రహస్యంగా గుడిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. గ్రామస్థులు పట్టుకుని నిలదీస్తే..

ABN , First Publish Date - 2020-05-26T18:10:38+05:30 IST

ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలకు ప్రయత్నించిన ముఠాను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాలో

రహస్యంగా గుడిలోకి వెళ్లిన ముగ్గురు వ్యక్తులు.. గ్రామస్థులు పట్టుకుని నిలదీస్తే..

గుప్త నిధుల తవ్వకాలకు యత్నం 

వెల్జాల గోవిందరాజుల ఆలయం వద్ద సంఘటన 

ముగ్గురికి స్థానికుల దేహశుద్ధి

ముఠాసభ్యుల్లో ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఫ ముగ్గురిపై కేసు నమోదు 


తలకొండపల్లి(రంగారెడ్డి జిల్లా): ఆలయంలో గుప్త నిధుల తవ్వకాలకు ప్రయత్నించిన ముఠాను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్‌ గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. గుప్త నిధుల తవ్వకాల ముఠాలో ఓ కానిస్టేబుల్‌ కూడా ఉండడం అందరినీ విస్మయానికి గురి చేసింది. తలకొండపల్లి ఎస్‌ఐ సురేశ్‌ యాదవ్‌ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెల్జాల గ్రామ సమీపంలోని గోవిందరాజుల స్వామి ఆలయం అతి పురాతనమైంది. గుట్టపై ఉన్న ఈ ఆలయం గుహల్లో గుప్తనిధులు ఉన్నాయని భావించిన మాడ్గుల మండల కేంద్రానికి చెందిన గోరటి సుధాకర్‌, నాగర్‌కర్నూల్‌ జిల్లా చారగొండ మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వరికుప్పల వెంకటయ్య, షాద్‌నగర్‌ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల సిక్‌లీవ్‌లో ఉన్న వరప్రసాద్‌లు ముఠాగా ఏర్పడ్డారు. 


ఈ క్రమంలో ఆదివారం ఆలయ నిర్వాహకుడు అయ్యపురెడ్డి వద్దకు వెళ్లి ముఠా సభ్యులు ఆలయ అభివృద్ధి గురించి మాట్లాడుదామని తెలిపి ఫోన్‌నెంబర్‌ తీసుకున్నారు. మళ్లీ వస్తామని వెళ్లిపోయిన ముఠా సభ్యులు సోమవారం అయ్యపురెడ్డి ఆలయంలో లేని సమయంలో ఆలయం వద్దకు వచ్చి నేరుగా గుహలోకి వెళ్లారు. అదే సమయంలో ఆలయ సమీపంలో ఉన్న ఓ వ్యక్తి గమనించి మాధాయిపల్లి గ్రామస్థులకు సమాచారం అందిం చాడు. దీంతో గ్రామస్థులు ఆలయం వద్దకు చేరుకుని ముఠాసభ్యులు వెంకటయ్య, సుధాకర్‌, వరప్రసాద్‌లను చితకబాది ఆలయం వద్ద కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని ముగ్గురిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆలయ నిర్వాహకుడు అయ్యపురెడ్డి ఫిర్యాదు మేరకు గుప్తనిధుల తవ్వకాలకు ప్రయత్నించిన వెంకటయ్య, సుధాకర్‌, వరప్రసాద్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ యాదవ్‌ తెలిపారు. 

Updated Date - 2020-05-26T18:10:38+05:30 IST