గొర్రెలొస్తున్నాయ్‌!

ABN , First Publish Date - 2022-08-15T05:24:24+05:30 IST

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మళ్లీ దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆగిపోయిన గొర్రెల పంపిణీ పథకాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో కంటే యూనిట్‌ ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

గొర్రెలొస్తున్నాయ్‌!


  • రెండో విడత పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌
  •   రంగారెడ్డి జిల్లాలో 31,037 యూనిట్లు, వికారాబాద్‌లో 11,866, 
  • మేడ్చల్‌ జిల్లాలో 3వేల యూనిట్లు కేటాయింపు
  •  పెరిగిన యూనిట్‌ ధర రూ. 1.75లక్షలు 
  •  సెప్టెంబరు నుంచి పంపిణీకి సన్నాహాలు 
  • అక్రమాల అడ్డుకట్టకు ప్రత్యేక యాప్‌ 
  •  మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం


ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలపై మళ్లీ దృష్టి  సారించింది. ఈ క్రమంలోనే ఆగిపోయిన గొర్రెల పంపిణీ పథకాన్ని మళ్లీ ముందుకు తీసుకెళ్లేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. గతంలో కంటే యూనిట్‌ ధరను పెంచుతూ ఉత్తర్వులు జారీ  చేసింది. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు  చర్యలు చేపట్టారు. దీంతో గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లాప్రతినిధి): గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గొల్ల, కుర్మలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గతంలో ప్రభుత్వం అమలు చేసిన సబ్సిడీపై గొర్రెల పంపిణీ పథకం అర్థాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దాదాపు  ఐదేళ్ల పాటు నిలిచిపోయిన ఈ పథకాన్ని మళ్లీ పట్టాలెక్కిస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో గతంలో నిలిచిపోయిన రెండో విడత గొరెల్ర పంపిణీకి మోక్షం లభించినట్లయింది. తొలివిడత పంపిణీ కానీ యూనిట్లతో పాటు అదనంగా కొత్త యూనిట్లు మంజూరు చేశారు. దీంతో రంగారెడ్డిజిల్లాలో 31,037 యూనిట్లు ఈసారి పంపిణీ చేయనున్నారు. వికారాబాద్‌ జిల్లాలో 11,866 యూనిట్లు, మేడ్చల్‌ జిల్లాలో3వేల యూనిట్లు పంపిణీ చేయనున్నారు. గతంలో కంటే గొర్రెలు ధరలు పెరగడంతో ఈ సారి యూనిట్‌ ధర కూడా పెంచారు.  సర్కారు తాజాగా తీసుకున్న నిర్ణయంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆయా కులవృత్తుల వారి కోసం ప్రత్యేక పథకాలను ఆరంభించింది. ఇందులో భాగంగా 2017లో ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాను ప్రామాణికంగా తీసుకుని లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లు పంపిణీ చేశారు. అయితే తొలివిడత లక్ష్యాల మేరకు గొర్రెల పంపిణీ చేయలేదు. ఈ పథకంలో అవకతవకలు జరగడం, భారీగా నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో రెండో విడత పంపిణీ ఆరంభంలోనే ఆగిపోయింది. లబ్ధిదారుల ఎంపిక పూర్తయినప్పటికీ ఇంతవరకు వారికి గొర్రెలు పంపిణీ చేయలేదు. దీంతో అప్పటి నుంచి లబ్ధిదారులు గొర్రెల కోసం ఎదురుచూస్తున్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయించినా వీటిని విడుదల చేయలేదు. అలాగే  యూనిట్‌ ధర,  మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో రెండో విడత అసలు మొదలు కాలేదు. దీంతో ఐదేళ్లుగా కొత్తగా ఒక్క లబ్ధిదారుడికి కూడా ప్రయోజనం కలగలేదు. లబ్ధిదారులు తమకు ఎప్పుడు గొర్రెలు పంపిణీ చేస్తారా? అని  కళ్లుకాయలు కాసే విధంగా ఎదురుచూస్తేనే ఉన్నారు. ఈ క్రమంలో రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు  కసరత్తు చేస్తున్నారు.  రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో పంపిణీ చేయని యూనిట్లు రెండో విడతలో  చేస్తామని గతంలో ప్రకటించారు. దీనిప్రకారం రెండో విడత 21,037 యూనిట్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే కొన్నేండ్లేగా ఈ ప్రక్రియ ఆగిపోవడంతో రెండోవిడత అదనంగా 10వేల యూనిట్లు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో రంగారెడ్డిజిల్లాలో రెండోవిడతలో 31,037 యూనిట్లు పంపిణీ చేయనున్నారు. ఒక్కో యూనిట్‌ కింద లబ్ధిదారులకు ప్రభుత్వం 20 ఆడ గొర్రెలు, ఒక పొట్టేలు అందజేయనున్నారు. 

యూనిట్‌ ధర రూ. 1.75లక్షలు

మార్కెట్‌లో గొర్రెల ధరలు పెరగడంతో యూనిట్‌ విలువ కూడా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడత గొర్రెల పంపిణీ ప్రారంభించిన సమయంలో యూనిట్‌ విలువ రూ. 1.25లక్షలుగా ఉండగా ఇప్పుడు దీన్ని రూ.1.75లక్షలకు పెంచింది. 75శాతం సబ్సిడీతో ప్రభుత్వం గొర్రెలను పంపిణీ  చేయగా,  మిగిలిన  25శాతం లబ్ధిదారుడు భరించాల్సి ఉంటుంది.  దీంతో లబ్ధిదారుడు తన వాటా కింద పెరిగిన యూనిట్‌ వ్యయం మేరకు రూ.43,750లు చెల్లించాల్సి ఉంటుంది. గతంలో లబ్ధిదారులు రూ.31,250 చెల్లించే వారు. ఇప్పుడు యూనిట్‌ ధర పెరగడంతో లబ్ధిదారుడి వాటా కూడా పెరిగింది. రెండో విడతలో అక్రమాలకు తావివ్వకుండా ప్రభుత్వం మార్పులు చేసింది. గొర్రెలను రీసైక్లింగ్‌ చేసేలాంటి అక్రమాలను అడ్డుకట్టవేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టనుంది. లబ్ధిదారుల జాబితా నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను తయారు చేశారు. ఇందులో భాగంగా లబ్ధిదారులకు జిల్లా, మండల, గ్రామాల ఆధారంగా ప్రత్యేకంగా కోడ్‌ కేటాయించారు. లబ్ధిదారులకు గుర్తింపుసంఖ్యను కేటాయిస్తున్నారు.  దీని ప్రకారం లబ్ధిదారులే నేరుగా తమ ఖాతా నుంచి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఖాతాకు తమ వాటా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. 


వచ్చేనెల నుంచి పంపిణీ

రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని సెప్టెంబరు మొదటి వారం నుంచి ప్రారంభిస్తామని జిల్లా పశువైద్యాధికారి అంజిలప్ప తెలిపారు. తొలి విడత మిగిలిపోయిన 10వేల యూనిట్లతో పాటు గతంలో రెండో విడత కేటాయించిన 21,037 యూనిట్లు కలిపి మొత్తం 31,037 యూనిట్లు ఈ సారి పంపిణీ చేస్తామన్నారు. లబ్ధిదారుల వివరాలను కంప్యూటర్‌లో పొందుపరుస్తున్నామని, కొత్త మార్గదర్శకాలకు అనుగుణంగా వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2022-08-15T05:24:24+05:30 IST