోన్‌ మెసేజ్‌ పెట్టారు. ఆ మెసేజ్‌ను చూసిన తల్లిదండ్రులు ఆందోళనకు గురై సోమవారం రాత్రి 11 గంటల సమయంలో ద్వారకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మురళీరావు తక్షణమే స్పందించి అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఆ ముగ్గురి వద్ద గల సెల్‌ఫోన్లు స్విచాఫ్‌ చేసి ఉండడంతో వారు ఎక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకోవడం కష్టమైంది. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఆ అమ్మాయిల వద్ద నుంచి వారి తల్లిదండ్రులకు ఫోన్‌ వచ్చింది. అనంతరం ఎస్‌ఐ స్వామినాయుడు ఆ ఫోను నెంబర్‌కు ఫోను చేసి ఆ ముగ్గురితో మాట్లాడారు. ఫోన్‌లో ఆ ముగ్గురూ మాట్లాడుతూ.. తాము చెన్నైలో సురక్షితంగా ఉన్నామని తెలిపారు. ఇంటికి వచ్చేస్తామంటూ తెలిపారు. కాగా, ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఎందుకు ఇంటి నుంచి వెళ్లిపోయారనే విషయం తెలియడం లేదని సీఐ మురళీరావు తెలిపారు. ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-19T08:50:45+05:30 IST