జల్సాల కోసం దొంగతనాలు

ABN , First Publish Date - 2020-07-04T11:25:04+05:30 IST

జల్సాలకు అలవాటుపడి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని జగదేవ్‌పూర్‌ రోడ్డులో గల ఏటీఎంను అపహరించుకుపోయిన

జల్సాల కోసం దొంగతనాలు

ప్రజ్ఞాపూర్‌లో ఏటీఎం చోరీ కేసులో నిందితుల అరెస్టు 

రూ.4లక్షల70వేలు స్వాధీనం : గజ్వేల్‌ ఏసీపీ నారాయణ


గజ్వేల్‌, జూలై 3: జల్సాలకు అలవాటుపడి గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని జగదేవ్‌పూర్‌ రోడ్డులో గల ఏటీఎంను అపహరించుకుపోయిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. గజ్వేల్‌ ఏసీపీ నారాయణ తన కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం వేకువజామున గస్తీ నిర్వహిస్తున్న క్రైం పార్టీ పోలీసులకు పిడిచెడ్‌ రోడ్డులోని ఐడీబీఐ ఏటీఎం వద్ద ఓ ఆటోలో నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. ఆటోలో తనిఖీ చేయగా గడ్డపార,  సుత్తె, ఇనుపరాడ్డు, కటింగ్‌ప్లేయర్‌ ఉన్నాయి. వారిని అదుపులోకి తీసుకుని గజ్వేల్‌ పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించారు. తున్కిబొల్లారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి చెంది బొమ్మస్వామి(25), బొమ్మ ఐలేని ఐలేష్‌(22), గజ్వేల్‌కు చెందిన తంగలపల్లి నవీన్‌కుమార్‌(19), రాయపోల్‌ మండలం వడ్డేపల్లికి చెందిన అయ్యగల్ల నవీన్‌(20)గా  తెలిపారు. 


 పాత నేరస్థులైన బొమ్మస్వామి, బొమ్మ ఐలేష్‌ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి గజ్వేల్‌లో నివాసముంటున్న తంగలపల్లి నవీన్‌, అయ్యగల్ల నవీన్‌, గొంగళ్ల ప్రశాంత్‌ పరిచయమయ్యారు. తాగుడు, జల్సాలకు అలవాటు పడి, ఈజీమనీ కోసం ఏటీఎంలను టార్గెట్‌ చేసుకున్నారు.  జూన్‌ 11న మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేట మండలం మురహరిపల్లిలోని ఏటీఎం వద్ద సీసీ కెమెరాల వైర్లు కట్‌చేసి, మిషన్‌ను చోరీ చేసేందుకు యత్నించి విఫలమయ్యారు. జూన్‌ 22న వర్గల్‌ మండలం గౌరారం వద్ద ఏటీఎం వైర్లు కట్‌చేసి మిషన్‌ను డ్యామేజ్‌ చేసి విఫలమయ్యారు. ఈ రెండు చోరీల్లో విఫలమవ్వడంతో ఈసారి పక్కాగా చోరీ చేయాలని ప్లాన్‌ చేశారు. జూన్‌ 27న  ప్రజ్ఞాపూర్‌లోని జగదేవ్‌పూర్‌ క్రాసింగ్‌ వద్ద గల ఇండియా 1 ఏటీఎంను టార్గెట్‌గా ఎంచుకున్నారు.


మొదట సీసీ కెమెరాల వైర్లను కట్‌ చేసి, లోపలికి చొరబడి ఇనుపరాడ్లు, గడ్డపారలతో ఏటీఎంను ఆటోలో రింగ్‌రోడ్డు మీదగా గౌరారం వద్ద గల మార్స్‌ ఇండియా పరిశ్రమ వద్దకు వెళ్లారు. అక్కడ మిషన్‌ను పగలగొట్టి అందులోని రూ.4,98,800 నగదును సమానంగా పంచుకున్నట్లు విచారణలో ఒప్పుకున్నారని ఏసీపీ నారాయణ తెలిపారు. దొంగిలించిన డబ్బులో నిందితులు రూ.28,800 వాడుకున్నారని, మిగిలిన రూ.4లక్షల70వేల నగదును, గడ్డపార, ఇనుపరాడ్డు, సుత్తెను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. చోరీకి పాల్పడిన వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన గజ్వేల్‌ సీఐ ఆంజనేయులు, అడిషనల్‌ సీఐ మధుసూదన్‌రెడ్డి, సీసీఎస్‌ సీఐ నర్సింహారావు, టాస్క్‌ఫోర్సు సీఐ ప్రసాద్‌, క్రైం పార్టీ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటయ్య, పీసీలు యాదగిరి, సుభా్‌షను ఏసీపీ అభినందించి, రివార్డులను అందించారు. 

Updated Date - 2020-07-04T11:25:04+05:30 IST