మా ఊరి రమామణి

ABN , First Publish Date - 2020-05-30T09:57:28+05:30 IST

‘మాతోపాటు చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకుంది.. ఆమె మా స్నేహితురాలు కావడం గర్వకారణం. మా ఊళ్లో మాతోపాటు చదువుకొని ఐఏఎస్‌ హోదాకు చేరుకొని మంచి పేరు తెచ్చుఉంది.

మా ఊరి రమామణి

తిమ్మాపురం బళ్లో చదువు

అన్నింటా తొలి స్థానం

ఆమెతో స్నేహం గర్వకారణం

సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గురించి జ్ఞాపకాలు


మహానంది/బండి ఆత్మకూరు: మే 29: ‘మాతోపాటు చదువుకొని ఉన్నత శిఖరాలు చేరుకుంది.. ఆమె మా స్నేహితురాలు కావడం గర్వకారణం. మా ఊళ్లో మాతోపాటు చదువుకొని ఐఏఎస్‌ హోదాకు చేరుకొని మంచి పేరు తెచ్చుఉంది. ఆమె వల్ల మా ఊరికి గుర్తింపు వచ్చింది. రమామణి ఇలా హఠాత్తుగా మరణించడం బాధాకరం’ గురువారం గుంటూరులో మృతి చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి టీకే రమామణి మిత్రుల అంతరంగం ఇది. ఆమె మృతి గురించి తెలుసుకున్న బాల్య మిత్రులు కలత చెందారు. రమామణి మహానంది మండలం ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ జడ్పీ పాఠశాలలో 1975-1979 వరకు 8, 9, 10 తరగతులు చదివారు. ఆమె స్వగ్రామం బండిఆత్మకూరు మండలం కడమలకాల్వ.


అక్కడి నుంచి తన సోదరుడు టీకే శశికుమార్‌తో కలిసి ఎం.తిమ్మాపురం పాఠశాలకు నాలుగు కిలోమీటర్లు నడచి వెళ్లేవారు. 1978-79 పదో తరగతిలో 29 మంది విద్యార్థులు చదువుకున్నారు. వారిలో ఐదుగురు అమ్మాయిలు. వారిలో ఒకరు రమామణి. ఆమె ప్రతి సబ్జక్ట్‌ల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు. అలా ఐఏఎస్‌ హోదాకు చేరుకున్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని విలువైన ప్రభుత్వ భూములను కాపాడిన ఘనత సంపాదించుకున్నారు. 


రమామణి జీవిత నేపథ్యం: 

రమామణి తండ్రి టీకేఆర్‌ శర్మ. తల్లి జానకి. వీరి నాలుగో సంతానంగా రమామణి 1964 అక్టోబరు 18న జన్మించారు. శర్మకు సోషలిస్టు భావాలు ఉండేవి. రమామణి ఐదో తరగతి వరకు కడమల కాల్వ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నారు. ఏడో తరగతి దాకా రెండు కిలోమీటర్ల దూరంలోని ఈర్నపాడు ప్రాథమికోన్నత పాఠశాలలో చదివారు. ఇంటర్‌, డిగ్రీ, అనంతపురం, పీజీ తిరుపతిలో చేశారు. 


చదువులో ఫస్టు ఉండేది: వీఆర్‌ వరప్రసాద్‌, ఉపాధ్యాయుడు

రమామణిని ఆరోజుల్లో ఉపాధ్యాయులు చదువుల తల్లి అనే వాళ్లు. అన్నిట్లో ఫస్టు ఉండేది. వర్షాన్ని లెక్క చేయకుండా తన సోదరుడు శివభూషణకుమార్‌తో కలిసి నాలుగు కిలో మీటర్లు నడిచి పాఠశాలకు వచ్చేది. ఆమెతో 8, 9, 10 తరగతులు కలిసి చదివాను. మాతోపాటు చదువుకొని ఐఏఎస్‌ హోదాకు చేరుకొందనే గర్వంగా ఉండేది. ఆమె హఠాత్తుగా మృతిచెందడం బాధగా ఉంది. 


కలసి మెలసి ఉండేది: గద్వాల శ్రీనివాసులు, పూర్వ విద్యార్థి 

రమామణికి మాజీ ఎమ్మెల్యే కూతురిని అని గర్వంగా ఫీలయ్యేది కాదు. తనతో పాటు చదువుకుంటున్న మా అందరితో సమానంగా ఉండేది. కలిసి మెలిసి తిరిగేది. చదువుపరంగా ఎంతో ముందుండి ఐఏఎస్‌ హోదాకు చేరుకుంది. ఆమె ఆకాలంగా మృతిచెందడం బాధాకరం. ఽనాతోటి విద్యార్థిని రమామణి మృతి చెందిందన్న వార్తను పత్రికల్లో చూసి బాధపడ్డాను.

Updated Date - 2020-05-30T09:57:28+05:30 IST