కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే!

ABN , First Publish Date - 2021-07-08T08:22:48+05:30 IST

మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా(50) ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.

కొలువుదీరిన కొత్త మంత్రులు వీరే!

  • దాదాపు అందరూ  ఉన్నత విద్యావంతులే..
  • ఏడుగురు మహిళలకు కొత్తగా చోటు


ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం భారీస్థాయిలో చేపట్టిన మంత్రి మండలి విస్తరణలో 43 మందికి కేంద్ర మంత్రులుగా అవకాశం లభించింది. వీరిలో ప్రస్తుతం సహాయ మంత్రులుగా ఉన్న ఏడుగురు కేబినెట్‌ మంత్రులుగా పదోన్నతి పొంది ప్రమాణం చేశారు. మిగతా 36 మందిలో అనేకులు కొత్తవారే, దాదాపు అందరూ ఉన్నత విద్యావంతులే కావడం విశేషం. అలాగే... కొత్తగా ఏడుగురు మహిళలకు (మీనాక్షి లేఖి, అనుప్రియ సింగ్‌ పటేల్‌, శోభ కరంద్లాజే, దర్శన విక్రమ్‌ జర్దోష్‌, అన్నపూర్ణా దేవి, ప్రతిమా భౌమిక్‌, భారతి ప్రవీణ్‌ పవార్‌) చోటు లభించింది. ఇప్పటికే ఉన్న నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ, సాధ్వి నిరంజన్‌ జ్యోతి, రేణుకా సింగ్‌ సరుతతో కలిపితే మహిళా మంత్రుల సంఖ్య 11కు చేరినట్లయింది. వీరిల అనుప్రియ గతంలోనూ మోదీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ సహాయమంత్రిగా చేశారు. మోదీ తొలి ప్రభుత్వం (2014-19)లో తొమ్మిది మంది మహిళా మంత్రులు ఉన్నారు. రెండోసారి ఐదుగురు మహిళలకు చోటు కల్పించగా.. వారిలో దేవశ్రీ చౌదరి బుధవారం రాజీనామా చేశారు. ఇక, కొత్తగా మంత్రివర్గంలో చేరినవారి వివరాలు పరిశీలిస్తే.. 


నారాయణ్‌ తాతు రాణే

 మహారాష్ట్ర మాజీ సీఎంగా సేవలందించిన రాణే (69) ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా సేవలందించారు. ఆదాయ పన్ను శాఖ అధికారిగా సేవలందించారు.



భూపేందర్‌ యాదవ్‌

రాజస్థాన్‌కు చెందిన భూపేందర్‌ యాదవ్‌ (52) రాజ్యసభ సభ్యునిగా రెండోసారి కొనసాగుతున్నారు. అనేక పార్లమెంటరీ కమిటీలకు నాయకత్వం వహించారు. ఈయన అజ్మీర్‌ కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు.


రామచంద్ర ప్రసాద్‌ సింగ్‌: బీహార్‌కు చెందిన రామచంద్ర (63) ప్రస్తు తం రాజ్యసభ సభ్యునిగా వ్యవహరిస్తున్నారు. ఈయన 1984 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. ఈయన జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపై ఎంఏ చదివారు.


అశ్వినీ వైష్ణవ్‌: ఒడిశాకు చెందిన అశ్వినీ వైష్ణవ్‌ (50) రాజ్యసభ సభ్యు డు. ఈయన 1994వ బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. ఐఐ టీ కాన్పూర్‌లో ఎంటెక్‌, యూఎ్‌సలో ఎంబీఏ చేశారు.


పశుపతి కుమార్‌ పరాస్‌: బిహార్‌కు చెందిన పశుపతి కుమార్‌ (68) హాజీపూర్‌ లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా, ఒక పర్యాయం ఎమ్మెల్సీగా వ్యవహరించారు.  భాగల్పూర్‌ యూనివర్సిటీలో బీఈడీ పూర్తిచేశారు.


