ముంచేసి‘నది’

ABN , First Publish Date - 2022-08-16T05:34:42+05:30 IST

వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తూరు మండలంలోని పెనుగొటివాడ, సోమరాజపురం, మదనాపురం, మాతల, అంగూరు, కుంటిభద్ర, వసప, వసప కాలనీల్లో పంట పొలాలు నీటమునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి.

ముంచేసి‘నది’
గార : శాలిహుండంలో ముంపునకు గురైన పొలాలు

వేలాది ఎకరాల్లో నీటమునిగిన పంట పొలాలు
ఆందోళన చెందుతున్న రైతులు
(కొత్తూరు/నరసన్నపేట/ఎల్‌.ఎన్‌.పేట/జలుమూరు/గార/ఇచ్ఛాపురం రూరల్‌)

వంశధార నది ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్తూరు మండలంలోని పెనుగొటివాడ, సోమరాజపురం, మదనాపురం, మాతల, అంగూరు, కుంటిభద్ర, వసప, వసప కాలనీల్లో పంట పొలాలు నీటమునిగాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. చెరువుల గట్లు ధ్వంసమయ్యాయి. నివగాం నుంచి మదనాపురం, ఆకులతంపర గ్రామాలకు వెళ్లే రహదారిపైకి భారీగా నీరు చేరడంతో రాకపొకలు నిలిచిపోయాయి. వరద ప్రాంతాలను టెక్కలి ఆర్డీవో హనుమంతు జయరాం, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి, వైస్‌ ఎంపీపీ లొతుగెడ్డ తులసివరప్రసాద్‌ పరిశీలించి పరిస్థితి సమీక్షించారు. నరసన్నపేటలోని గెడ్డవానిపేట వద్ద నది రెండు ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. గెడ్డవానిపేట, వెంకటాపురం, కామేశ్వరిపేట, లుకలాం, చేనులవలస, ఉప్పరిపేట, బుచ్చిపేట, మడపాం, పోతయ్యవలస, గోపాలపెంట గ్రామ ప్రజలను తహసీల్దార్‌ సింహాచలం అప్రమత్తం చేశారు. అలాగే ఎల్‌.ఎన్‌.పేట మండలంలోని తీర ప్రాంతవాసులను తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ అప్రమత్తం చేశారు. జలుమూరు మండలం కొమనాపల్లి వద్ద సుమారు 500ఎకరాల వరినాట్లు నీటమునిగాయి. నదీ తీరగ్రామాల్లో తహసీల్దార్‌ సత్యం పర్యటించారు. నదిలోకి ఎవరూ వెళ్లరాదని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గార మండలం శాలిహుండం వద్ద వందలాది ఎకరాల వరినాట్లు నీటమునిగిపోయాయి.

బాహుదానదికి భారీ వరద
బాహుదానదికి వరదనీరు పోటెత్తింది. ఇచ్ఛాపురం మండలంలోని బూర్జపాడు, డొంకూరు, చిన్నలక్ష్మీపురం, పెద్ద లక్ష్మీపురం గ్రామాల్లో సుమారు 100 ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ఇనేసుపేట, ధర్మపురం, తులసిగాం గ్రామాల్లో మరో 100 ఎకరాల వరినాట్లు ముంపునకు గురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.   

 


Updated Date - 2022-08-16T05:34:42+05:30 IST