పశువైద్యం... దైన్యం!

ABN , First Publish Date - 2021-08-06T05:17:28+05:30 IST

పశువైద్యంపై అయోమయం నెలకొంది. స్వయానా పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సొంత జిల్లాలోనే ఆ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. పశువైద్య సిబ్బంది డిప్యూటేషన్లపై కావాల్సిన చోట పోస్టింగ్‌లు వేసుకోవడంతో పశువైద్యం అందని ద్రాక్షగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. సిబ్బంది ఎప్పుడొస్తారో.. ఆస్పత్రులు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.

పశువైద్యం... దైన్యం!

- వైద్యులు ఉండరు.. సేవలు అందవు

- పాడిరైతులకు ఇబ్బందులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

పశువైద్యంపై అయోమయం నెలకొంది. స్వయానా పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు సొంత జిల్లాలోనే ఆ శాఖ పనితీరు అధ్వానంగా ఉంది. పశువైద్య సిబ్బంది డిప్యూటేషన్లపై కావాల్సిన చోట పోస్టింగ్‌లు వేసుకోవడంతో పశువైద్యం అందని ద్రాక్షగా మారింది.  గ్రామీణ ప్రాంతాల్లో పశు సంపదకు వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన డిస్పెన్సరీలు లక్ష్యానికి దూరమవుతున్నాయి. సిబ్బంది ఎప్పుడొస్తారో.. ఆస్పత్రులు ఎప్పుడు తెరుస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల వైద్యులు వారానికి ఒకటి, రెండు రోజులు మాత్రమే విధులకు హాజవుతుండడంతో సేవలు గగనమవుతున్నాయి. వాస్తవానికి ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4  గంటల వరకు పశు సంవర్ధకశాఖ డిస్పెన్సరీలు తెరిచి ఉంచాలి. మధ్యాహ్నం ఒక గంట భోజన విరామం మినహాయింపు ఉంటుంది. కానీ చాలాచోట్ల సమయపాలన పాటించడం లేదు. వైద్యుల దగ్గర నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు అందరూ జిల్లా కేంద్రం, మండల కేంద్రాల నుంచే రాకపోకలు సాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆస్పత్రుల్లో సక్రమంగా సేవలు అందడం లేదని పాడిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం జిల్లాలోని వివిధ డిస్పెన్సరీలను ‘ఆంధ్రజ్యోతి’ పరిశీలించగా పశువైద్య సిబ్బంది నిర్లక్ష్యం బయటపడింది. పాడిరైతుల కష్టాలు వెలుగుచూశాయి. 


 ఇదీ సిబ్బంది పరిస్థితి

జిల్లాలో పశుసంవర్ధక శాఖ ద్వారా పాడి రైతులకు సేవలు అందించేందుకు శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లతో పాటు 19 సబ్‌ డివిజన్‌లుగా విభజించారు. ప్రస్తుతం జిల్లాలో ఒక జేడీ, నలుగురు డీడీలు, 20 మంది ఏడీలు, 106 మంది వెటర్నరీ అసిస్టెంట్‌లకుగాను 87 మంది పని చేస్తున్నారు. 21 మంది వెటర్నరీ లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌లు ఉన్నారు. జూనియర్‌ వెటర్నరీ ఆఫీసర్స్‌ 41 పోస్టులకు 35 మంది పనిచేస్తున్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌లు 73 మందికి గానూ 48 మంది ఉన్నారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు 157కు గానూ 56 మంది ఉన్నారు. వీరితో పాటు ఔట్‌సోర్సింగ్‌ ద్వారా 54 మందిని నియమించారు. డీఈఓస్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ వంటి పోస్టుల్లో అందరూ ఉన్నారు. వీరంతా క్షేత్రస్థాయిలో సేవలు అందజేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పాడిరైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మంత్రి సీదిరి అప్పలరాజు ప్రత్యేక దృష్టి సారించి పశు సంవర్ధక శాఖను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


 ఆయనే వైద్యుడు

మెళియాపుట్టి :  ఇక్కడ ఆఫీస్‌ సబార్డినేట్‌ గణపతిరావే అన్నీ. ఆయనే పశువులకు వైద్యం అందిస్తున్నారు. వైద్యాధికారి పి.అనిల్‌ను రెండేళ్ల కిందట సీది నుంచి మెళియాపుట్టికి డిప్యూటేషన్‌పై నియమించారు. ఆయన వారానికి రెండు రోజులు మాత్రమే వస్తున్నారు. రెండు ఆసుపత్రుల బాధ్యతలు ఉన్నందున సక్రమంగా రావడం లేదని తెలిసింది. మరో ఆఫీస్‌ అసిస్టెంట్‌ వరలక్ష్మి టెక్కలి మండలానికి డిప్యూటేషన్‌ పై వెళ్లిపోయారు. దీంతో రైతులకు ఆఫీస్‌ సబార్డినేటే దిక్కయ్యారు. 


