గర్భంతో ఉన్న వేల సీల్స్‌ మృతి.. కారణం తెలిస్తే షాక్..!

ABN , First Publish Date - 2020-10-26T00:05:42+05:30 IST

గర్భంతో ఉన్న వేలకొద్దీ సీల్స్‌ చనిపోయి బీచ్‌లో కనిపించాయి. నిండు గర్భంతో ఉండి పిల్లలకు జన్మినివ్వకుండానే ప్రాణాలు కోల్పోయాయి. ఈ దారుణ ఘటన సౌత్‌ ఆఫ్రికాలో...

గర్భంతో ఉన్న వేల సీల్స్‌ మృతి.. కారణం తెలిస్తే షాక్..!

జోహన్నెస్‌బర్గ్‌: గర్భంతో ఉన్న వేలకొద్దీ సీల్స్‌ చనిపోయి బీచ్‌లో కనిపించాయి. నిండు గర్భంతో ఉండి పిల్లలకు జన్మినివ్వకుండానే ప్రాణాలు కోల్పోయాయి. ఈ దారుణ ఘటన సౌత్‌ ఆఫ్రికాలో జరిగింది. నమీబియాలోని వాల్విస్‌ బే నగరం.. పెలికాన్‌ పాయింట్‌లో ఉన్న బీచ్‌ వద్ద ఓ సీల్‌ బ్రీడింగ్ కాలనీ ఉంది. ఇక్కడకు ఏటా వేల సంఖ్యలో గర్భంతో ఉన్న సీల్స్‌ వచ్చి పిల్లలకు జన్మనిస్తాయి. కొద్ది రోజుల క్రితం కూడా వేలకొద్దీ ఆడ సీల్స్‌ ఇక్కడకు వచ్చాయి. అవన్నీ గర్భంతో ఉన్నాయి. అయితే బీచ్‌ వచ్చిన తరువాత అవన్నీ చనిపోయాయి. ఇలా మరణించిన సీల్స్‌ సంఖ్య దాదాపు 7వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


ఈ సీల్స్‌ మృతదేహాలను సముద్ర పరిరక్షణకు చెందిన నౌడ్ డ్రేయర్ సెప్టెంబర్‌లో గుర్తించారు. అనంతరం అక్టోబర్ తొలి రెండు వారాల్లో పెద్ద సంఖ్యలో సీల్ పిండాలను చూసినట్లు నమీబియా డాల్ఫిన్ ప్రాజెక్టుకు చెందిన డాక్టర్ టెస్ గ్రిడ్లీ తెలిపారు.  సాధారణంగా సీల్స్ నవంబర్-డిసెంబర్ మధ్యకాలంలో పిల్లలకు జన్మనిస్తాయని చెప్పారు. అయితే వేల కొద్దీ ఆడ సీల్స్ పిల్లలను కనేందుకు బీచ్ వద్దకు వచ్చి అసహజంగా మరణించినట్లు గ్రిడ్లీ చెప్పారు. ఇలా పెద్ద సంఖ్యలో గర్భంతో ఉన్న ఆడ సీల్స్ చనిపోవడం వెనుక కారణం ఏమిటన్నది తెలియడం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.


కాలుష్యం, ఆహారలేమి లేదా బ్యాక్టీరియా సోకడం కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఆ సముద్ర తీరంలో తగిన సంఖ్యలో చేపలు లేక ఆహారం కొరత వల్లనే సీల్స్ మరణించి ఉంటాయని నమీబియా మత్స్యశాఖ మంత్రి చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరణించిన సీల్స్‌కు పరీక్ష అనంతరం దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

Updated Date - 2020-10-26T00:05:42+05:30 IST