కళ్ల ముందే బుగ్గిపాలు

ABN , First Publish Date - 2022-05-19T06:06:19+05:30 IST

ఆ ఆరు కుటుంబాలకు చెందిన వారంతా ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో పెద్ద పెద్ద శబ్దాలతో అగ్నికీలలు ఎగసిపడడం కనిపించింది. దీంతో ఉలికిపడ్డ వారు వచ్చేసరికి తాటాకిళ్లు అగ్నికి ఆహు తవుతూ కనిపించాయి. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి శివారు అరిగెలవారిపేటలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

కళ్ల ముందే బుగ్గిపాలు
గంటిపెదపూడి శివారు అరిగెలవారిపేటలో దగ్ధమవుతున్న తాటాకిళ్లు

  • అరిగెలవారిపేటలో అగ్ని ప్రమాదం 
  • మూడు తాటాకిళ్లు దగ్ధం
  • రూ.9 లక్షల ఆస్తి నష్టం 
  • నిరాశ్రయులైన ఆరు కుటుంబాలు

పి.గన్నవరం, మే 18: ఆ ఆరు కుటుంబాలకు చెందిన వారంతా ఉపాధి హామీ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో పెద్ద పెద్ద శబ్దాలతో అగ్నికీలలు ఎగసిపడడం కనిపించింది. దీంతో ఉలికిపడ్డ వారు వచ్చేసరికి తాటాకిళ్లు అగ్నికి ఆహు తవుతూ కనిపించాయి. పి.గన్నవరం మండలం గంటిపెదపూడి శివారు అరిగెలవారిపేటలో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అరిగెలవారిపేటకు చెందిన అరిగెల చినసుబ్బారావు అనారోగ్యంతో ఉన్నాడు. ఉదయం పది గంటల సమయంలో తన తాటాకింట్లో నిద్రపోతున్నాడు. ఇంతలో విద్యుత షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడడంతో కంగారుగా బయటకు వచ్చాడు. ఈలోపే పక్కనే ఉన్న అరిగెల వెంకటేశ్వరరావు, అరిగెల తాతారావు తాటాకు ఇళ్లకు మంటలు వ్యాపించడంతో మూడిళ్లూ అగ్నికి పూర్తిగా ఆహుతయ్యాయి. ఆ సమయంలో ఇళ్లల్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పెద్ద పెద్ద శబ్ధాలు వచ్చాయి. కాగా ప్రమాద సమయంలో బాధిత కుటుంబాలు ఉపాధి హామీ పనుల్లో ఉండడంతో వస్తువులు తీసుకునే సమయం లేదు. దీంతో బంగారు నగలు, నగదు, గృహోపకరణాలు, వంట సామగ్రి, నిత్యావసర వస్తువులు అన్నీ దగ్ధమయ్యాయి. ఇళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, ఆధార్‌ కార్డులు కాలి బూడిదయ్యాయి. కొత్తపేట అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి ఫైర్‌ ఆఫీసర్‌ బి.బాలకృష్ణ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను అదుపు చేశారు. అరిగెల తాతారావు, శ్రీను, వీర వెంకట సత్యనారాయణ,  చినసుబ్బారావు, శ్రీను, వెంకటేశ్వరరావు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. రూ.9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. అగ్నిప్రమాద బాధిత ఒక్కో కుటుంబానికి రూ.5 వేలు, 25 కిలోల బియ్యం చొప్పున వైసీపీ నాయకుడు మంతెన రవిరాజు అందించారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, తహశీల్దార్‌ ఠాగూర్‌, ఎంపీడీవో ఐఈ కుమార్‌, ఆర్‌ఐలు జి.సుబ్రహ్మణ్యం, సీహెచ్‌ వంశీ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.


నగలు, నగదు అన్నీ ఆహుతయ్యాయి

అరిగెల గౌరమ్మ

ఉపాధి నిమిత్తం గల్ఫ్‌ వెళ్లి కూలి పనిచేసి నా కుమార్తె పంపించిన డబ్బు, నగలు అగ్నికి ఆహుతయ్యయి. బ్యాంకులో తాకట్టులో ఉన్న నగలను ఇటీవలే తెచ్చి ఇంట్లో పెట్టాం. ఇంటి నిర్మాణానికి కూడబెట్టుకున్న నగదు కూడా కాలిపోయింది. కట్టుకోవడానికి దుస్తులు కూడా లేవు. అనారోగ్యంతో ఉన్న నా భర్త చిన సుబ్బారావు బతికి బయటపడ్డాడు. 


నా అత్తగారు లేకపోతే నా పిల్లలు నాకు దక్కేవారు కాదు

అరిగెల మౌనిక

మా కుటుంబమంతా ఉపాధి హామీ పనులకు వెళ్లడంతో నా ముగ్గురు పిల్లలు సిరి (7), తాతాజీ (5), సరిత(3) ఇంట్లోనే ఉండి టీవీ చూస్తున్నారు. ఇంతలో మంటలు వ్యాపించడంతో దగ్గర్లో ఉన్న నా అత్త గారు నాగవేణి వెళ్లి పిల్లల్ని బయటకు తీసుకొచ్చింది. లేకపోతే నా బిడ్డలు నాకు దక్కేవారు కాదు. ఇనుప బీరువా, బంగారు వస్తువులు, రూ.10 వేల నగదు కాలిపోయాయి.

Updated Date - 2022-05-19T06:06:19+05:30 IST