మరో ‘నిత్యానంద’ దేశం

ABN , First Publish Date - 2020-08-24T19:53:23+05:30 IST

నిత్యానంద స్వామి గుర్తున్నాడు కదా. కైలాసగిరి పేరుతో ఏకంగా ఓ సొంత దేశాన్ని, కరెన్సీని ఏర్పాటు చేసుకున్నాడు. అలా కాకపోయినా... అటువంటి విషయమే ఇదీను. ఇక్కడేమిటంటే... మనమూ ఓ జెండాను ఏర్పాటు చేసుకోవచ్చు. వీలుంటే... దేశాధినేతలం కూడా కావచ్చు. వివరాలిలా ఉన్నాయి. చదవండి...

మరో ‘నిత్యానంద’ దేశం

బిర్‌తావిల్ : నిత్యానంద స్వామి గుర్తున్నాడు కదా. కైలాసగిరి పేరుతో ఏకంగా ఓ సొంత దేశాన్ని, కరెన్సీని ఏర్పాటు చేసుకున్నాడు. అలా కాకపోయినా... అటువంటి విషయమే ఇదీను. ఇక్కడేమిటంటే... మనమూ ఓ జెండాను ఏర్పాటు చేసుకోవచ్చు. వీలుంటే... దేశాధినేతలం కూడా కావచ్చు. వివరాలిలా ఉన్నాయి. చదవండి...


ఈజిప్ట్‌-సుడాన్‌ దేశాల మధ్య‘బిర్‌ తావిల్’ పేరుతో ఈ భూమ్మీద ఎవరికి చెందని ఓ ప్రదేశముంది. సుమారు రెండు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న ఈ నేలను ఇప్పటివరకూ ఎవరూ పట్టించుకోలేదు. గజం భూమి కోసమే ఏకంగా హత్యలే జరుగుతోన్న ఈ కాలంలో... ఇంత భూమి ఉత్తగా పడి ఉండడమంటే నిజంగా ఆశ్చర్యమే. ఈ నేల మాకొద్దంటే మాకొద్దంటూ ఈజిప్ట్‌, సూడాన్‌లు మంకుపట్టు పడుతున్నాయి.


కారణం... ఈ నేలలో గడ్డి కూడా మొలవకపోవడమే. అంటే... ఎడారి అన్నమాట. అందుకే ఇక్కడ నివసించడానికి ఎవరూ ఇష్టపడరు. నిర్మానుష్యంగా ఉంటుంది. పైగా ఈ నేలలో ఎలాంటి ఖనిజాలూ లేవు. ఈజిప్ట్‌, సూడాన్‌లు ఈ నేలపై ఏమాత్రం ఆసక్తి ప్రదర్శించకపోవడానికి ఇదే కారణం కావొచ్చని భావిస్తుంటారు. ఇలా రెండు దేశాలు ఓ ప్రాంతాన్ని అనాథగా వదిలివేయడానికి బ్రిటిష్‌ ప్రభుత్వమే కారణమన్న అభిప్రాయాలున్నాయి.


మరికొంత లోతుకు వెళితే... 1899 లో సూడాన్‌పై పెత్తనం విషయంలో బ్రిటన్‌, ఈజిప్ట్‌ మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా... సూడాన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాన్ని ఈజిప్టుకు అప్పగించింది బ్రిటన్‌. ఆరు నెలల తర్వాత బ్రిటన్‌కు ఏమనిపించిందో ఏమోగానీ ఒప్పందంలో సవరణలు చేసి పాలనా బాధ్యతలను కూడా సూడాన్‌కే అప్పగించింది.


ఆ తర్వాత... 1902 లో బ్రిటిష్‌ ప్రభుత్వం రెండు దేశాల మధ్య సరిహద్దులను ఏర్పాటు చేసింది. రెడ్‌ సీ తీరంలోని హలయాబ్‌ ట్రాయాంగిల్‌ ప్రాంతాన్ని సూడాన్‌లోని బ్రిటిష్‌ గవర్నర్‌ పాలనలోనే ఉంచేసుకుని, దానికి ఆనుకుని ఉన్న బిర్‌ తావిల్‌ను ఈజిప్ట్‌కు అప్పగించింది. అయితే... ఈజిప్ట్‌కు ఈ పంపకాలు నచ్చలేదు. హలయాబ్‌‌ను తమకిచ్చేసి, అవసరమైతే బిర్‌ తావిల్‌ను సూడాన్‌కు  ఇచ్చేయమని చెప్పింది.


అయితే... హలయాబ్‌ను ఇచ్చే ప్రసక్తేలేదని సూడాన్‌ తేల్చి చెప్పింది కూడా..! హలయాబ్‌ కోసం కొట్లాడుకుంటున్న ఈ రెండు దేశాలు బిర్‌ తావిల్‌ విషయంలో మాత్రం ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. ఉపయోగం లేని ఎడారి ప్రాంతం కాబట్టి రెండు దేశాలు బిర్‌ తావిల్‌ను వద్దంటే వద్దంటున్నాయి. అలా ఏ దేశానికి చెందని ప్రాంతంగా బిర్‌ తావిల్‌ మిగిలిపోయింది.


కాగా... ఆరేళ్ల కిందట వర్జీనియాకు చెందిన జెరెమా హీటన్‌... బిర్‌ తావిల్‌ ప్రాంతం తనదేనంటూ ప్రకటించుకున్నాడు. ఈజిప్టు మిలటరీ అధికారులు తనకు అనుమతి ఇచ్చారని కూడా చెప్పుకొచ్చాడు. అయితే... ఐక్యరాజ్య సమితి ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంది. ఇక... మూడేళ్ల కిందట మన దేశానికి చెందిన సుయాశ్‌ దీక్షిత్‌ కూడా ఇలాగే చేశాడు. ఆ ప్రాంతానికి వెళ్లి జెండాను ఎగరేశాడు. అది తన రాజ్యమంటూ ప్రకటించేసుకున్నాడు. ‘కింగ్‌డమ్‌ ఆఫ్‌ దీక్షిత్‌’గా పేరు కూడా పెట్టేసుకున్నాడు.


ఆ ప్రాంతానికి ప్రధానమంత్రిని తానేనని స్టేట్‌మెంట్ ఇచ్చుకున్నాడు. పాపం దీక్షిత్‌ను కూడా తేలిగ్గా తీసేసుకుంది యూఎన్‌ఓ. మొత్తంమీద ఆ ప్రాంతం ఇప్పటికీ... ‘ఎవరికీ చెందని ప్రాంతం’గా మిగిలిపోయింది. అన్నట్లు ప్రపంచ పటం సహా ఇతరత్రా ఆయా దేశాల సరిహద్దుల పటాల్లో కూడా ఈ ప్రాంత ప్రసక్తి లేకపోవడం విశేషం. 

Updated Date - 2020-08-24T19:53:23+05:30 IST