ఇళ్ల మధ్య శవాల పూడ్చివేతా.. అదేంటి?

ABN , First Publish Date - 2022-08-20T06:12:25+05:30 IST

శవాలను ఇళ్ల మధ్యనే పూడుస్తున్నారా.. అదేంటి? అని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఇళ్ల మధ్య శవాల పూడ్చివేతా.. అదేంటి?
బంగారమ్మ కాలనీని పరిశీలిస్తున్న విక్టర్‌ ప్రసాద్‌

ఆశ్చర్యానికి గురైన ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ 


తిరుపతి(రవాణా), ఆగస్టు 19: శవాలను ఇళ్ల మధ్యనే పూడుస్తున్నారా.. అదేంటి? అని ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ విక్టర్‌ ప్రసాద్‌ ఆశ్చర్యానికి గురయ్యారు. తిరుపతి పర్యటనలో భాగంగా శుక్రవారం తిరుపతి నగర పరిధిలోని తిమ్మినాయుడుపాళెం హరిజనవాడ వద్ద ఉన్న బంగారమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చైర్మన్‌కు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కొన్నేళ్లుగా ఇక్కడే జీవిస్తున్నామని, శ్మశానం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. శవాలను ఇళ్ల మధ్యనే పూడ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. కాలనీ పక్కనే ఉన్న అటవీశాఖ స్థలంలో శ్మశానవాటికను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై చైర్మన్‌ స్పందిస్తూ.. కలెక్టర్‌, అటవీ శాఖ అధికారులతో మాట్లాడి శ్మశాన వాటిక సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ఈనెల 24న తన కార్యాలయానికి రావాలని కాలనీవాసులను ఆహ్వానించారు. అనంతరం కాలనీ వద్ద ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అంబేడ్కర్‌ యువజన సంఘ అధ్యక్షుడు కాయం వెంకటరత్నం, కార్యవర్గ సభ్యులు దండు విజయ్‌, దండు షణ్ముగం, అగరం వెంకటేష్‌, మునెయ్య, గ్రామపెద్దలు ఏలుమలై, మద్దూరు అంకయ్య, అగరం చిరంజీవి, చెంచయ్య, దళిత సంఘ రాష్ట్ర నాయకుడు శ్రీనివాసులు, సైనిక సమతాదళ్‌ శ్రీకాళహస్తి అధ్యక్షుడు పులి శ్రీకాంత్‌, ఎంపీటీసీలు పవన్‌కుమార్‌, ఆనంద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-20T06:12:25+05:30 IST