పంకజ్‌ చౌధరి: ఉత్తరప్రదేశ్‌కు చెందిన పంకజ్‌ చౌధరి (56) మహారాజ్‌గంజ్‌ నియోజకవర్గం ఎంపీగా కొనసాగుతున్నారు. ఈయన ఆరో పర్యాయం ఎంపీగా గెలిచారు.  


ప్రొ.ఎస్పీ సింగ్‌ బాఘేల్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిదిన బాఘేల్‌ ఐదో పర్యాయం లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఎల్‌ఎల్‌బీతోపాటు ఎంఏ, ఎంఎస్సీ చదువుకున్నారు. పీహెచ్‌డీ చేశారు.


రాజీవ్‌ చంద్రశేఖర్‌: కర్నాటకకు చెందిన రాజీవ్‌ చంద్రశేఖర్‌ (57) మూడోసారి ఎంపీ.  ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌ చేసిన ఈయన.. హార్వర్డ్‌ వర్సిటీలో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశారు. 


శోభ కరంద్లాజే: ఉడిపిచిక్‌మగ్‌ళూరు లోక్‌సభ సభ్యురాలిగా ఉన్న శోభ (54) రెండో పర్యాయం ఎంపీగా కొనసాగుతున్నారు. ఎంఏ సోషియాలజీలో డిగ్రీ చేశారు.


భాను ప్రతాప్‌ సింగ్‌ వర్మ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్మ (63) ఐదో సారి ఎంపీగా గెలుపొందారు. బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీలో ఎంఏ, ఎల్‌ఎల్‌బీ చదివారు.


దర్శన విక్రమ్‌ జర్దోష్‌: గుజరాత్‌కు చెందిన జర్దోష్‌ (60) సూర్‌ లోక్‌సభ సభ్యురాలిగా మూడోసారి కొనసాగుతున్నారు.  నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నారు.


మీనాక్షి లేఖి: న్యూఢిల్లీకి చెందిన మీనాక్షి లేఖి (54) రెండోసారిలోక్‌సభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.  ఎల్‌ఎల్‌బీ చదువుకుని.. సుప్రీంకోర్టు లాయర్‌గా, సోషల్‌ వర్కర్‌గా సేవలందించారు.


అన్నపూర్ణాదేవి: ఝార్ఖండ్‌కు చెందిన అన్నపూర్ణాదేవి (51) తొలిసారి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.  ఎంఏ హిస్టరీ చదివారు.


ఏ నారాయణ స్వామి: చిత్రదుర్గ్‌ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన నారాయణ స్వామి (64) గతంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశా రు. బెంగళూరు ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ చదువుకున్నారు.


కౌషల్‌ కిశోర్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కిశోర్‌(61) రెండో పర్యాయం లోక్‌సభ సభ్యునిగా కొనసాగుతున్నారు.ఈయన బీఎస్సీ చదువుకున్నారు.


అజయ్‌ భట్‌: ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ ఉధమ్‌సింగ్‌ నగర్‌ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన అజయ్‌భట్‌ (61)  25ఏళ్ల నుంచి ప్రజాజీవితంలో ఉన్నారు. ఎల్‌ఎల్‌బీ చేసి లాయర్‌గా కూడా ప్రాక్టీస్‌ చేశారు.


డా.ఎల్‌ మురుగన్‌: తమిళనాడుకు చెందిన మురుగన్‌ (44) మద్రాస్‌ హైకోర్టు లాయర్‌గా 15ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. 


నిశిత్‌ ప్రమాణిక్‌: పశ్చిమబెంగాల్‌కు చెందిన ప్రమాణిక్‌ (35) కూచ్‌ బేహార్‌ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన ప్రైమరీ స్కూల్‌లో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేశారు. బీసీఏ డిగ్రీ చదివారు.

- న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి


బీఎల్‌ వర్మ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన వర్మ(59) ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు.  వారణాసిలో ఎంఏ చదువుకున్నారు.


