‘మంగళసూత్రం పోయిందని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు..’

ABN , First Publish Date - 2021-05-13T05:15:40+05:30 IST

‘‘ఐదు తులాల మంగళసూత్రం..

‘మంగళసూత్రం పోయిందని చెబుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు..’

ఆస్పత్రుల్లో దొంగలు

కొవిడ్‌ బాధితుల వద్ద ఆభరణాలు, డబ్బులు, సెల్‌ఫోన్లు కాజేస్తున్న కొంతమంది సిబ్బంది

విమ్స్‌లో తాజాగా ఓ మహిళ వద్ద నుంచి ఐదు తులాల మంగళసూత్రం అపహరణ

మృతుల శరీరాలపై నగలు కూడా మాయమవుతున్న వైనం

పలు ఇతర ఆస్పత్రుల్లోనూ ఈ తరహా ఘటనలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ‘‘ఐదు తులాల మంగళసూత్రం మెడలో నుంచి తీసేశారు. ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి మెడలోనే వున్న సూత్రం...ఎఫ్‌ఎన్‌వో వచ్చి దుస్తులు మార్చిన తరువాత నుంచి కనిపించడం లేదు. బంగారం పోయిందని వచ్చిన ప్రతి ఒక్కరికీ చెబుతున్నా...ఎవరూ పట్టించుకోవడం లేదు.’’ ...ఇదీ విమ్స్‌లో వైద్యం పొందుతూ ఐదు తులాల మంగళసూత్రం పోగొట్టుకున్న కె.మణి ఆవేదన. 


ఒక్క మణి మాత్రమే కాదు. ఎందరో కరోనా బాధితులు...ఈ ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారికి వైద్య సేవలు అందించాల్సిన సిబ్బందిలో కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కొద్దిరోజుల కిందట అదే విమ్స్‌లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలి వద్ద బం గారు ఆభరణాలను కొట్టేశారని, చనిపోయిన తరువాత మృతదేహాన్ని ఇవ్వడానికి కూడా నానా ఇబ్బందులు పెట్టారని ఆమె కుమార్తె సోషల్‌ మీడియా వేదికగా ఆరోపించారు. అదేవిధంగా నగర పరిధిలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఓ బాధితుడి ఖరీదైన మొబైల్‌ ఫోన్‌ను అక్కడి సిబ్బంది తస్కరించారు. దీనిపై కుటుంబ సభ్యులు సదరు ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. 


సాయం చేస్తున్నట్టు నటించి...

కొవిడ్‌ ఆస్పత్రుల్లో పనిచేసే కొంతమంది కిందిస్థాయి సిబ్బంది...కరోనా బారినపడి  ఆస్పత్రుల్లో ఎవరు చేరతారా?, వారి వద్ద ఏం దొరుకుతాయా? అనే చూస్తున్నారు. బాధితులకు సాయం చేస్తున్నట్టు నటించి...విలువైన వస్తువులను, ఆభరణాలను, డబ్బును కాజేస్తున్నారు. ఈ తరహా ఘటనలు విమ్స్‌, ఛాతీ, అంటువ్యాధుల ఆస్పత్రి, కేజీహెచ్‌లలో ఎక్కువగా జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయా వార్డుల్లోకి కుటుంబ సభ్యులు వెళ్లే పరిస్థితి లేకపోవడం కొంతమంది సిబ్బందికి కలిసివస్తోంది. ఇక కొవిడ్‌ వార్డుల్లో బాధితులకు...వారి కుటుంబ సభ్యులు ఇచ్చే ఆహారం, వస్ర్తాలు అందించాలంటే సదరు ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో, ఇతర సిబ్బంది వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు తీసుకుంటున్నారు. డబ్బులు ఇవ్వకపోతే...ఆ సామగ్రి చేరుతుందో లేదో కూడా తెలియదు. 


చనిపోయినా వదలరు.. 

కొంతమంది సిబ్బంది అయితే...వార్డులో చికిత్స పొం దుతున్న సమయంలో వారి  ఒంటిపై వున్న ఆభర ణాలు తీస్తే తెలిసిపోతుందని చనిపోయిన తరువాత కొట్టేస్తున్నారు. మృతదేహంపై ఏయే ఆభరణాలు వున్నాయో అధికారులకు తెలియజేసి, వారి కుటుంబ సభ్యులకు అందించాలి. అయితే, చెక్‌ చేసిన సమ యంలో కొంతమంది కిందిస్థాయి సిబ్బంది ఆభర ణాలు, డబ్బులు ఏమీ లేవని చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యులు ఎంత చెబుతున్నా...అక్కడ పట్టించుకనే నాథుడే వుండడం లేదు. విమ్స్‌లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయన్న విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. 


సీసీ పుటేజీలో.. 

కొవిడ్‌ వార్డుల్లోకి వెళ్లే ప్రతి సిబ్బంది పీపీఈ కిట్‌లో వుండడం వల్ల తమ వద్దకు వచ్చింది ఎవరు అనే విషయం బాధితులకు తెలియడం లేదు. ముఖ్యంగా ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వోలు వైరస్‌ బాధితులకు బట్టలు మార్చే సమయంలో చేతివాటం ప్రదర్శిస్తు న్నారు. మార్చిన బట్టల్లో వుండే డబ్బును కొట్టేస్తున్నారు. ఈ విషయాన్ని వైరస్‌ బాధిత వ్యక్తులు సకాలంలో గుర్తించలేకపోతున్నారు. అయితే, బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు..వార్డుల్లో వుండే సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించడం ద్వారా వారిని గుర్తించేందుకు అవకాశముంది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటే...భవిష్యత్తులో ఈ తరహా ఘటనలకు బ్రేక్‌ పడే అవకాశం ఉంది.


ఆస్పత్రిలో చేరినప్పుడు వివరాలు నమోదు - డాక్టర్‌ రాంబాబు, విమ్స్‌ డైరక్టర్‌

ఆస్పత్రిలో ఈ తరహా ఘటనలు జరగడం దురదృష్ట కరం. ఇటువంటి వాటిపై దృష్టిసారిస్తాం. వైరస్‌ బాధి తులు ఆస్పత్రిలో చేరడానికి ముందు ట్రయాజ్‌ వద్దే ఆమె/అతడికి సంబంధించి ఆభరణాలను కుటుం బ సభ్యులకు అప్పగించేలా చేస్తాం. కొన్ని తీయ లేని వస్తువులు ఉంటే... వాటి వివరాలను ఫొటో తీయడంతోపాటు కేస్‌ షీట్‌లో నమోదు చేస్తాం. దాని కింద సంబంధిత నర్శింగ్‌ సిబ్బంది, కుటుంబ సభ్యులు సంతకాలు చేస్తారు. డిశ్చార్జ్‌ అయిన ప్పుడు అవన్నీ తప్పనిసరిగా వారి కుటుంబ సభ్యు లకు అందించాలి. లేకపోతే, చేర్చుకున్నప్పుడు వున్న సిబ్బంది బాధ్యత వహించాల్సి ఉంటుంది.

Updated Date - 2021-05-13T05:15:40+05:30 IST