అదే.. దాడి!

ABN , First Publish Date - 2020-07-09T09:41:57+05:30 IST

జిల్లాపై కొవిడ్‌ దాడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి.

అదే.. దాడి!

జిల్లావ్యాప్తంగా బుధవారం  65మందికి వైరస్‌ నిర్ధారణ

రాజమహేంద్రవరంలో 16, కాకినాడ నగరంలో 13, రూరల్‌లో 11

పెద్దాపురంలో 10, బిక్కవోలు,  దుర్గాడలో రెండేసి నమోదు

జిల్లాలో 2,489కి చేరిన కొవిడ్‌-19 కేసులు

కొవిడ్‌ లక్షణాలతో జిల్లాలో ముగ్గురి మృతి


(కాకినాడ-ఆంధ్రజ్యోతి) : జిల్లాపై కొవిడ్‌ దాడి కొనసాగుతోంది. ఎక్కడికక్కడ పదుల సంఖ్యలో కేసులు నిర్ధారణ అవుతూనే ఉన్నాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో పాజిటివ్‌ల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు వీటి సంఖ్య పెరిగిపోతూ నగర వాసులను కలవరపెడుతున్నాయి. పెద్ద ఎత్తున విస్తరిస్తున్న వైరస్‌ మహమ్మారికి  కట్టడి ఎప్పుడనేది అంతపట్టక వీరంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 65 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో అత్యధికంగా రాజమహేం ద్రవరంలో 16 మంది బాధితులను గుర్తించారు. వీరందరికి ఇటీవల పాజిటివ్‌ వచ్చిన  వ్యక్తుల ద్వారా వైరస్‌ వ్యాపించడంతో పాజిటివ్‌గా తేలింది. కాకినాడ నగరంలో 13 మందికి  కొవిడ్‌ సోకింది. వీరంతా నగరంలో వివిధ వార్డులకు చెందినవారు.


కాకినాడ రూరల్‌లో ఇంద్రపాలెం, చీడిగ, వాకలపూడి వలస పాకల, పనసపాడుల్లో 11 కేసులు గుర్తించారు. ఇటీవ ఏపీఎస్పీ 3వ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ ఒకరికి  పా జిటివ్‌  రాగా, ఆయన భార్య, కూతురికి బుధవారం కొవిడ్‌ నిర్ధారణ అయింది. పెద్దాపురంలో పట్టణం, రూరల్‌లో కట్టమూరు కలిపి పది మందిలో వైరస్‌ లక్షణాలు తేలాయి. మంగళవారం పెద్దాపురంలో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులకు సంబంధించిన కాంటాక్ట్‌ వ్యక్తులు వీరంతా. ఇటీవల ఇక్కడ ఓ బ్యాంకు క్రెడిట్‌ కార్డుల విభాగంలో పనిచేస్తూ వైరస్‌ బారిన పడ్డ ఉద్యోగి ద్వారా వీరందరికి వైరస్‌ సంక్రమించింది. రామచంద్రపురం మండలం వెల్ల జమిందార్‌ వీధిలో 32 ఏళ్ల వ్యక్తికి కొవిడ్‌ సోకింది. శంఖవరం మండలం మండపంలో ఓ వ్యక్తి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఈయనకు తేటగుంటకు చెందిన ఆర్‌ఎంపీ వైద్యుడు చికిత్స అందిస్తున్నారు. అయినా ఎంతకు తగ్గకపోవడంతో కాకినాడ జీజీహెచ్‌లో చేరగా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బిక్కవోలు 2, జగ్గంపేట 1, కడియం మండలం వేమగిరిలో 1, కాజులూరు మండలం దుగ్గుదూరు, కోరుకొండ, కాట్రే నికోన మండలం కందికుప్ప, పిఠాపురం, సామర్లకోట, ఉప్పాడలలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి. బుధవారం పాజిటివ్‌లతో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్‌ కేసులు 2,489కి చేరాయి. డిశ్చార్జిలు మొత్తం 867కాగా, పాజిటివ్‌ వచ్చి హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నవారు మొత్తం 311 మంది. అటు వరుస కేసులతో జిల్లాలో కంటైన్మెంట్‌ కేంద్రాలు మొత్తం 387కు చేరుకున్నాయి.


కొవిడ్‌తో మరో నలుగురు మృతి 

గొల్లప్రోలు మండలం దుర్గాడలో ఓ మెడికల్‌, కిరాణా దుకాణం నిర్వహిస్తున్న 50 ఏళ్ల వ్యక్తి జీజీ హెచ్‌లో కొవిడ్‌తో మృతి చెందాడు. అనారోగ్యంతో  ఇటీవల ఈయన జీజీహెచ్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు టీబీ వార్డులో చేర్చారు. అనంతరం పరిస్థితి విషమించడంతో కొవిడ్‌తో మృతి చెందాడు. పరీక్షల్లో ఈయన భార్యకు సైతం పాజిటివ్‌గా తేలింది. సామర్లకోటకు చెందిన 62 ఏళ్ల తాపీమేస్త్రిని జ్వరంగా ఉండడంతో జీజీహెచ్‌కు మంగళవారం తరలించారు. చివరకు కొవిడ్‌తో మృతి చెందాడు. సామర్లకోట మం డలం గొంచాలకు చెందిన 52 ఏళ్ల మహిళ కొవిడ్‌ లక్షణాలతో కన్నుమూసింది. కాకినాడ కొండయ్య పాలేనికి చెందిన 65 ఏళ్ల వ్యక్తి అనారోగ్యంతో ఈనెల నాలుగున జీజీహెచ్‌లో చేరారు. కొవిడ్‌ లక్షణాలతో బుధవారం కన్నుమూశారు.

Updated Date - 2020-07-09T09:41:57+05:30 IST