గరం గరం స్టాండింగ్‌

ABN , First Publish Date - 2022-08-03T05:48:10+05:30 IST

జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళతామంటే కుదరదని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందేనని జడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ హెచ్చరించారు.

గరం గరం స్టాండింగ్‌
జడ్పీటీసీతోపాటు సభలో కూర్చున్న భర్త

అధికారులపై జడ్పీ చైర్‌పర్సన ఆగ్రహం

అనంతపురం విద్య, ఆగస్టు 2: జడ్పీ స్టాండింగ్‌ కమిటీ సమావేశానికి అధికారులు మొక్కుబడిగా వచ్చి వెళతామంటే కుదరదని, సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలివ్వాల్సిందేనని జడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ హెచ్చరించారు. జిల్లా పరిషత 1, 7, 3 స్టాండింగ్‌ కమిటీ సమావేశాలు మంగళవారం జరిగాయి. చైర్‌ పర్సన్‌, వైస్‌ చైర్మన్‌ సుధాకర్‌రెడ్డి అధ్యక్షత వహించారు. వజ్రకరూరు, గోరంట్ల, కో-ఆప్షన్‌ సభ్యులు, ఇతర సభ్యులు సిమెంట్‌ కొరత కారణంగా రోడ్ల పనులు జరగకపోవడంపై ప్రశ్నించారు. దీంతో అనేక సమావేశాల్లో సిమెంట్‌ గురించే చర్చించామని, ఇంకా పరిష్కరించకుంటే ఎలా అని పీఆర్‌ ఎస్‌ఈపై గిరిజమ్మ అసహనం వ్య క్తం చేశారు. కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారమయ్యేలా చూడాలని అన్నారు. గోరంట్లలో రూ.4.70 కోట్లతో చిత్రావతి నదిపై ఆర్‌అండ్‌బీ వారు నిర్మించిన బ్రిడ్జి కొంతకాలనికే కొట్టుకుపోతోందని మండిపడ్డారు. మీరు స్పందించకుంటే ఎలా అని ఆర్‌అండ్‌బీ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ అంశంపైనా చైర్‌పర్సన అసంతృప్తి వ్యక్తం చేశారు. సభ్యులు సుదూర ప్రాంతాల నుంచి వస్తారని, వారు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వలేని స్థితిలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. ఇకపై ఆయా శాఖల తరపున ఎవరొచ్చినా... తగిన సమాచారం రావాలని ఉమ్మడి జిల్లా అధికారులను ఆదేశించారు. సమావేశలో జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.


పతీ సమేత..!

జడ్పీ సమావేశానికి సభ్యులు మాత్రమే రావాలి. కానీ మంగళవారం జరిగిన సమావేశానికి అమరాపురం జడ్పీటీసీ స్వారక్క తన భర్త నరసింహ మూర్తితో కలిసి వచ్చారు. జడ్పీ అధికారులు ఆయనను అనుమతించడం విమర్శలకు తావిస్తోంది. జడ్పీ సాధారణ సమావేశాలు, స్టాండింగ్‌ కమిటీ సమావేశాలకు సభ్యులను మాత్రమే అనుమతిస్తారు. వారి కుటుంబ సభ్యులను అనుమతించరు. వెంట వచ్చిన వారు జడ్పీ ప్రాంగణంలోగాని, క్యాంటీన్‌లోగాని ఉంటారు. ఇతరులు సభలోకి వస్తే బయటకు పంపాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం



Updated Date - 2022-08-03T05:48:10+05:30 IST