కొడుకు ఐపీఎస్ అధికారి... తల్లిదండ్రుల జీవనం రేకుల షెడ్డులో...

ABN , First Publish Date - 2022-01-04T21:54:19+05:30 IST

కర్ణాటకలోని శ్రీకాంత్ (63), సావిత్రి (53) దంపతుల

కొడుకు ఐపీఎస్ అధికారి... తల్లిదండ్రుల జీవనం రేకుల షెడ్డులో...

బెళగావి : కర్ణాటకలోని శ్రీకాంత్ (63), సావిత్రి (53) దంపతుల కుమారుడు జగదీశ్ అడహళి ఆంధ్ర ప్రదేశ్‌లోని విజయవాడలో ఐపీఎస్ ప్రొబేషన్ అధికారి. తమ కుమారుడిని ఈ స్థాయికి తీసుకురావడానికి ఆ దంపతులు పేదరికంపై సాహసోపేతంగా పోరాడారు. తమ కుమారుడు గొప్ప స్థానానికి చేరుకున్నప్పటికీ వారు రేకుల షెడ్డులోనే కాలం గడుపుతున్నారు. 


శ్రీకాంత్, సావిత్రి దంపతులు కర్ణాటకలోని బెళగావి జిల్లా, కగ్వాడ్ తాలూకా, మోలే గ్రామంలో నివసిస్తున్నారు. వీరికి నలుగురు సంతానం. పెద్ద కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేశారు. తమ పేదరికమే తమ కుమారుడు జగదీశ్‌లో పట్టుదలను పెంచిందని వీరు చెప్పారు. అనేక కష్టాలను అధిగమించి తమ కుమారుడు జగదీశ్ యూపీఎస్‌సీ పరీక్షలో 440వ ర్యాంకు సాధించాడని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, విజయవాడలో ప్రొబేషన్ అధికారిగా ఉన్నట్లు తెలిపారు. 


శ్రీకాంత్ సహకార చక్కెర మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. తమ పిల్లలను చదివించేందుకు ఆయన అనేక చోట్ల అప్పులు చేశారు. శ్రీకాంత్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, మోలే గ్రామంలోనే ప్రాథమిక విద్యను అభ్యసించిన జగదీశ్ పీయూసీ కోర్సును అథానీ పట్టణంలో చేశారు. ఆయన ఎస్ఎస్ఎల్‌సీలో 80 శాతం మార్కులు, పీయూసీలో 87 శాతం మార్కులు సాధించారు. తన కుమారుడు చార్టర్డ్ అకౌంటెంట్ అవాలనే ఉద్దేశంతో బీకామ్‌లో చేర్పించారు. సీఏ ఎంట్రన్స్ పరీక్షలో జగదీశ్ మంచి మార్కులే సాధించారు. అయితే ఆ తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 2013లో తన కారులో ప్రయాణించిన ఓ ఎన్నికల అధికారి యూపీఎస్‌సీ పరీక్షల గురించి చెప్పారు. అనంతరం శ్రీకాంత్ తన కుమారుడిని ఒప్పించారు. ఈ పరీక్షకు హాజరుకావాలని నచ్చజెప్పారు. అప్పు చేసి తన కుమారుడిని కోచింగ్ కోసం ఢిల్లీ పంపించారు. ఇప్పుడు జగదీశ్ తన తండ్రి కలను సాకారం చేశారు. జగదీశ్ అంతకుముందు కేపీఎస్‌సీ పరీక్షలో 23వ ర్యాంకు సాధించారు. కలబురగిలో అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. 


తాము పేదరికం వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని, అయితే పేదరికం తమను మరింత బలోపేతం చేసిందని శ్రీకాంత్, సావిత్రి చెప్పారు. ఈ రేకుల షెడ్డు తమ కుటుంబం ఆశలకు చిహ్నమని చెప్పారు. ఆదాయం పెరిగినంత మాత్రానికి తాము ఈ జీవనశైలిని ఏ విధంగా వదిలిపెట్టగలమని ప్రశ్నించారు. ఆరోగ్యం సహకరించినంత వరకు తాను డ్రైవర్‌గానే పని చేస్తానని తెలిపారు. తమకుగల రెండెకరాల భూమిని సాగు చేసుకుంటామన్నారు. 


Updated Date - 2022-01-04T21:54:19+05:30 IST