అజయ్‌ కుమార్‌: ఉత్తరప్రదేశ్‌కు చెందిన కుమార్‌ (60) రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు.  బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ చదువుకున్నారు.


చౌహాన్‌ సిన్హ్‌: గుజరాత్‌కు చెందిన చౌహాన్‌ (56) ఖేదా నుంచి లోక్‌సభకు రెండోసారి ఎన్నికయ్యారు.  ఆలిండియా రేడియోలో ఇంజినీరుగా పనిచేశారు. పోర్‌బందర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీలో డిప్లొమా చేశారు.


భగవంత్‌ ఖూబా: కర్ణాటకకు చెందిన ఖూబా (54) రెండో పర్యాయం లోక్‌సభకు ఎన్నికయ్యారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో బీటెక్‌ చేశారు.


కపిల్‌ మోరేశ్వర్‌ పాటిల్‌: మహారాష్ట్రకు చెందిన మోరేశ్వర్‌ (60) రెండోసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ముంబైలో బీఏ చదువుకున్నారు.


సుశ్రీ ప్రతిమా భౌమిక్‌: అగర్తలాకు చెందిన భౌమిక్‌ (52) వెస్ట్‌ త్రిపుర నుంచి లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈమె బయోసైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశారు.


డా.శుభాస్‌ సర్కార్‌: పశ్చిమబెంగాల్‌కు చెందిన సర్కార్‌ (67) బంకుర నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన గైనకాలజిస్ట్‌. ఐదు దశాబ్దాలుగా రామకృష్ణ మిషన్‌ ద్వారా సేవలందిస్తున్నారు.


డా. భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌: మహారాష్ట్రకు చెందిన కరాడ్‌ (64) తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఎంబీబీఎస్‌, ఎంఎస్‌ జనరల్‌ సర్జరీ చేసి మల్టీ స్పెషాలిటీ రిసెర్చ్‌ ఆస్పత్రిని నిర్వహిస్తున్నారు.


డా.రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌: మణిపూర్‌కు చెందిన రంజన్‌ సింగ్‌ (68) తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. గౌహతి వర్సిటీలో ఎమ్మే, పీహెచ్‌డీ చేసి  జాగ్రఫీ ప్రొఫెసర్‌గా సేవలందించారు.


డా.భారతి ప్రవీణ్‌ పవార్‌: మహారాష్ట్రకు చెందిన ప్రవీణ్‌ పవార్‌ (42) తొలిసారి ఎంపీ. ఎంబీబీఎస్‌ చేసి వైద్యంచేస్తున్నారు.


బిశ్వేశ్వర్‌ తుడు: ఒడిశాకు చెందిన తుడా (56) తొలిసారిగా లోక్‌సభ కు ఎన్నికయ్యారు. ఎలక్ర్టికల్‌ ఇంజినీరింగ్‌లో డిప్లొమాచేశారు.


శాంతనూ ఠాకూర్‌: పశ్చిమబెంగాల్‌కు చెందిన ఠాకూర్‌ (38) బొంగాన్‌ నుంచి తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. కర్ణాటక ఒపెన్‌ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లీష్‌ చదువుకున్నారు.


డా.ముంజపార మహేంద్రభాయ్‌: గుజరాత్‌కు చెందిన మహేంద్రభాయ్‌ (52) తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు.  ఈ కార్డియాలజిస్టు.. గతంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.


జాన్‌ బార్ల: పశ్చిమబెంగాల్‌కు చెందిన జాన్‌ బార్ల (45) తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన నార్త్‌ బెంగాల్‌లో టీ గార్డెన్‌ వర్కర్ల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడారు.


జ్యోతిరాదిత్య సింధియా

మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియా(50) ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఈయన గతంలో నాలుగు పర్యాయాలు లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఈయన గతంలో యూపీఏ హయాంలో కేంద్ర ఇంధనశాఖ స్వతంత్ర మంత్రిగా, వాణిజ్యం, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.

Updated Date - 2021-07-08T08:22:48+05:30 IST