Abn logo
May 11 2021 @ 01:14AM

టీకాకై వచ్చారు.. నిబంధనలు మరిచారు

ఖానాపూర్‌లో కొవిడ్‌ టీకా కేంద్రం వద్ద నిబంధనలు బేఖాతరు చేస్తూ గుమిగూడిన జనం

ఖానాపూర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ కేంద్రం వద్ద గుమిగూడిన జనం ఫవ్యాక్సిన్‌ సరిపోదని ఆందోళనతో తోపులాట

సెంటర్‌వద్ద కరువైన అధికారుల పర్యవేక్షణ

గ్రామాల్లో క్యాంపులు పెట్టాలని ప్రజల డిమాండ్‌

ఖానాపూర్‌, మే 10 : మొదటి విడత కొవిడ్‌ టీకా తీసుకునే సమయంలో ఎటువంటి ఇబ్బం దులు లేకుండా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో గ్రామా ల్లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండోడోస్‌ తీసుకునే సమయం వచ్చాక టీకా సరిపడా లేదనే వదంతులు రోజురోజుకూ ఎక్కువవుతుండడం ప్రభుత్వం ఆన్‌లైన్‌లో స్లాట్‌బుక్‌ చేసుకోవాలనే నిబంధనలు పెట్టడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతందనడానికి ఖానాపూర్‌లో సోమవారం గుమిగూడిన జనమే సాక్ష్యంగా ని లుస్తున్నారు. సోమవారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఖానాపూర్‌లో 200 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. కాని సెంటర్‌ వద్దకు సుమారు 500 నుండి 700కు పైగా జనం తరలివచ్చారు. దీంతో ఆస్పత్రి ప్రాంగాణమంతా రద్దీగా మారింది. ఒక దశలో మాకంటే మాకు అనీ ప్రజలు ఒకరినొకరు తోసుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా జరిగే క్రమంలో ఇటు ప్రజలు గాని అటు అధికారులు గాని కొవిడ్‌ నిబంధనలు పాటించాలనే ఆలోచన చేయలేదు. కరోనా నుండి రక్షణ పోందాలని టీకా కోసం వచ్చిన జనం భౌతికదూరం పాటించక ఒకరిపై ఒకరు అన్నంతగా గుమిగూడడంతో అందులో ఎవరికైనా కరోనా ఉంటే అక్కడికి వచ్చిన వారి పరిస్థితి ఏంటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీకా కేంద్రానికి వచ్చే ప్రజలకు భౌతికదూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. కనీసం టీకా కేంద్రం వద్ద మంచినీళ్లుగాని నీడ సౌకర్యం కోసం టెంట్‌గాని ఏర్పాటు చేయకపోవడం పట్ల పలువురు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ఇప్పటికైనా ఖానాపూర్‌ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఏకైక టీకా కేంద్రం కాకుండా మొదటిడోస్‌ వేసేందుకు ఏఏ గ్రామాల్లోనైతే క్యాంప్‌లు వేశారో ఆ గ్రామాలన్నింటీలో క్యాంపులు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఖానాపూర్‌లోనైనా మరిన్ని టీకా కేంద్రాలు పెంచాలని కోరుతున్నారు. ఒక్కటే టీకా కేంద్రం ఉండడం అక్కడ 200 వరకు మాత్రమే వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంచడంపై మండల ప్రజలు మండిపడుతున్నారు. 

సోన్‌లో..

సోన్‌, మే 10 : కరోనా రెండో విడత రోజు రోజుకూ విజృంభిస్తుండడంతో కొవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం జనం పరుగులు పెడుతున్నారు.  ఉదయం ఏడు గంటలకే వ్యాక్సిన్‌ కేంద్రాలకు వచ్చి గంటల తరబడి నిలబడలేక, వ్యాక్సిన్‌ అందక ఇబ్బందులు పడుతున్నారు. సోన్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం కనిపించిన దృశ్యం అందుకు నిదర్శనం. కేంద్రాలకు తక్కువ డోసులు వ్యాక్సిన్‌ వస్తుండడంతో గందరగోళ పరిస్థితులు నెల కొంటున్నాయి. టీకా కోసం ఒక్కసారిగా జనం గుంపులు, గుంపులుగా ఎగబడు తుండడంతో ఇలా అయితే కరోనా కట్టడి ఎలా అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల వద్ద ఆరోగ్య సిబ్బంది ఎలాంటి ఏర్పాట్లు చేయక పోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వ్యాక్సిన్‌ రెండో డోస్‌కు ఎంత మంది ఉన్నారు. మొదటి డోస్‌ ఎంత మందికి ఇవ్వాలి అనే డేటా అధికారుల వద్ద ఉ న్నా వచ్చిన వ్యాక్సిన్‌ డోసుల దృష్ట్యా తక్కువ మందికే వ్యాక్సిన్‌ ఇవ్వాల్సి రావడంతో కేంద్రాలకు వచ్చి గంటల తరబడి వేచి చూచిన వెనుదిరుగు తున్నారు.