Abn logo
Nov 29 2020 @ 12:57PM

వచ్చే ఏడాదికి 10 కరోనా వ్యాక్సీన్లు?

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో భయపెడుతుందో వేరే చెప్పక్కర్లేదు. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్‌ను నిరోధించే వ్యాక్సీన్లు తయారు చేయడానికి బడా బడా ఫార్మా కంపెనీలు పరిశోదనలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని మంచి పలితాలు కూడా కనిపిస్తున్నాయి. వీటి గురించి ఇంటర్నేషనల్ పెడరేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ మ్యానుఫాక్యరర్స్ అండ్ అసోసియేషన్స్‌ (ఐఎఫ్‌పీఎమ్‌ఏ) డైరెక్టర్ జనరల్ థామస్ క్యూనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


ఇటీవలే ఫైజర్, బయాన్‌టెక్ ఫార్మా కంపెనీలు తయారు చేసిన కరోన టీకా 90శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం ఈ కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదే పద్ధతిలో మోడర్నా తయారు చేస్తున్న వ్యాక్సీన్, ఆస్ట్రా జెనెకా ప్రయోగంలో ఉన్న టీకా కూడా సత్ఫలితాలనే ఇస్తున్నాయని ఆయా కంపెనీలు వెల్లడించాయి. ఈ టీకాలన్నీ క్లినికల్ ట్రయల్స్ దాదాపు ముగించుకొని మార్కెట్లో రిలీజ్ చేయడానికి అవసరమైన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ వీటిలో ఏ వ్యాక్సీన్‌కు కూడా ఈ అనుమతులు లభించలేదు. ఈ విషయాన్నే క్యూనీ కూడా ప్రస్తావించారు.


ఇప్పటి వరకూ 3 కరోనా టీకాలు తయారు చేస్తే మూడూ సక్సెస్ అయ్యాయని క్యూనీ అన్నారు. జాన్సన్ అండ్ జాన్సన్, నోవావాక్స్, సనోఫీ పాస్టేర్, జీఎస్‌కే తదితర కంపెనీలు తయారు చేసే వ్యాక్సీన్లు కూడా ఇలాంటి ఫలితాలే చూపుతాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ వ్యాక్సీన్ తయారీ కోసం ఫార్మా కంపెనీలు చాలా పెట్టుబడి పెట్టాయని, ఇలాంటి వ్యాక్సీన్‌పై పేటెంట్ లేకుండా ఇవ్వాలని కొన్ని దేశాలు అడగడం చాలా తప్పని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాక్సీన్ తయారీలో చాలా నైపుణ్యం ఉన్న పరిశోధకుల అవసరం ఉంటుందని, వీరెవరూ లేకుండా వ్యాక్సీన్ తయారు చేయడం అంత సులభం కాదని పేర్కొన్నారు.


‘‘వ్యాక్సీన్ తయారీలో ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే, వచ్చే ఏడాది వేసవి నాటికి కనీసం 11 వ్యాక్సీన్లు మార్కెట్లోకి వచ్చే అవకాం ఉంది. అఫ్‌కోర్స్.. రెగ్యులేషన్ సంస్థల నుంచి వీటికి పర్మిషన్ తప్పనిసరి, అలాగే ఈ వ్యాక్సీన్ల పనితీరుపై కూడా సునిశితమైన పరీక్షలు జరగాలి’’ అని క్యూనీ చెప్పారు. కరోనా వ్యాక్సీన్ గురించి వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీవో)లో ఓ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యాక్సీన్‌పై తాత్కాలికంగా లైసెన్సింగ్ నిబంధన తొలగించాలని, ప్యాండెమిక్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకోవాలని భారత్, సౌతాఫ్రికా దేశాలు అభ్యర్థించాయట. అయితే ఈ అభ్యర్థనను అమెరికా, యూరోపియన్ యూనియన్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు అంగీకరించలేదని సమాచారం.


దీని గురించి మాట్లాడిన క్యూనీ.. ‘‘ఇలా పేటెంట్ వద్దని అడగడం పూర్తిగా పాలిటిక్స్. దీనివల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగమూ ఉండదు. ఇంతటి కష్టకాలంలో కూడా ఇంత వేగంగా స్పందించి వ్యాక్సీన్ తయారుచేసిన సంస్థలను, ఈ విధానాన్ని పేటెంట్ వద్దనడం ఇది కించపరిచినట్లే’’ అని క్యూనీ పేర్కొన్నారు. ఓ వ్యాక్సీన్‌కు ప్రభుత్వం నుంచి అనుమతి లభించాలంటే దాదాపు 50 క్వాలిటీ టెస్టులు చేస్తారని, దాన్ని ఉత్పత్తి చేసే ముందు సిబ్బంది వందలసార్లు చెకింగ్ చేస్తారని చెప్పారు. వీరంతా ఇంత కష్టపడుతోంది కరోనాను ఓడించేందుకే అని అన్నారు. ఈ కంపెనీలు ప్రస్తుత కష్టకాలాన్ని క్యాష్ చేసుకునే ఆలోచన చేయబోవని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement