డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..

ABN , First Publish Date - 2022-04-12T15:26:40+05:30 IST

వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఆ యువకుడు ఉన్నత చదువులు చదవలేకపోయాడు. చదవాలనే తపన ఉన్నా ఇంటర్‌తోనే పులుస్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే..

డబ్బుల్లేక ఇంటర్‌తోనే చదువుకు పులుస్టాప్.. ఇప్పుడు ఏడాదికి రూ.2 కోట్ల ఆదాయం.. ఈ కుర్రాడు చేసే పనేంటంటే..

వారి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో ఆ యువకుడు ఉన్నత చదువులు చదవలేకపోయాడు. చదవాలనే తపన ఉన్నా ఇంటర్‌తోనే పులుస్టాప్ పెట్టాల్సి వచ్చింది. అయితే, నా కర్మ ఇంతే అని అతను సరిపెట్టుకోలేదు. ఎలాగైనా ఏదోటి చేసి అందరికీ ఆదర్శంగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. చివరికి అనుకున్నది సాధించి.. ప్రస్తుతం ఏడాదికి రూ.2కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరు, అతను చేసే పని ఏంటి తదితర వివరాల్లోకి వెళితే..


ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అమ్రోహా అనే ప్రాంతానికి చెందిన హర్వేంద్ర సింగ్ అనే యువకుడి కుటుంబం వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగించేది. హర్వేంద్ర సింగ్ మాత్రం బాగా చదువుకుని, మంచి ఉద్యోగంలో చేరాలని కలలు కనేవాడు. 2007లో ఇంటర్ పూర్తవగానే ఇంజనీరింగ్ చేసేందుకు.. లక్నోలోని ఒక సంస్థలో అడ్మిషన్ కూడా  తీసుకున్నాడు. అయితే కొన్ని నెలల తర్వాత అది నకిలీ ఇన్‌స్టిట్యూట్ అని తెలిసిపోవడంతో రూ.50,000లు నష్టపోయాడు. మరో కాలేజీలో చేరి తన చదువును కొనసాగించాలని ఆశించాడు. కానీ ఇంట్లో తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. చివరకు చదువును ఆపేయాల్సి వచ్చింది. చిన్నపాటి ఉద్యోగంలో చేరాల్సి వచ్చింది. దీనికితోడు 2009లో వివాహం అవడంతో బాధ్యతలు, ఖర్చులు మరింత పెరిగాయి. దీంతో ఇల్లు గడవడమే కష్టమైంది.

ఒక్క ఫొటోతో సోషల్ మీడియానే షేక్ చేసింది.. ఈ 11 ఏళ్ల పాప సంకల్పం చూసి ఏకంగా ముఖ్యమంత్రే..


ఈ క్రమంలో ఉపాధి నిమిత్తం హర్యానాలో ఉంటున్న తన సోదరుడి వద్దకు వెళ్లాడు. అక్కడ నెలకు రూ.3000ల జీతానికి వివిధ రకాల పనులు చేశాడు. అయినా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కలేకపోయాడు. దీంతో ఎలాగైనా వ్యాపారం మొదలుపెట్టి, డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. సోదరుడితో కలిసి 2016లో ఇంటికి వచ్చాడు. చేపల పెంపకం మొదలెట్టాలని నిర్ణయించుకున్నారు. వారి నిర్ణయం విని మొదట అంతా హేళన చేశారు. అయినా హర్వేంద్ర సింగ్.. అవేవీ పట్టించుకోకుండా పని మొదలుపెట్టాడు.  ముందుగా గ్రామంలోని ప్రభుత్వ భూమిని లీజుకు తీసుకుని, చేపల పెంపకాన్ని ప్రారంభించాడు. మొదటి ఏడాది విపరీతమైన లాభాలు రాగానే తన పొలాల్లో కూడా చెరువులు ఏర్పాటు చేశాడు. నాలుగు ఎకరాల్లో ప్రారంభించిన చేపల పెంపకం.. ప్రస్తుతం 16 ఎకరాలకు విస్తరించింది. ప్రస్తుతం ఏడాదికి  రూ.2కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. చేప పిల్లలను కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తుంటానని  హర్వేంద్ర చెబుతున్నాడు.

ఛాతిలో బుల్లెట్ దిగి చొక్కా నిండా రక్తంతో వైరల్‌‌గా మారిన ఈ బాలుడి ఫొటో వెనుక అసలు నిజం ఇదీ..!


చేపల పెంపకం గురించి హర్వేంద్ర మాట్లాడుతూ.. చేపల పెంపకం ప్రారంభించాలనుకునే వారు ముందుగా చేపలకు వేసే ఆహారం నాణ్యతగా ఉండేలా చూసుకోవాలని చెప్పాడు. అలాగే చెరువు ఏర్పాటు చేయబోయే నేల సాంధ్రత, నీటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపాడు. నీటిలో పీహెచ్ స్థాయి ఒకేలా ఉండేలా చూసుకోవాలని చెప్పాడు. స్థాయి తగ్గినప్పుడు బెల్లం జోడించాలని, అలాగే పీహెచ్ స్థాయి పెరిగిన సమయంలో సున్నం వినియోగించడం వల్ల సమాన స్థాయికి వస్తుందని చెబుతున్నాడు. హర్వేంద్ర గురించి తెలుసుకున్న పలువురు రైతులు చేపల పెంపకాన్ని ప్రారంభించారు. తన వద్దకు వచ్చే ఎంతో మంది రైతులకు చేపల పెంపకంపై శిక్షణ ఇస్తున్నాడు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఇతని వద్దకు వస్తుంటారు. వారి నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని సలహాలు, సూచనలు ఇస్తుంటాడు. ఈ యువకుడు ప్రస్తుతం ఓ య్యూటూబ్ చానల్ ఏర్పాటు చేసి, అందులో చేపల పెంపకానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంటాడు. వినూత్నంగా ఆలోచిస్తే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని నిరూపిస్తూ.. ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఆవులు, గేదెలు లేకుండా పాల వ్యాపారమేంటని అంతా నవ్వారు.. కానీ ఇప్పుడు లక్షల సంపాదన..!

Updated Date - 2022-04-12T15:26:40+05:30 IST