మనోహరాబాద్‌లో ఐదిళ్లలో చోరీ

ABN , First Publish Date - 2022-08-11T06:07:56+05:30 IST

మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు దొంగలు తెగబడ్డారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ఐదిళ్లలో చోరీలకు పాల్పడ్డారు.

మనోహరాబాద్‌లో ఐదిళ్లలో చోరీ
చోరీకి గురైన ఇల్లును పరిశీలిస్తున్న పోలీసులు

తూప్రాన్‌ పోలీసు క్వార్టర్‌ పక్కన ఇంట్లోనూ దొంగతనం


తూప్రాన్‌, ఆగస్టు 10 : మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండల కేంద్రంలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు దొంగలు తెగబడ్డారు. తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ఐదిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. చోరీల్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీకి గురైంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్‌ మండల కేంద్రానికి చెందిన వట్టూరి ప్రభాకర్‌, లక్ష్మీ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తుంటారు. లక్ష్మీ తండ్రి ఏడాది క్రితం చనిపోవడంతో సంవత్సరీకం కోసం తన పిల్లలతో కలిసి మంగళవారం సాయంత్రం పుట్టింటికి వెళ్లింది. రాత్రి ఇంట్లోనే పడుకున్న ప్రభాకర్‌ బుధవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఊర్లో జరుగుతున్న పెళ్లికి బ్యాండ్‌ (డప్పు) వాయించేందుకు ఇంటికి తాళం వేసి వెళ్లాడు. ఉదయం 6 గంటల ప్రాంతంలో ఇంటికి లక్ష్మీ వచ్చి చూడగా, ఇంటి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలో దాచిన నాలుగున్నర తులాల బంగారు పుస్తెలతాడు, కమ్మలు బుట్టాలు, గుండ్లు, మాటీలు, 36 తులాల వెండి పట్టగొలుసులు, చెక్కుడుగుత్తి, నగదు చోరీకి గురైనట్లు గుర్తించి మనోహరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మనోహరాబాద్‌లో వెన్నెల్లి నారాయణరెడ్డి మేనకోడలు పెళ్లి ఉండటంతో సోమవారం కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఖాజాపూర్‌కు వెళ్లారు. మంగళవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. ఇంటితాళం పగలగొట్టి ఉందని పెద్దనాన్న యాదిరెడ్డి చెప్పడంతో వచ్చి చూడగా,  బీరువాలో దాచిన తులంన్నర బంగారు గొలుసులు, ఉంగరం, వంక ఉంగరం చోరీ చేసుకెళ్లారు. నారాయణరెడ్డి మేనత్త యగు వెన్నెల్లి శాంతమ్మ సైతం ఇంటికి తాళం వేసి పెళ్లికి వెళ్లడంతో ఆమె ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో దాచిన 15 తులాల వెండి గొలుసు, రూ. 30వేల నగదు చోరీ చేసుకెళ్లారు. శాంతమ్మ ఇంట్లో అద్దెకు ఉంటున్న సునిల్‌కుమార్‌సింగ్‌ భార్య పుట్టింటికి వెళ్లడంతో, సునిల్‌కుమార్‌ ఇంటికి తాళం వేసి టోల్‌గేట్‌ వద్ద డ్యూటీకి వెళ్లాడు. సునిల్‌కుమార్‌సింగ్‌ ఇంటి తాళం పగలగొట్టి 10 తులాల వెండి నాణాలు చోరీ చేసుకెళ్లారు. అలాగే, టెక్మాల్‌ వెంకట్‌రెడ్డి ఇంటి తాళం పగలగొట్టి చోరీ చేసేందుకు ప్రయత్నించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో మనోహరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. చోరీల విషయం తెలియగానే, తూప్రాన్‌ సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ రాజుగౌడ్‌ సంఘటనలను పరిశీలించి విచారణ చేస్తున్నారు. 

తూప్రాన్‌ పట్టణంలో పోలీసు క్వార్టర్లకు పక్కనే నివాసముండే జహీర్‌ ఇంటి తాళాలు మంగళవారం రాత్రి పగలగొట్టి చోరీకి పాల్పడ్డాడు. భార్య ప్రసవం కోసం దాచిన నగదు, బంగారం చోరీకి గురైంది. తూప్రాన్‌కు చెందిన జహీర్‌ భార్య షాహజాభేగం కాన్పు ప్రసవం కోసం మెదక్‌లోని పుట్టింటికి వెళ్లింది. జహీర్‌ సైతం మంగళవారం ఇంటికి తాళం వేసి భార్యను చూసేందుకు మెదక్‌ వెళ్లారు. రాత్రి సమయంలో గుర్తు తెలియని దొంగలు పోలీసు క్వార్టర్‌ వద్దున్న చెట్టు మీదుగా ఇంటి వెనుకకు చొరబడి తాళాలు పగలగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. బీరువాల్లో దాచిన తులం బంగారు కమ్మలు, ఉంగరం, రూ. 60వేలనగదు చోరీ చేసుకెళ్లారు. ఈ విషయాన్ని బాధితుడు జహీర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


Updated Date - 2022-08-11T06:07:56+05:30 IST