పాక్ విదేశాంగ మంత్రిపై మళ్లీ అనవసర చర్చ.. 11 ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-04-21T01:36:06+05:30 IST

ఇస్లామాబాద్ : రాజకీయరంగంలో మహిళల ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. సమర్థ పనితీరు, వాక్చాతుర్యం, ఆకర్షణీయ రూపమే కాదు అలంకరణ కూడా వారిని విశేషమైన వ్యక్తులుగా నిలుపుతుంది.

పాక్ విదేశాంగ మంత్రిపై మళ్లీ అనవసర చర్చ.. 11 ఏళ్ల క్రితం  ఏం జరిగిందంటే..

ఇస్లామాబాద్ : రాజకీయరంగంలో మహిళల ప్రస్థానం ఎంతో ప్రత్యేకం. సమర్థ పనితీరు, వాక్చాతుర్యం, ఆకర్షణీయ రూపమే కాదు అలంకరణ కూడా వారిని విశేషమైన వ్యక్తులుగా నిలబెడుతుంది. అయితే ఒక మహిళా నేత పని తీరుపై కాకుండా ఇతర అంశాలపై అనవసర చర్చ రాద్ధాంతమే అవుతుంది. పాకిస్తాన్‌కు కొత్త డిప్యూటీ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన హీనా రబ్బానీ ఖర్ విషయంలో అక్షరాలా ఇదే జరుగుతోంది. దాదాపు 11 ఏళ్ల తర్వాత మరోసారి ఆమె అలంకరణపై అక్కర్లేని చర్చకు తెరలేచింది. 2011లో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా హీనా భారత పర్యటనకు వచ్చినప్పుడు ఆమె అలంకరణ పెద్ద చర్చనీయాంశమైంది. తనదైన శైలిలో ఆమె నడుచుకున్నా ఇటు భారత్, అటు పాకిస్తాన్‌ మీడియా‌లలో శృతిమించిన ప్రాధాన్యత దక్కింది. మీడియా ఇంతటి కవరేజీ ఇవ్వడంపై అప్పట్లో న్యూయార్క్ టైమ్స్ ఏకంగా ఒక కథనాన్ని ప్రచురించింది. హీనా ఖర్ అందం మీడియాను స్పృహతప్పేలా చేసిందని వ్యంగ్యస్త్రాలు సంధించింది. ఆమె ధరించిన ముత్యాల హారాలు, సొగసైన దుస్తులు, ఖరీదైన సన్‌గ్లాసెస్, 9 వేల డాలర్ల కంటే విలువైన బిర్కిన్ బ్యాగ్‌‌పై భారత ఉపఖండంలో అనవసర చర్చ జరుగుతోందని వ్యాఖ్యానించింది. న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించిందంటే ఆమె అలంకరణపై ఏ స్థాయిలో చర్చ నడిచిందో అర్థం చేసుకోవచ్చు. 


ఈ విషయం ఇప్పుడెందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే హీనా ఖర్ ఏప్రిల్ 18న పాకిస్థాన్ నూతన విదేశాంగ శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో మరోసారి ఆమె అలంకరణపై సోషల్ మీడియాతోపాటు న్యూస్ పోర్టల్స్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె దుస్తులు, బ్యాగులు, ఆమె ఉపకరణాలపై చర్చలు జరుగుతున్నాయి. వాస్తవానికి హీనా ఖర్ అలంకరణ కంటే ఆమె గురించి చర్చించుకోవాల్సిన విషయాలు చాలానే  ఉన్నాయి. కేవలం 34 ఏళ్ల వయసులో ఆమె పాకిస్తాన్ తొలి మహిళా విదేశాంగ మంత్రిగా 2011లో బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవినీ చేపట్టిన అతిపిన్న పాకిస్తాన్ మహిళగా ఆమె నిలిచారు.  ముజఫ్ఫర్‌గర్‌ జిల్లాలో పలుకుబడి కలిగిన భూస్వామ్య కుటుంబలో ఆమె పుట్టారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. లాహోర్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత మసాచుసెట్స్ యూనివర్సిటీలో బిజినెస్ మేనేజ్‌మెంట్ చేశారు. 2002లో తొలిసారి నేషనల్ అసెంబ్లీలో ఆమె అడుగుపెట్టారు. హీనా ఖర్ తండ్రి గులం నూర్ రబ్బానీ ఖర్ కూడా ఒక రాజకీయ నేత. వాస్తవానికి తండ్రి జనాల్లో ఉంటారు. కానీ హీనా ఎక్కువగా ఇంట్లోనే గడుపుతుంది. పోస్టర్లలో కనీసం ఆమె ఫొటో కూడా పెద్దగా కనిపించదు.

Updated Date - 2022-04-21T01:36:06+05:30 IST