దేశంలో థర్డ్‌ వేవ్‌!

ABN , First Publish Date - 2022-01-04T06:36:56+05:30 IST

మెట్రో నగరా ల్లో కలకలం.. చాలా రాష్ట్రాల్లో కలవ రం.. పైపైకి

దేశంలో థర్డ్‌ వేవ్‌!

  • మెట్రో నగరాల్లో 75 శాతం కేసులు ఒమైక్రాన్‌వే!
  • ఢిల్లీలో 81% పాజిటివ్‌లు.. వ్యాప్తి రేటు 6.4
  • థర్డ్‌ వేవ్‌లో ఉన్నాం.. ఒమైక్రానే కారణం: అరోరా
  • దేశంలో 33 వేల కేసులు.. పాజిటివిటీ 3.84
  • గోవాలో 10కి పైనే.. కొత్త ఏడాది వేడుకలతోనే
  • నౌకలో 60 మంది ప్రయాణికులకు వైరస్‌
  • బెంగాల్‌, బిహార్‌లో 180 మంది వైద్యులకు..
  • ముంబైలో నెలాఖరు వరకు బడులు మూసివేత
  • 33 వేల కొత్త కేసులు.. ఢిల్లీలో 6 పైనే పాజిటివిటీ.. మరిన్ని ఆంక్షలు!.. ముంబైలో బడులు బంద్‌
  • 187 మంది వైద్యులకు వైరస్‌


న్యూఢిల్లీ, జనవరి 3: మెట్రో నగరా ల్లో కలకలం.. చాలా రాష్ట్రాల్లో కలవ రం.. పైపైకి పాజిటివ్‌ రేటు.. చాప కింద నీరులా ఒమైక్రాన్‌ వ్యాప్తి.. భారీగా పెరుగుతున్న కేసులు..! మొత్తమ్మీద దేశంలో కొవిడ్‌ థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైనట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పరిస్థితి ముందుగానే పసిగట్టి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేయగా.. రాష్ట్రాలు మరిన్ని ఆంక్షలకు దిగుతున్నాయి. ఢిల్లీలో తాజాగా 187 నమూనాలకు జన్యు పరీక్షలు చేయగా, 152 (81%) నమూనాల్లో ఒమైక్రాన్‌ బయటపడింది. ఏడున్నర నెలల్లో ఎన్నడూ లేనంతగా ఢిల్లీలో సోమవారం 4,099 కేసులు వచ్చాయి. ఆదివారంతో పోలిస్తే ఇవి 28ు అధికం. పాజిటివ్‌ రేటు 6.46కు చేరింది. ముంబైలో రెండో రోజూ 8 వేలపైగా పాజిటివ్‌లు నమోదయ్యాయి. దేశంలో థర్డ్‌ వేవ్‌ మొదలైందని.. దీనికి ఒమైక్రానే కారణమని.. కొవిడ్‌ టీకా పంపిణీపై ఏర్పాటైన జాతీయ సలహా కమిటీ (ఎన్‌టీఏజీఐ) చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే ఆరోరా చెప్పారు.


ఢిల్లీ, కోల్‌కతా, ముంబైల్లో 75% పైగా కేసులకు ఒమైక్రానే కారణమని పేర్కొన్నారు. డిసెంబరు చివరి వారం ప్రారంభంలో జన్యు విశ్లేషణ చేసిన నమూనాల్లో 12% వాటిలోనే ఒమైక్రాన్‌ బయటపడిందని, ఇప్పుడది 28కి చేరిందన్నారు. థర్డ్‌ వేవ్‌ సంకేతంగా కేసుల గణాంకాలను చూపారు. థర్డ్‌ వేవ్‌ ఏప్రిల్‌ వరకు కొనసాగుతుందని ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ మణీంద్ర అగర్వాల్‌ తెలిపారు. ఎన్నికల ర్యాలీలు సూపర్‌ స్ర్పెడర్లుగా మారే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. థర్డ్‌ వేవ్‌ జనవరి- మార్చి మధ్య వస్తుందని మణీంద్ర గతంలో తెలిపారు. రోజుకు 1.80 లక్షల కేసులు వస్తాయన్నారు.  


