ఆసిఫాబాద్‌ జిల్లాలో పొంచి ఉన్న నకిలీ విత్తనాల ముప్పు

ABN , First Publish Date - 2022-04-30T04:33:24+05:30 IST

నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. విత్తనాలు విత్తుకునే సమయంలో తనిఖీలు ఎక్కువగా ఉంటాయనుకుంటున్న వ్యాపారులు ఏటా వేసవిలోనే దందా మొదలు పెట్టి రైతులకు అంటగట్టేస్తున్నారు.

ఆసిఫాబాద్‌ జిల్లాలో పొంచి ఉన్న నకిలీ విత్తనాల ముప్పు

- గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా రైతులకు అంటగడుతున్న వైనం

- ప్రతీ ఏటా నకిలీ విత్తనాల పట్టివేత 

- ప్రత్యేక నిఘా లేకపోతే రైతులు మళ్లీ నష్టపోయే ప్రమాదం

- రైతులు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 29: నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి  ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా అక్రమార్కులు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. విత్తనాలు విత్తుకునే సమయంలో తనిఖీలు ఎక్కువగా ఉంటాయనుకుంటున్న వ్యాపారులు ఏటా వేసవిలోనే దందా మొదలు పెట్టి రైతులకు అంటగట్టేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేక నిఘాను పెంచాల్సిన అవసరం ఉందని రైతుసంఘాలు డిమాండ్‌ చేస్తు న్నాయి. బీటీ-3 పేరిట సాగవుతున్న ఈ నకిలీ-మకిలీలో స్థానిక వ్యాపారులతో పాటు కొంతమంది బడాబాబులు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారన్న ఆరోప ణలున్నాయి.  ప్రభుత్వం నిషేధించిన గ్లైసిల్‌ విత్తనాలను గ్రామాల్లో రైతులకు ప్రతీ ఏటా ఏజెంట్ల ద్వారా అంటగడుతున్నారు. రెండు మూడేళ్ల నుంచి చాలా మంది రైతులు బ్లాక్‌మార్కెట్లో ఈ విత్తనాలతో పాటు ఆ కంపెనీకే చెందిన గడ్డి మందును కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోయారు. వేలాది ఎకరాల్లో ఈ మందు పిచికారి చేయడంతో పత్తి మొక్కలు చనిపోయాయి. రైతులు తీవ్రంగా నష్టం చవిచూశారు. గతేడాది ఇదే ఎండాకాలం జిల్లా సరిహద్దు ప్రాంతమైన గూడెం గ్రామంలో రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన గ్లైసిల్‌ పత్తివిత్తనాలు 42లక్షల విలువ గల 21క్వింటాళ్ల నకిలీ పత్తివిత్తనాలతో పాటు, ఓ కారును స్వాధీనం చేసుకొని దీనికి సంబంధం ఉన్న ముగ్గురిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. అప్పట్లో ఈ సంఘటన కలకలం రేకేత్తించింది. పట్టుబడిన ఈ ముఠా గుంటూరు జిల్లా నూజివీడు పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తిం చారు. దాంతో ఇక్కడి వ్యవసాయ అధికారులు, పోలీసులు అనుమానిత ప్రాంతాల్లో జల్లెడ పట్టగా, పెద్దఎత్తున బీటీ-3 పేరిట విక్రయాలు జరుపు తున్న నకిలీ గ్లైసిల్‌ విత్తనాలను పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై వ్యవసాయ అధికారులు రైతాంగాన్ని ఎంత చైతన్య పరుస్తున్నా అధిక దిగుబడిపై ఆశ, కలుపు నివారిస్తుందన్న నమ్మకం, పెట్టుబడి పెద్దగా ఉండదన్న అభిప్రా యాల కారణంగా చిన్న, సన్నకారు రైతులు ఈ విత్తనాల పట్ల వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. సరిగ్గా ఈ అంశమే అక్రమార్కుల పంట పండిస్తోంది. 

ఏటా భారీగా అక్రమ దందా

నకిలీ నిత్తనాలతో పట్టుబడిన అక్రమ వ్యాపారులను అధికారులు విచారి స్తున్నప్పుడు గ్రామాల్లోని దళారులు, వ్యాపారుల ద్వారా రైతులకు నేరుగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దందా భారీ ఎత్తున సాగుతున్నట్లు వెళ్లడ వుతోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కువ విస్తీర్ణంలో పత్తి పంటను సాగుచేస్తు న్నారు. జిల్లాలోని మారుమూల మండలాలైన చింతలమానేపల్లి, కౌటాల, బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట, సిర్పూర్‌(టీ) మండలాల్లోని దాదాపు అన్ని గ్రామాల్లో విత్తనాలను రైతులకు అంటగడుతూ రైతాంగాన్ని తీవ్ర నష్ట పరుస్తున్నారు. నకిలీ పత్తి విత్తన ప్యాకెట్‌ 450గ్రాములు రూ.1000నుంచి 1500 వరకు విక్రయించగా, కిలో విత్తనాలు రూ. 2500నుంచి 3000 వరకు విక్రయించారు. 

నకిలీ విత్తనాలతో నష్ఠాలే ఎక్కువ..

గ్లైసిల్‌ విత్తనాలను రైతులు తమ తమ చేన్లల్లో వరుసగా 7సంవత్సరాలు సాగు చేస్తే మరుసటి సంవత్సరం నుంచి కనీసం మొలక కూడా మొలవక పోవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దళారుల వద్ద కొన్న నకిలీ విత్తనాలకు ఎలాంటి రశీదులు ఇవ్వరు కాబట్టి పంటనష్టపోతే రైతులకు ఎలాంటి ప్రభుత్వసాయం అందదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వీటి కారణంగా రైతుల భూముల భూసారం తగ్గిపోవడం, పర్యావరణ ముప్పు పొంచి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. 

కఠిన చర్యలు కరువు..

నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న క్రమంలో పట్టుబడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దందా ఏటా జోరుగా సాగుతోంది. నకిలీ విత్తనాలను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపడం రిపోర్ట్‌లు ఐదారు నెలల తర్వాత వచ్చే వరకు చార్జిషీట్‌ తయారు కాకపోవడంతో అక్రమ వ్యాపారులు ప్రతీఏటా ఈ దందానే వృత్తిగా ఎంచుకుంటున్నారు. 

కఠిన చర్యలు తప్పవు..

- రాజేష్‌, ఏవో

నకిలీ విత్తనాలను రైతులు కొనుగోలు చేసి మోసపోవద్దు. ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఎరువులు, విత్తనాల దుకాణాల్లో మాత్రమే విత్తనాలను, మందులను కొనుగోలు చేయాలి. నకిలీ విత్తనాలతో పట్టుబడ్డ వారిపై చట్టారిత్యా చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ఎవరైనా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే సమాచారం ఇచ్చి అధికారులకు సహకరించాలి. రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - 2022-04-30T04:33:24+05:30 IST