ఈ ఫీజులు కట్టలేం!

ABN , First Publish Date - 2022-07-10T04:17:00+05:30 IST

అధిక ఫీజులు వసూలు చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇదీ ప్రభుత్వ హెచ్చరిక. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. సీటు కావాలంటే అడిగినంత ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పోటీ ప్రపంచం పేరిట అర్హత పరీక్ష నిర్వహిస్తూ.. విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. విద్యార్థులకు మెరుగైన బోధన అందించి ఉన్నతంగా తీర్చిదిదుతామని తల్లిదండ్రులకు ఆశ చూపుతున్నాయి. ఆపై రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నాయి.

ఈ ఫీజులు కట్టలేం!

ఖరీదవుతున్న కార్పొరేట్‌ విద్య
తల్లిదండ్రులకు ఆర్థిక ఇబ్బందులు
(హరిపురం)

- హరిపురం ప్రాంతంలోని ఓ వ్యక్తి తన కుమారుడిని ఎల్‌కేజీలో చేర్పించడానికి ఓ ప్రైవేటు విద్యాసంస్థను ఆశ్రయించారు. అక్కడ అడ్మిషన్‌ ఫీజు, ట్యూషన్‌ ఫీజు, బస్సు, పుస్తకాలు, యూనీఫాం ఇలా అన్నింటినీ కలిపి రూ.72వేలు చెల్లించాలని యాజమాన్యం సెలవిచ్చింది. దీంతో ఆ వ్యక్తి ఖంగుతిన్నాడు. ప్రాథమిక విద్యకే ఇంతంటే.. భవిష్యత్తులో చదివించడం కష్టమేనని వాపోయాడు.  

- పలాసలోని ఓ చిరుద్యోగి తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చదివించేవారు. ప్రస్తుతం ఆ పాఠశాల విలీనం పేరుతో ఎత్తివేయటంతో ఓ కార్పొరేట్‌ స్కూల్‌లో తమ పిల్లల్ని చేర్పించడానికి తీసుకెళ్లారు. అక్కడ ఫీజులు చూసి అదిరిపడ్డారు. ప్రైమరీ స్థాయిలో అయిదో తరగతి వరకు సీబీఎస్‌ఈ చదువుల పేరుతో అన్ని ఫీజులు కలిపి రూ.78వేలు కాగా పదోతరగతికి రూ.98వేలు చొప్పున నిర్ణయించారు. దీంతో ఆ ఉద్యోగి తమ చిన్నారులతో కలిసి ఇంటిబాట పట్టారు.

అధిక ఫీజులు వసూలు చేయొద్దు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. ఇదీ ప్రభుత్వ హెచ్చరిక. కానీ క్షేత్రస్థాయిలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. సీటు కావాలంటే అడిగినంత ఫీజు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. పోటీ ప్రపంచం పేరిట అర్హత పరీక్ష నిర్వహిస్తూ.. విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. విద్యార్థులకు మెరుగైన బోధన అందించి ఉన్నతంగా తీర్చిదిదుతామని తల్లిదండ్రులకు ఆశ చూపుతున్నాయి. ఆపై  రూ.వేలల్లో వసూళ్లు చేస్తున్నాయి. ఆర్థికంగా స్తోమతలేనివారు ఈ భారాన్ని భరించలేక.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించలేక సతమతమవుతున్నారు. జిల్లాలో 3,274 ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 2.76లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 480 ప్రైవేటు పాఠశాలల్లో దాదాపు  1.75 లక్షల మంది చిన్నారులు చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడు, అమ్మఒడి, ఆంగ్లమాధ్యమం వంటి పథకాలను ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. కానీ, ప్రస్తుతం పాఠశాలల విలీనంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల కొలిమి, ఉపాధ్యాయుల లేమి కారణాలతో చాలామంది ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఒకప్పుడు ఫీజులు నియంత్రణ ఉండే పాఠశాలల్లో సైతం నేడు ఏటా అందే ‘అమ్మఒడి’ సాయం దక్కించుకోవడానికి అంతకు మించి అన్నట్లు ఫీజులు పెంచేశారు. కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులు ఆకాశన్నంటుతున్నాయి.  ఉత్తమ ర్యాంకులు, పౌండేషన్‌ కోర్సులు, కేటగిరీలపేరుతో 10 నుంచి 15 శాతం అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ ప్రభుత్వ ఉత్తర్వులు
- ఫీజులను నిర్ధేశిస్తూ ప్రభుత్వం ఏడాది కిందట ఉత్తర్వులు ఇచ్చింది. జీవో నెం 53,54 ప్రకారం పంచాయతీలో ప్రాథమిక విద్యకు రూ.5-10వేలు, 6-10తరగతులకు రూ.12వేల చొప్పున నిర్ణయిస్తే. మున్సిపాలిటీల్లో రూ.11-15వేలు, కార్పొరేషన్ల పరిధిలో రూ.12-18 వేలు నిర్ణయించింది. ఈ ఫీజులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

- యూనిఫాం ఐదేళ్ల వరకు మార్చకూడదని, ఫౌండేషన్‌ కోర్సుల పేరుతో అఽధిక వసూలు తగదని, చెల్లించిన ఫీజులకు రసీదులు ఇవ్వాలని, తమ వద్దే పుస్తకాలు కొనాలంటూ ఒత్తిడి తేకూడదని పేర్కొంది. కానీ జిల్లాలోని ప్రైవేటు స్కూళ్లలో వీటి అమలు ఊసేలేదు.

- 2009లో విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. దీనిలోనూ ప్రైవేటు బడుల ఫీజులు, పేదపిల్లలను చేర్చుకునే అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. 25శాతం పేద పిల్లలకు కార్పొరేట్‌ బడుల్లో ఉచిత విద్యను అందిచాల్సి ఉన్నా.. అది తూతూ మంత్రంగానే అమలవుతోంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నియంత్రణకు ప్రభుత్వం ఓ ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఫీజుల నియంత్రణపై ఉన్నతాధికారుల సూచనల కోసం వేచి చూస్తున్నాం. జిల్లాలో వసూలు చేస్తున్న ఫీజుల విషయాలన్నీ సేకరిస్తున్నాం. ఉన్నతాధికారులకు నివేదిస్తాం. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై చర్యలు తీసుకుంటాం.  
- జి.పగడాలమ్మ, డీఈవో

 

Updated Date - 2022-07-10T04:17:00+05:30 IST