ఆస్పత్రులపై ఆ నలుగురి ఆధిపత్యం

ABN , First Publish Date - 2022-05-25T06:20:37+05:30 IST

ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందించే భోజన కాంట్రాక్టును సైతం కాంట్రాక్టర్లు వదలడం లేదు. నిరుపేదలు చికిత్స పొందే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం నిధులు పెంచగా, జిల్లాలోని నలుగురు కాంట్రాక్టర్ల కారణంగా రోగులకు ఖరీదైన భోజనం అందడం లేదు.

ఆస్పత్రులపై ఆ నలుగురి ఆధిపత్యం

రాజకీయ ఒత్తిళ్లతో ఖరారుకాని భోజన టెండర్లు

నెల రోజులుగా ఖరీదైన భోజనానికి నోచుకోని రోగులు


నల్లగొండ, మే 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు అందించే భోజన కాంట్రాక్టును సైతం కాంట్రాక్టర్లు వదలడం లేదు. నిరుపేదలు చికిత్స పొందే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం నిధులు పెంచగా, జిల్లాలోని నలుగురు కాంట్రాక్టర్ల కారణంగా రోగులకు ఖరీదైన భోజనం అందడం లేదు. టెండర్‌ ఖరారుకు అధికారులు అన్ని నిబంధనలు పాటించినా రాజకీయ అండదండలతో వారిని ముప్పుతిప్పలు పెడుతుండటంతో తుది నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 


రెట్టింపైన భోజన చార్జీలు

గతంలో రోగికి ఆస్పత్రిలో భోజనం అందించేందుకు ప్రభుత్వం రోజుకు రూ.40 మాత్రమే చెల్లించేది. పెరిగిన ధరలు, విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం ఈ ధరను రెట్టింపు చేసింది. రోజుకు రూ.80 వరకు చెల్లించేందుకు సిద్ధపడింది. దీంతో పాటు వైద్యుల భోజనానికి రూ.160, ఆరోగ్యశ్రీ, క్షయ వంటి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులకు రోజుకు రూ.200 వరకు చెల్లించనుంది. దీంతో ఈ కాంట్రాక్టును దక్కించుకునేందుకు కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. ఇక్కడే అక్రమాలకు తెర తీశారు. ఒక కంపెనీ నుంచి ఒక జిల్లాలో 5 వరకు టెండర్లు దాఖలు చేసే అవకాశం ఉండడంతో నలుగురు కాంట్రాక్టర్లు రింగయ్యారు. ఒక్కో కంపెనీ నుంచి నాలుగు చోట్ల దరఖాస్తు చేసుకునేలా ప్రణాళిక రూపొందించారు. ఎక్కువలో ఎక్కువగా రూ.80, తక్కువలో తక్కువగా రూ.70 వరకు కోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ధేశించడంతో రింగైన కాంట్రాక్టర్లు  అన్ని చోట్ల రూ.72కే కోట్‌ చేశారు.


అధికారపార్టీ నేతలు రంగంలోకి దిగడంతో..

నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్పత్రితో పాటు మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌, దేవరకొండ, నకిరేకల్‌, మర్రిగూడ ఆస్పత్రుల్లో రోగులకు భోజన సరఫరా కోసం ఏప్రిల్‌ 25న కాంట్రాక్టర్ల నుంచి అధికారులు టెండర్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఈ గడువు ఈ నెల 5వ తేదీతో ముగిసింది. 6న అదనపు కలెక్టర్‌ కార్యాలయాల్లో టెండర్లు తెరిచారు. నకిరేకల్‌ ఆస్పత్రి ఎస్పీ కేటగిరీకి రిజర్వు చేయడంతో అక్కడ ఒకే ఒక దరఖాస్తు రావడంతో ఇబ్బంది లేకుండా పోయింది. నల్లగొండ జనరల్‌ ఆస్పత్రి, మర్రిగూడ, సాగర్‌ ఏరియా ఆస్పత్రులకు నలుగురు చొప్పున దేవరకొండ ఏరియా ఆస్పత్రికి ముగ్గురు చొప్పున కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. అంతా రింగై రూ.72 ధరకే కోట్‌ చేయడంతో జిల్లా అధికారులు డ్రాపద్ధతిని ఎంచుకున్నారు. దీనికి కాంట్రాక్టర్లు ఒప్పుకోకుండా ఇద్దరికి మాత్రమే అన్ని ఆస్పత్రుల టెండర్లు దక్కాలని పట్టుబట్టారు. అధికారులు వినే పరిస్థితి లేకపోవడంతో అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో వారిపై ఒత్తిడి తెచ్చి టెండర్ల ఖరారును నిలిపివేశారు. కాంట్రాక్టర్లు రింగైనా, ఆస్పత్రులను పంచుకునే విషయంలో విభేదాలు రావడంతో రెండు వర్గాలుగా మారి అధికారపార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల దగ్గరకు వెళ్లారు. నల్లగొండ జనరల్‌ ఆస్పత్రిలో 400 మంది రోగులు ఉండడం, సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ ఆస్పత్రి తనకే కావాలంటే తనకే కావాలని ఇద్దరు కాంట్రాక్టర్లు పట్టు విడవకపోవడం, వారి పక్షాన ఇరువురు నేతలు రంగంలోకి దిగడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. దీంతో నిధులున్నా నెల రోజులుగా ఖరీదైన భోజనానికి నిరుపేద రోగులు దూరమయ్యారు. టెండర్ల ఖరారులో జాప్యంపై డీసీహెచ్‌ఎ్‌స డాక్టర్‌ మాతృనాయక్‌ను వివరణ కోరగా అందరూ ఒకే ధర కోట్‌ చేయడంతో టెండర్ల ఖరారులో జాప్యం చోటుచేసుకుందని, త్వరలో సమస్యను పరిష్కరించి టెండర్లు ఖరారు చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-05-25T06:20:37+05:30 IST