సీఎం యడియూరప్ప రాజీనామా వ్యాఖ్యలపై డీకే శివ కుమార్ మండిపాటు
ABN , First Publish Date - 2021-06-07T00:23:50+05:30 IST
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆదివారం
బెంగళూరు : కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్ ఆదివారం ముఖ్యమంత్రి యడియూరప్ప వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. యడియూరప్ప ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోనూ, బీజేపీలోనూ బలమైన నాయకుడని గుర్తు చేశారు.
యడియూరప్ప ఏమన్నారంటే...
రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో బీఎస్ యడియూరప్ప ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. విలేకర్ల ప్రశ్నకు సమాధానం చెప్తూ, బీజేపీ అధిష్ఠానానికి తనపై నమ్మకం ఉన్నంత కాలం తాను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతానని చెప్పారు. ఈ విషయంలో తనకు ఎలాంటి అయోమయం లేదన్నారు. తనకు ప్రత్యామ్నాయ నేత రాష్ట్ర బీజేపీలో లేరనడాన్ని తాను అంగీకరించనని తెలిపారు. అధిష్ఠానం తనను రాజీనామా చేయమంటే, ఆ విధంగా చేసి, రాష్ట్ర అభివృద్ధి కోసం పగలు, రాత్రి కృషి చేస్తానని చెప్పారు.
ఈ నేపథ్యంలో డీకే శివ కుమార్ ఓ వార్తా సంస్థతో ఆదివారం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి యడియూరప్ప కర్ణాటకలో, బీజేపీలో బలమైన నాయకుడని తెలిపారు. ఆయన నాయకత్వంలోనే బీజేపీ ఎన్నికల్లో పాల్గొందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఆయన రాజీనామా గురించి చేసిన వ్యాఖ్యల వెనుక ప్రత్యేక వ్యూహం ఉందని ఆరోపించారు.
ఇదిలావుండగా, యడియూరప్పకు మద్దతుగా ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ్ నిలిచారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించి చర్చలు జరగడం లేదన్నారు. యడియూరప్ప పార్టీకి ఓ క్రమశిక్షణగల సైనికుడని తెలిపారు. అందుకే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారన్నారు. రెవిన్యూ మంత్రి ఆర్ అశోక్ మాట్లాడుతూ, నాయకత్వ మార్పుపై ప్రచారమవుతున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. యడియూరప్ప తమ నేత అని, ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతారని చెప్పారు.