సిబ్బంది లేక.. పాడిరైతులకు పాట్లు

జి.సిగడాం : టీడీ వలస పశువైద్యశాలలో సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇక్కడి వైద్యాధికారి పదోన్నతిపై వెళ్లిపోయారు. జి.సిగడాం వైద్యాధికారికి బాధ్యతలు అప్పగించారు. ఆఫీస్‌ సబార్డినేట్‌ రాజాం మండలం బొద్దాం డిప్యూటేషన్‌పై వెళ్లారు. ప్రస్తుతం వీఎల్‌ఓగా విజయలక్ష్మి విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు గ్రామానికి చెందిన విశాఖ డెయిరీ వర్కర్‌, సీతంపేట ఆర్‌బీకేలో విధులు నిర్వర్తిస్తున్న మరొకరు సహాయకులుగా పనిచేస్తున్నారు. ఈ ఆసుపత్రి పరిధిలో మర్రివలస, గేదెలపేట, నక్కపేట, మెట్టవలస, నిద్దాం, అద్వానంపేట, పాలఖండ్యాం గ్రామాలున్నాయి. వైద్య సిబ్బంది లేకపోవటంతో సేవలు అరకొరగానే అందుతున్నట్లు పాడిరైతులు చెబుతున్నారు. 


ఇద్దరే హాజరు...

కొత్తూరు: ప్రాంతీయ పశు వైద్యశాలలో గురువారం ఉదయం ఇద్దరు సిబ్బందే కనిపించారు. గత మూడు నెలలుగా ఏడీ పోస్టు ఖాళీగా ఉంది. మధ్యాహ్నానికి మెల్లగా కొంతమంది ఆసుపత్రి సిబ్బంది వచ్చారు. వైద్యం కోసం పాడి రైతులు ఎవరూ రాలేదు. పాతపట్నం వైద్యాధికారి డిప్యుటేషన్‌పై ఇక్కడకు వస్తుంటారు. ఆయన రెండు మూడు రోజులకు ఒకసారి వస్తుంటారని రైతులు తెలిపారు. 


కొత్తవలసలో వ్యాక్షిన్‌ల కొరత....

ఆమదాలవలస రూరల్‌ : కొత్తవలస డిస్పెన్సరీలో వ్యాక్సిన్‌లు అందుబాటులో లేవు. పశువైద్యాధికారి, లైవ్‌స్టాక్‌ అసిస్టెంట్‌, గోపాలమిత్రలు వైద్య సేవలు అందజేస్తున్నారు. 


విధులకు డుమ్మా  

రాజాం: పశుసంవర్ధకశాఖ ఏడీ జయప్రకాష్‌ గురువారం విధులకు డుమ్మా కొట్టారు. ఆయన వంగర మండలం ప్రత్యేకాధికారిగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే ఇక్కడ ఇద్దరు అటెండర్లకుగాను ఒకరికి బదిలీ కాగా.. మరొకరు శిక్షణకు వెళ్లిపోయారు. దీంతో ఆస్పత్రిలో ఒక్క ల్యాబ్‌ అసిస్టెంట్‌ మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. 


సదుపాయాల కొరత  

వజ్రపుకొత్తూరు: అక్కుపల్లి గ్రామీణ పశువైద్యశాలలో  మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం లేక పాడిరైతులు  ఇబ్బందులు పడుతున్నారు. పశువైద్యాధికారి దేవేంద్ర, అటెండర్లు సేవలు అందిస్తున్నారు.


మందుల కొరత

నందిగాం : నందిగాం పశువైద్య శాలలో మందుల కొరత ఉంది. గురువారం సుభద్రాపురం నుంచి ఒక గొర్రెను చికిత్స నిమిత్తం ఇక్కడకు తీసుకురాగా, దానికి అవసరమైన మందుల్ని ప్రైవేట్‌గా కొనుగోలు చేసుకోవాలని సిబ్బంది చెప్పారు. జూన్‌లో రావాల్సిన మందులు ఇప్పటి వరకు రాకపోగా, చాలా మందులు ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నామని పాడిరైతులు తెలిపారు. ఇక్కడ అటెండర్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఏడీఏ రెండు రకాల బాధ్యతలు చూడడం వల్ల వైద్యాధికారి పోస్టు కూడా అవసరం ఉందని నందిగాం, పెంటూరు తదితర గ్రామాలకు చెందిన రైతులు పేర్కొన్నారు.  

Updated Date - 2021-08-06T05:17:28+05:30 IST