వ్యాక్సిన్ తీసుకోనివారు ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు

ABN , First Publish Date - 2021-06-20T11:43:26+05:30 IST

బీహార్‌లో కరోనా టీకాకు సంబంధించి నిరంతర ప్రచారం...

వ్యాక్సిన్ తీసుకోనివారు ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులు

పాట్నా: బీహార్‌లో కరోనా టీకాకు సంబంధించి నిరంతర ప్రచారం జరుగుతోంది. కరోనా వ్యాక్సిన్‌ను రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున తీసుకుంటున్నారని ప్రభుత్వం పేర్కొంది. రోజుకు ఆరు లక్షలకు పైగా టీకాలు వేయడం ద్వారా బీహార్... దేశంలోనే మొదటి రాష్ట్రంగా అవతరించింది.  టీకా ప్రచారాన్ని మ‌రింత వేగవంతం చేయడానికి బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వ‌ర‌లో రాష్ట్రంలో మూడు ద‌శ‌ల్లో పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. 


ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకునేవారికి  ప్ర‌భుత్వం ఒక నిబంధ‌న విధించింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి స‌మ్రాట్ చౌదరి ఒక కీల‌క ప్రకటన చేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న టీకా డ్రైవ్‌లో పంచాయతీ రాజ్ ప్రతినిధులందరూ టీకాలు వేయించుకోవాల‌ని కోరారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకోని వారిని పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని ఆయన కోరారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని స‌మ్రాట్ చౌదరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. బీహార్‌లో పంచాయతీల పదవీకాలం ముగిసింది. గత జూన్ 15 నుంచి పంచాయతీ రాజ్ వ్యవస్థల నిర్వ‌హ‌ణ‌ను కన్సల్టేటివ్ కమిటీ నిర్వహిస్తోంది. కరోనా కాలంలో ఎన్నికలు జరిగేంత‌ వరకు ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని బీహార్ ప్రభుత్వం భావిస్తోంది. తొలుత‌ ఈవీఎంలకు సంబంధించిన సమస్య, తరువాత కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా బీహార్‌లోని పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు కరోనా వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నందున రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య బీహార్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.

Updated Date - 2021-06-20T11:43:26+05:30 IST