ప్రకృతిని దోచేస్తున్నారు!

ABN , First Publish Date - 2022-07-14T04:24:28+05:30 IST

మానవాళికి ప్రకృతి ప్రసాదించే కొండలు, చిన్ననీటి చెరువులు, నదీ గర్భాలు, పచ్చని చెట్లు, ఇసుక.. ఇలా సహజ వనరులన్నీ అక్రమంగా తరలిపోతున్నాయి. కొంతమంది అధికారులు, రాజకీయ నాయకుల అండతో అక్రమార్కులు ఈ వనరులను దోచుకుంటున్నారు. గ్రానైట్‌, చిప్స్‌ పేరుతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. రహదారుల నిర్మాణం, లేఅవుట్లు కోసం కంకర అక్రమంగా తరలిస్తున్నారు. లీజు పేరుతో అతితక్కువ విస్తీర్ణం తీసుకొని.. ఎక్కువ విస్తీర్ణంలో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు.

ప్రకృతిని దోచేస్తున్నారు!
మందస ఏజెన్సీలో తవ్వకాలతో రూపుమారుతున్న కొండ

ఎక్కడికక్కడ ఆక్రమణలు.. అక్రమాలు
మాయమవుతున్న సహజ వనరులు
పరిరక్షణకు అధికారుల చర్యలు ఏవీ?

(హరిపురం)

మానవాళికి ప్రకృతి ప్రసాదించే కొండలు, చిన్ననీటి చెరువులు, నదీ గర్భాలు, పచ్చని చెట్లు, ఇసుక.. ఇలా సహజ వనరులన్నీ అక్రమంగా తరలిపోతున్నాయి. కొంతమంది అధికారులు, రాజకీయ నాయకుల అండతో అక్రమార్కులు ఈ వనరులను దోచుకుంటున్నారు. గ్రానైట్‌, చిప్స్‌ పేరుతో కొండలను సైతం పిండి చేస్తున్నారు. రహదారుల నిర్మాణం, లేఅవుట్లు కోసం కంకర అక్రమంగా తరలిస్తున్నారు. లీజు పేరుతో అతితక్కువ విస్తీర్ణం తీసుకొని.. ఎక్కువ విస్తీర్ణంలో అక్రమ తవ్వకాలు చేపడుతున్నారు. మందస, సోంపేట, పలాస, టెక్కలి, నందిగాం, భామిని, మెళియాపుట్టి, జలుమూరు వంటి పలు మండలాల్లో ఇష్టారాజ్యంగా కంకర కొండలు కొల్లగొడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా రాళ్లను పేల్చి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. వీటిపై ప్రశ్నించాల్సిన రెవెన్యూ, గనుల శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  

నిరంతరం ఇసుక రవాణా..
భూగర్భ జలాల రక్షణ కోసం ప్రభుత్వం జిల్లాలో అనేకచోట్ల ఇసుక విక్రయాలు నిలిపివేసింది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆశయం నీరుగారుతోంది. జిల్లాలో ప్రభుత్వమే ఇసుక రీచ్‌లు నిర్వహిస్తోంది. కాగా, వేలం ఆపేసిన మహేంద్ర తనయా నదిలో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మందస, సోంపేట, మెళియాపుట్టి మండలాల పరిధిలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో సుమారు 8 మండలాలకు తాగునీరందించే ఉద్దానం ప్రాజెక్టు, 5 రైల్వేస్టేషన్లకు నీరందించే తాగునీటి పథకం, మరో 5 చిన్న రక్షిత నీటి పథకాలకు ముప్పు ఏర్పడుతోంది. ఇసుక అక్రమ రవాణా వెనుక రాజకీయ నేతలు ఉండడంతో అధికారులు కిమ్మనడంలేదు.

