దొంగ దెబ్బ!

ABN , First Publish Date - 2022-08-07T06:30:20+05:30 IST

విద్యుత్‌ బిల్లులు మరింత భారం కానున్నాయి. ఎప్పుడో పెంచిన ట్రూ అప్‌ చార్జీలు ఆగస్టు నుంచి వసూలుకు ఆ శాఖ సిద్ధమైంది. గత సెస్టెంబర్‌లో వసూలుకు శ్రీకారం చుట్టగా జనాగ్రహంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే.

దొంగ దెబ్బ!

మళ్లీ ట్రూ అప్‌ చార్జీల మోత

గుట్టుచప్పుడు కాకుండా బాదుడు

షాక్‌ కొట్టనున్న విద్యుత్‌ బిల్లులు

2014-19మధ్య వినియోగం లెక్కతీసి..

వచ్చే 36 నెలలకూ వడ్డింపు

ఈనెల నుంచే వసూలుకు సిద్ధం

అద్దె ఇంట్లో ఉండే వారికి మరింత భారం

ఒంగోలు (క్రైం), ఆగస్టు 6: విద్యుత్‌ బిల్లులు మరింత భారం కానున్నాయి. ఎప్పుడో పెంచిన ట్రూ అప్‌ చార్జీలు ఆగస్టు నుంచి వసూలుకు ఆ శాఖ సిద్ధమైంది. గత సెస్టెంబర్‌లో వసూలుకు శ్రీకారం చుట్టగా జనాగ్రహంతో వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. అయితే గుట్టుచప్పుడు కాకుండా మళ్లీ ఇప్పుడు వినియోగదారులపై భారం మోపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎటువంటి ప్రకటన లేకుండా దొంగదెబ్బ తీసేందుకు చూస్తున్నారు. 2014-15 నుంచి 2018-19 మధ్య వినియోగిం చుకున్న యూనిట్లను లెక్కకట్టి సరాసరిన సెప్టెంబర్‌ నుంచి (ఆగస్టు వినియోగానికి సంబంధించి ఇచ్చే బిల్లులు) 36 నెలలు వడ్డించేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం అద్దె ఇళ్లలో ఉన్న వారిపై పెనుభారం పడనుంది. ఆగస్టు నుంచి వరుసగా 36 నెలలు అంటే 2025 జూలై వరకు ట్రూఅప్‌ చార్జీ వడ్డింపు ఉంటుంది.  


రూ.200 కోట్లు వసూలుకు చర్యలు

ట్రూఅప్‌ చార్జీల పేరుతో రూ.200కోట్ల వసూలుకు విద్యుత్‌ శాఖ సిద్ధమైంది. 2014-15 నుంచి 2018-19 వరకు సుమారు 8.5లక్షల కనెక్షన్లు ఉమ్మడి ప్రకాశంలో ఉన్నట్లు లెక్కతేల్చారు. ఆ సమయంలో వినియోగదారులు వాడిన యూనిట్లను పరిగణనలోకి తీసుకొని ఒక్కో యూనిట్‌కు 22పైసలు చొప్పున వసూలు చేస్తారు. దాన్ని 36 నెలలకు విభజించి బిల్లుల్లో వడ్డిస్తారు. అంటే నెలకు ఈవిధంగా రూ.5కోట్లపైన ట్రూ అప్‌ చార్జీలు వసూలు కావచ్చని అంచనా. అంటే 36 నెలల్లో రూ.200కోట్లపైనే ప్రజలపై భారం మోపనున్నారు. గతేడాది ఆగస్టు, సెప్టెంబర్‌లో ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించి ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో జగన్‌ సర్కారు వెనక్కి తగ్గింది. అయితే ట్రూఅప్‌ చార్జీలు ఖజానాకు ఆదాయం తెచ్చేవి కావడంతో మరలా తెరపైకి తీసుకొచ్చింది. 


అద్దె ఇళ్లలో కొత్తవారి పరిస్థితి ఎలా?

ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉన్న వారిపై ట్రూఅప్‌ చార్జీల భారం పడనుంది. ఎప్పుడో 2014-19 మధ్యలో వినియోగించిన విద్యుత్‌ భారం ఇప్పుడు కొత్తగా ఉంటున్న వారి నుంచి వసూలు చేయాల్సి ఉంది. దీనిపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. గతంలో వాడుకున్న వారి చార్జీలు తాము ఎలా కడతామంటూ కొందరు తిరస్కరించే అవకాశం ఉంది. ట్రూఅప్‌ చార్జీల వరకు ఇంటి యజమాని భరించాలనే డిమాండ్‌ కూడా మొదలైంది. దీనిపై వివాదాలు నెలకొనడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా ఈనెల బిల్లు చేతికి అందితే షాక్‌ కొట్టడం ఖాయం. దీనిపై కొందరు న్యాయనిపుణులను ఆశ్రయిస్తున్నారు.


Updated Date - 2022-08-07T06:30:20+05:30 IST