అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదు

ABN , First Publish Date - 2021-07-25T05:51:51+05:30 IST

అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మైన్స్‌ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.

అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఉపేక్షించేది లేదు
అనకాపల్లి మండలం బవులవాడలో క్వారీని పరిశీలిస్తున్న ఏడీ

మైన్స్‌ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి


తుమ్మపాల, జూలై 24: అక్రమ మైనింగ్‌కు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మైన్స్‌ విజిలెన్స్‌ ఏడీ ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. బవులవాడ, మామిడిపాలెం గ్రామాల్లో పలు క్వారీలను శనివారం సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా క్వారీల్లో నిల్వ ఉన్న మెటీరియల్‌ వివరాలను నమోదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అనకాపల్లి మండలంలో సుమారు 350 క్వారీలు ఉండగా, అత్యధికంగా అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇప్పటివరకు మధుకాన్‌, నవోదయ, వాణి, ఎన్‌ఈసీ, రవితేజ కంపెనీలకు చెందిన 18 క్వారీలను తనిఖీ చేసినట్టు చెప్పారు. అక్రమాలకు పాల్పడి ప్రభుత్వానికి రాయల్టీలు కట్టకుండా వ్యాపారాలు సాగించిన క్వారీ యాజమాన్యాలపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. క్వారీ నిర్వహణకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వానికి కట్టాల్సిన రాయల్టీ చార్జీలు, భద్రత చర్యలు, రవాణా అనుమతులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఏడీ తెలిపారు. 


రూ.1.33 లక్షల జరిమానా

మామిడిపాలెంలో గ్రావెల్‌ అక్రమంగా తరలిస్తున్న క్వారీ యజమానులకు రూ.1.33 లక్షల జరిమానా విధించినట్టు గనుల శాఖ ఏడీ ప్రకాశ్‌ తెలిపారు. అప్పలనాయుడు, రశూల్‌ నిర్వహిస్తున్న గ్రావెల్‌ క్వారీపై తనిఖీలు చేయగా, 420 క్యూబిక్‌ మీటర్ల గ్రావెల్‌ అనధికారికంగా తరలించినట్టు మైన్స్‌ విజిలెన్స్‌ ఏడీ గుర్తించి రూ.1.33 లక్షల జరిమానా విధించారని చెప్పారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ ఏజీ రవికుమార్‌, ఆర్‌ఐ శ్రీనివాస్‌, టీఏలు భవానీ, సుజయ్‌రాణి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:51:51+05:30 IST