ఇదేం విద్యుత్‌ గోస..

ABN , First Publish Date - 2021-07-27T05:02:40+05:30 IST

అసలే వర్షాకాలం.. ఆపై తరచూ విద్యుత్‌ కోతలు.. దీంతో మండల ప్రజలకు తప్పని ఇబ్బందులు.

ఇదేం విద్యుత్‌ గోస..

  - తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం

  - చిన్నపాటి వర్షం వచ్చినా గంటల తరబడి విద్యుత్‌కోత

  - ఇబ్బందులు పడుతున్న ప్రజలు

బెజ్జూరు, జూలై 25: అసలే వర్షాకాలం.. ఆపై తరచూ విద్యుత్‌ కోతలు.. దీంతో మండల ప్రజలకు తప్పని ఇబ్బందులు. 24గంటలు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నా సిర్పూర్‌ నియోజకవర్గంలో మాత్రం తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. చీటికి మాటికి విద్యుత్‌ నిలిచిపోతున్నందున వినియోగదారులు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

మండలాల్లో పరిస్థితి..

సిర్పూర్‌ నియోజకవర్గంలోని సిర్పూర్‌(టి), కౌటాల, బెజ్జూరు, చింతలమానేపల్లి మండలాలకు ఈస్‌గాం 132/33విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నుంచి విద్యుత్‌ సరఫరా అవు తుంది. అక్కడి నుంచి ఆయా మండలాల్లోని గ్రామాలకు సుమారు 170కిలోమీటర్ల మేర విద్యుత్‌ సరఫరా అవుతుంది. అటవీ ప్రాంతాల నుంచి సరఫరా అవుతుండటంతో తరచూ విద్యుత్‌ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ఆయా మండలాల పరిధిలో ఏ చిన్నపాటి సమస్య తలెత్తినా నాలుగు మండలాలకు విద్యుత్‌ సౌకర్యం పూర్తిగా నిలిచిపోతుంది. ఇటీవల ఆరు నెలల నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా నిత్యం గంటల తరబడి విద్యుత్‌ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఇక బెజ్జూరు మండలంలో ప్రతి నిత్యం విద్యుత్‌ అంతరాయం కారణంగా మండల ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ అంతరాయం కారణంగా వినియోగదారులు ఏమైందోనని ఫోన్‌లు చేస్తే విద్యుత్‌ సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. ఇలా నిత్యం కాలంతో సంబంధం లేకుండా గంటల తరబడి విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలం కావడంతో దోమల వ్యాప్తి పెరగడంతో రాత్రిళ్లు నిద్ర లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నాళ్లు ఈ కష్టాలంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ సమస్యను అధిగమించేందుకు ఎనిమిది నెలల క్రితం కౌటాల మండల కేంద్రంలో 132/33 కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ మంజూరు అయింది. కానీ స్థల ఎంపికలో వివాదం తలెత్తగా పనులు నేటికీ ప్రారంభం కాలేదు. ఈ ప్రాంతంలో సబ్‌స్షేషన్‌ ఏర్పాటు చేసినట్లయితే నాలుగు మండలాలకు విద్యుత్‌ సమస్య తీరుతుంది. 

అటవీ అనుమతుల కోసం ఎదురుచూపు..

విద్యుత్‌ సమస్యలతో ఇక్కట్లు పడుతున్న ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు రెండేళ్ల క్రితం పెంచికలపేట సబ్‌స్టేషన్‌ నుంచి బెజ్జూరుకు విద్యుత్‌ ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేయగా అటవీ అనుమతులు లేక పనులు ముందుకు సాగడం లేదు. పెంచికలపేట నుంచి బెజ్జూరుకు విద్యుత్‌ సరఫరా చేసేందుకు రోడ్డు వెంట విద్యుత్‌ స్తంభాలు వేయగా అటవీ అధికారులు అనుమతులు లేవంటూ పనులను అడ్డు కున్నారు. దీంతో మళ్లీ సమస్య మొదటికొచ్చింది. ఈ మార్గంలో విద్యుత్‌ లైన్‌ వేసినా పూర్తిస్థాయిలో పనులు కాలేదు. పెంచికలపేట మీదుగా లైన్‌ వేసినా బెజ్జూరుకు విద్యుత్‌ సమస్య తలెత్తదని మండల ప్రజలు తెలుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్న మండల ప్రజల కష్టాలు తీర్చాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఉన్నతాధికారులకు నివేదించాం..

వాసుదేవ్‌, డీఈ, బెజ్జూరు

పెంచికలపేట-సలుగుపల్లి 33కేవీ లైన్‌ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. అటవీశాఖ అనుమతులు మంజూరు కాలేదు. అటవీ ప్రాంతంలో మూడు నాలుగు కిలో మీటర్లు లైన్‌ వేయాల్సి ఉంది. అనుమతులు రాగానే వేస్తాం. 

ఇబ్బందులు తీర్చాలి..

 - నేరెళ్ల సందీప్‌, బెజ్జూరు

మండలంలో విద్యుత్‌ కోతల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగు రోజులుగా కరిసిన భారీ వర్షానికి స్తంభాలు పడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచి పోయింది. అధికారులు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేసి విద్యుత్‌ను అందించారు. ఐతే ఇది తాత్కాలికమనే భావించవచ్చు. విద్యుత్‌కు అంతరాయం కలుగకుండా సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటే బావుంటుంది. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి సమస్య లేకుండా చూడాలి.

Updated Date - 2021-07-27T05:02:40+05:30 IST