ఆక్రమణలకు అంతే లేదు..
జిల్లాలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, గుట్టలు, రోడ్లు, నదీగర్భాలు, కాల్వలు ఆక్రమణల చెరలో చిక్కి శల్యమవుతున్నాయి. ప్రభుత్వ స్థలాను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతుండగా.. చెరువు గర్భాలను పంట పొలాలుగా మార్చి సాగు చేస్తున్నారు. వంశధార కాలువ గట్లు, మహేంద్ర తనయ నదీ గర్భాలు ఆక్రమించి కూరగాయలు, ఇతర పంటలు పండిస్తున్నారు. నదీ గమనంలో మార్పు ఏర్పడి భారీ వర్షాల సమయంలో నది ఒడ్డు కోతకు గురై ప్రజలను తీవ్ర క్షోభకు గురిచేస్తోంది. హరిపురంలో రూ.కోట్ల విలువచేసే కారి చెరువు, మందసలో ప్రభుత్వ స్థలాలు రియల్‌ ఎస్టేట్‌ భూములుగా మారుతున్నాయి. దీనిపై పరిశీలించాల్సిన రెవెన్యూ, పంచాయితీరాజ్‌, నీటిపారుదల శాఖ అధికారుల్లో కనీసం స్పందన లేదు.

పచ్చదనం మటుమాయం..
అటవీ సంపద అక్రమార్కుల గొడ్డలి వేటుకు బలైపోతోంది. నిత్యం ట్రాక్టర్లు, నాటుబళ్లు, వ్యానుల ద్వారా విలువైన కలప అంతరాష్ట్రాలకు అక్రమంగా తరలిపోతోంది. వెదురు, టేకు, రోజ్‌వుడ్‌, నేరడి వంటి విలువైన కలప రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నా పట్టించుకొనే నాధుడే కరవయ్యాడు. మందస, మెళియాపుట్టి, కొత్తూరు, పాతపట్నం వంటి ప్రాంతాలతో పాటు మహేంద్ర గిరులు, తీర ప్రాంతం నుంచి సరుగుడు వంటి కలప అక్రమంగా తరలిపోతోంది. ఇందులో సామిల్లు యజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తోంది. జిల్లాలో సగానికి పైగా సామిల్లులు అనధికారికంగా, చిన్న మిషన్లు పర్మిట్‌లతో పెద్ద మిషన్‌లు నడిపించేవి యథేచ్ఛగా కొనసాగుతున్నాయి.

భూగర్భ జలాలు కలుషితం..
భూగర్భ జలం కలుషితమవుతోంది. తాగునీటిని అందించే బోర్లు, బావుల చుట్టూ పారిశుధ్యం లోపించడంతో పాటు అనధికార బోర్లు తవ్వకం భూగర్భ జలాలు పాలిట శాపంగా మారింది. బోరు వేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కాగా గ్రామాల్లో అనధికార బోర్లు యథేచ్ఛగా వేసి భూగర్భ జలాల్ని తోడేస్తున్నారు. దీంతోపాటు జల కాలుష్యం అధికమవడంతో గ్రామాల్లో ప్రభుత్వ బోర్లు కాలుష్య బారిన పడి మూసివేసే స్థితికి చేరుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో సుమారు 155 బోర్లు కలుషిత జలాలతో మూసివేసినట్లు ఆర్‌డబ్యూఎస్‌ అధికారులు ప్రకటించారు. ఇంకా మరో 200పైగా బోర్లు నీరు లభ్యం కాక.. మరికొన్ని నాణ్యత లేని నీటిని అందిస్తున్నాయి.

సముద్ర తీరం ధ్వంసం..
సువిశాల సముద్ర తీరం కూడా అక్రమార్కుల పుణ్యమా ధ్వంసమవుతోంది. తీరప్రాంత రక్షణ కోసం అటవీ అధికారులు నాటిన సరుగుడు చెట్లు గొడ్డలి వేటుకు బలైపోతున్నాయి. దీంతో ఖాళీ అయిన తీర ప్రాంతంలో జీడి, కొబ్బరి మొక్కలు నాటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. తీర ప్రాంతంలో సుమారు 500 మీటర్లు వరకు ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ తీరం అంచున సముద్ర నీరు తాకిన వరకు పలు గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. రక్షణకోసం సహజసిద్ధంగా ఉన్న సముద్ర ఇసుక దిబ్బలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ఉపయోగించి కొందరు అక్రమ రవాణా చేపడుతున్నారు. దీంతో సముద్ర తీర ప్రాంతానికి తుఫాన్‌ల సమయాల్లో ఎలాంటి ముప్పు వాటిల్లుతోందనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

 

Updated Date - 2022-07-14T04:24:28+05:30 IST