ముగ్గురు అధిక వడ్డీ వ్యాపారులు అరెస్ట్‌

ABN , First Publish Date - 2020-06-05T09:24:10+05:30 IST

అధిక వడ్డీలు వసూలు చేస్తూ, చెల్లించలేనివారిని మారణాయుధాలతో బెదిరిస్తున్న ముగ్గురు వడ్డీ వ్యాపారులను గురువారం..

ముగ్గురు అధిక వడ్డీ వ్యాపారులు అరెస్ట్‌

రెండు కత్తులు.. ఒక వేట కొడవలి స్వాదీనం

వడ్డీ చెల్లించకుంటే కత్తులు, మారణాయుధాలతో బెదిరింపు

ఇప్పటికే వారిపై ఆరు కేసులు

జిల్లా బహిష్కరణ తప్పదు: డీఐజీ రామకృష్ణ


గుంటూరు, జూన్‌ 4: అధిక వడ్డీలు వసూలు చేస్తూ, చెల్లించలేనివారిని మారణాయుధాలతో బెదిరిస్తున్న ముగ్గురు వడ్డీ వ్యాపారులను గురువారం లాలాపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యానగర్‌ 1వ లైను ఎక్స్‌టెన్షన్‌కు చెందిన ఇమిడాబత్తిన కళ్యాణ్‌ చక్రవర్తి అలియాస్‌ పప్పుల నాని, నెహ్రూనగర్‌ 4వ లైనుకు చెందిన మాజేటి శేఖర్‌, పెదకాకాని మండలం వెనిగండ్లకు చెందిన యెజ్జు తేజ సత్య సాయికృష్ణ అనే ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి నుండి రెండు కత్తులు, ఒక వేట కొడవలి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులను నెట్టివేసి దౌర్జన్యానికి దిగడంతో పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరిలో ఇమడాబత్తిన కళ్యాణ్‌ చక్రవర్తి అలియాస్‌ పప్పుల నాని ఎటువంటి లైసెన్స్‌ లేకుండా 2009 నుంచి నూటికి 25 రూ.వడ్డీ చొప్పున అక్రమ వడ్డీ వసూలు చేస్తున్నారు.


అతని వద్ద రోజూవారి వడ్డీ వసూలు చేసేందుకు మాజేటి శేఖర్‌, యెజ్జు తేజ సత్య సాయికృష్ణలను నియమించుకున్నారు. వారిపై లాలాపేట, అరండల్‌పేట, పెదకాకాని, కొత్తపేట పోలీస్‌ స్టేషన్‌లలో 6 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అధిక వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని డీఐజీ రామకృష్ణ హెచ్చరించారు. అటువంటి వారిపై పీడీ యాక్ట్‌ ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అటువంటి వారిని జిల్లా బహిష్కరించేందుకు కూడా వెనుకాడబోమన్నారు.  

Updated Date - 2020-06-05T09:24:10+05:30 IST