గోవాలో రాత్రి కర్ఫ్యూ

ఢిల్లీలోకొత్త వేరియంట్‌ వేవ్‌ ప్రారంభమైనట్లు ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ చెప్పారు. నగరంలో ‘ఎల్లో అలర్ట్‌’ అమల్లో ఉంది. వరుసగా రెండు రోజులు పాజిటివిటీ 5పైన ఉంటే ‘రెడ్‌ అలర్ట్‌’ జారీ చేస్తారు. ఇదే జరిగితే పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించడంతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థలను మూసివేస్తారు. గోవాలో కొత్త సంవత్సర సంబరాలు కరోనా వ్యాప్తికి దారితీస్తున్నాయి. ఆదివారం 388 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. పాజిటివ్‌ రేటు 10.7గా నమోదైంది. రాత్రి కర్ఫ్యూ విధింపుతో పాటు మరిన్ని ఆంక్షలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2 వేల మందితో ముంబై నుంచి మార్మగోవా పోర్టుకు చేరిన కొర్డెలియా క్రూయిజ్‌ నౌకలో 66 మందికి కరోనా సోకినట్లు తేలింది. కోల్‌కతా జాతీయ వైద్య కళాశాలకు చెందిన 70 మంది, చిత్తరంజన్‌ సేవా సదన్‌ ఆస్పత్రిలో 24 మంది, రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆప్తమాలజీ ఆస్పత్రిలో 12 మంది, బిహార్‌ పట్నాలోని నలంద వైద్య కళాశాలలో 87 మంది వైద్యులకు పాజిటివ్‌ వచ్చింది. 



కరోనా బారిన సినీ, రాజకీయ ప్రముఖులు

కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే (65) కొవిడ్‌ బారినపడ్డారు. ఈయన గతంలోనూ వైర్‌సకు గురయ్యారు. కుటుంబంలో ఒకరికి, వ్యక్తిగత సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ ఐసొలేషన్‌లోకి వెళ్లారు. బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహాం (49) ఆయన భార్య ప్రియా రంచల్‌కు కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. సినీ, టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌(46) వైర్‌సకు గురయ్యారు. బాలీవుడ్‌ ప్రసిద్ధ నటుడు ప్రేమ్‌ చోప్రా(86) ఆయన భార్య ఉమా చోప్రాలకు కరోనా సోకింది. బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ నిర్వహించే ప్రజాదర్బార్‌లో పాల్గొన్న 14 మందికి వైరస్‌ సోకింది. రాష్ట్ర మాజీ సీఎం జీతన్‌ రామ్‌ మాంజీ (77), ఆయన ఇంట్లో 18 మందికి పాజిటివ్‌గా తేలింది. ఛత్తీ్‌సగఢ్‌ సుక్మా జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న 38 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వైరస్‌ బారినపడ్డారు.


దేశంలో కొత్త కేసులు 33 వేలు

గత నెల 27న 6,300 కేసులు.. ఆదివారం 33,750..! ఇదీ దేశంలో ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి తీరు. ఏడు రోజుల్లోనే పాజిటివ్‌ రేటు 0.61 నుంచి 3.84కు పెరిగింది. మహారాష్ట్రలో 12 వేలు, బెంగాల్‌లో 6 వేలు, ఢిల్లీలో 4 వేల కేసులు వచ్చాయి. గుజరాత్‌ (1,259)తో పాటు కర్ణాటక, తమిళనాడులోనూ వ్యాప్తి కనిపిస్తోంది. ముంబైలో 1 నుంచి 9వ తరగతి, 11వ తరగతి వారికి ప్రత్యక్ష తరగతులను నిలిపివేశారు.


కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరును ఈ నెల 31 వరకు నిలిపివేసింది. దేశంలో గడువు మీరిన కొవిడ్‌ టీకాలు వినియోగంలో ఉన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర ఆరోగ్య శాఖ తోసిపుచ్చింది. అక్టోబరులో భారత్‌ బయోటెక్‌ వినతి మేరకు కొవాక్సిన్‌ వినియోగ గడువు పరిమితిని 9 నుంచి 12 నెలలకు పెంచినట్లు పేర్కొంది. ఎన్నికలు  జరగబోయే యూపీ, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌, పంజాబ్‌లో టీకా పంపిణీ వేగిరం చేయాలని ఈసీ సూచించింది. థర్డ్‌ వేవ్‌ ఆందోళనల నేపథ్యంలో దేశంలో జన గణన ఇప్పట్లో జరగదని కేంద్రం స్పష్టం చేసింది. జిల్లాల సరిహద్దులు, ఇతర పౌర, పోలీస్‌ యూనిట్‌ల పరిధిని జూన్‌ వరకు మార్చొద్దని రాష్టాలకు స్పష్టం చేసింది.


‘కొవ్యాక్సిన్‌’ పాత స్టాక్‌కు రీ-లేబులింగ్‌ 

దేశవ్యాప్తంగా 15-18 ఏళ్లలోపు పిల్లలకు కొవ్యాక్సిన్‌ టీకాను వేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ నిల్వ కాలపరిమితిని 9 నెలల నుంచి 12 నెలలకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎ్‌ససీవో) పొడిగించింది. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల వద్దనున్న కొవ్యాక్సిన్‌ డోసుల స్టాక్‌ను సేకరించి, వాటికి రీ-లేబులింగ్‌ చేసే ప్రక్రియను భారత్‌ బయోటెక్‌ ప్రారంభించింది. 


Updated Date - 2022-01-04T06:36:56+05:30 IST