‘‘హలో... నేను తేజస్వీని...’’ బిహార్‌లో తెగ వైరల్ అవుతోన్న తేజస్వీ ఫోన్ కాల్

ABN , First Publish Date - 2021-01-21T19:13:35+05:30 IST

ఉపాధ్యాయుల ధర్నాకు అనుమతి నిమిత్తమై ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ ఉన్నతాధికారికి చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు రాష్ట్రంలోని

‘‘హలో... నేను తేజస్వీని...’’ బిహార్‌లో తెగ వైరల్ అవుతోన్న తేజస్వీ ఫోన్ కాల్

పాట్నా : ఉపాధ్యాయుల ధర్నాకు అనుమతి నిమిత్తమై ఆర్జేడీ యువ నేత తేజస్వీ యాదవ్ ఉన్నతాధికారికి చేసిన ఫోన్ కాల్ ఇప్పుడు రాష్ట్రంలోని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమ సమస్యల పరిష్కార నిమిత్తమై ప్రతి రోజూ  ధర్నా చేసే ప్రదేశంలోనే ధర్నా చేయాలని ఉపాధ్యాయులు నిర్ణయించుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు. దీంతో రంగంలోకి దిగిన తేజస్వీ... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పోలీస్ ఉన్నతాధికారులకు అనుమతి కోసం ఫోన్ చేశారు. నిరసనకు అనుమతినివ్వాలని తేజస్వీ డిమాండ్ చేశారు. చుట్టూ ఉపాధ్యాయులు ఉండగా, తేజస్వీ యాదవ్ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్‌కు ఫోన్ చేసి, లౌడ్ స్పీకర్ పెట్టి మరీ మాట్లాడారు. ‘‘ప్రతిరోజూ అనుమతి అడగాలా? వారిపై లాఠీఛార్జ్ చేశారు. వారు తెచ్చుకున్న టిఫిన్ డబ్బాలను విసిరేశారు. ఇవన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన వ్యక్తం చేయాలని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అనుమతి కోసం వాట్సాప్ ద్వారా మీకు ఓ లెటర్ పంపుతాను. దయచేసి నిరసన వ్యక్తం చేయడానికి ఉపాధ్యాయులను అనుమతించండి.’’ అంటూ తేజస్వీ ఫోన్‌లో కోరారు. 


దీనికి ఆ అధికారి బదులిస్తూ... ‘‘తప్పకుండా పరిశీలిస్తా..’’ అని జవాబిచ్చారు. ఆ తర్వాత అనుమతి ఎప్పుడిస్తారని తేజస్వీ ఆ అధికారిని ప్రశ్నించారు.  దీనికి అధికారి సమాధానమిస్తూ... ‘‘ఎప్పటి వరకూ అంటే అర్థం? నన్నే ప్రశ్నిస్తారా?’’ అంటూ అధికారి మండిపడ్డారు. ఈ మాటలకు తేజస్వీ సమాధానమిస్తూ... ‘‘నేను తేజస్వీని మాట్లాడుతున్నా.’’ అంటూ బదులిచ్చారు. అప్పుడు ఆ అధికారి... సార్.... సార్... సార్... అంటూ ఒక్కసారిగా టోన్ మార్చేశారు. అప్పుడు తేజస్వీ మాట్లాడుతూ... ‘‘నేను మీకు వాట్సాప్ ద్వారా అప్లికేషన్ పంపుతాను. తొందరగా స్పందించండి. లేదంటే రాత్రి వరకూ ఇక్కడే ధర్నాలో కూర్చుంటాం.’’ అంటూ ఆర్జేడీ నేత తేజస్వీ కాల్ కట్ చేశారు. 

Updated Date - 2021-01-21T19:13:35+05:30 IST