తూతూమంత్రం.. వెండి సింహాల చోరీ విచారణ ఇలాగా!

ABN , First Publish Date - 2020-09-17T14:30:24+05:30 IST

దుర్గమ్మ వెండి రథంపై ఉండాల్సిన మూడు సింహాలు మాయమైన ఘటన..

తూతూమంత్రం.. వెండి సింహాల చోరీ విచారణ ఇలాగా!

పోలీసులకు ఫిర్యాదుపై విముఖత

విచారణాధికారిగా పెనుగంచిప్రోలు ఈవో

సమానస్థాయి అధికారిని నియమించడంపై విమర్శలు

ఈవోను సస్పెండ్‌ చేయకుండానే విచారణ!

సింహాల చోరీపై బాధ్యతారహిత వ్యాఖ్యలు

తనకు సింహాల విషయమే తెలియదని బుకాయింపు


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): దుర్గమ్మ వెండి రథంపై ఉండాల్సిన మూడు సింహాలు మాయమైన ఘటన వెలుగుచూసి 24 గంటలకుపైగా అయినా, ఇప్పటి వరకు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెండి సింహాలను చోరీ చేసిన ఇంటి దొంగలను రక్షించేందుకే దుర్గగుడి అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ ఘటనపై విచారణను సైతం తూతూ మంత్రంగా ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని స్పష్టమవుతోంది. 


నిబంధనల ప్రకారం ఓ ఉన్నతాధికారిపై ఆరోపణలు వచ్చినా, లేదా విధి నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపణలొచ్చినా, ఆ అధికారిని సస్పెండ్‌ చేసి, ఆ తర్వాతే ఆయనపై విచారణకు ఆదేశించాలి. కానీ కనకదుర్గమ్మ వెండి రథంపై మూడు సింహాల చోరీ ఉదంతంలో దీనికి బాధ్యుడైన ఈవోను అదే స్థానంలో ఉంచి, విచారణకు  ఆదేశించారు. విచారణ అధికారిగా నియమితులైన పెనుగంచిప్రోలు ఈవో దుర్గగుడి ఈవోతో సమాన హోదా కలిగిన వారు. ఇది నిబంధనలకు విరుద్ధం. ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారితో సమాన హోదా కలిగిన అధికారిని విచారణాధికారిగా నియమించడంతోనే మున్ముందు విచారణ ఏ స్థాయిలో జరుగుతుందో స్పష్టమైపోతోంది. ఇదంతా ఒక ఎత్తయితే, ఈవోను వెనకేసుకొచ్చేలా సాక్షాత్తూ మంత్రి వ్యాఖ్యలు చేస్తుండటం విచారణపై తప్పకుండా ప్రభావం చూపుతుందని దుర్గగుడి ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. 


ఈవో మాటల్లో డొల్లతనం

తాను ఈవోగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి దుర్గమ్మ వెండి రథాన్ని పరిశీలించలేదని ఈవో సురేశ్‌బాబు వ్యాఖ్యానించడంపై పెనుదుమారం రేగుతోంది. దేవదాయశాఖ నిబంధనల ప్రకారం పాత ఈవో బదిలీ అయి కొత్త ఈవో బాధ్యతలు స్వీకరించే సమయంలో చిన్న చిన్న వస్తువులతో సహా పక్కాగా లెక్క చూసుకోవాల్సి ఉంది. ఈ విషయంలో ఈవో నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. కాగా వెండి ఉత్సవ రథం కొద్ది రోజుల క్రితం వరకు మంత్రి వెలంపల్లి నివాసానికి చెంతనే ఉన్న జమ్మిదొడ్డి కార్యాలయంలోనే ఉంది. ఇటీవలే దాన్ని అక్కడి నుంచి తరలించి, మహామండపం సమీపంలో ఉన్న సమాచార కేంద్రం వద్ద ఉంచారు. 


వెండి రథాన్ని తరలించే సమయంలో ఈవో, ఇతర ఆలయ సిబ్బంది నాలుగు సింహాలు ఉన్న వెండి రథం వద్ద ఫొటోలు దిగారు. ఆ సమయంలో ఉన్న సింహాలు ఇప్పుడు ఎలా మాయం అవుతాయని ఆలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని దాచిపెట్టి ఈవో, తనకు అసలు రథం విషయమే తెలియదన్నట్టు.. రథానికి రెండు సింహాలే ఉన్నాయంటూ బుకాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


Updated Date - 2020-09-17T14:30:24+05:30 IST