Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఎంఈవోల ఇష్టారాజ్యం!

twitter-iconwatsapp-iconfb-icon
ఎంఈవోల ఇష్టారాజ్యం!

ప్రైవేట్‌ స్కూళ్ల విషయంలో వివాదాస్పదమవుతున్న ఎంఈవోల తీరు

పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ప్రైవేట్‌ పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు

తనిఖీలు మరచి ఎమ్మార్సీలకే పరిమితమవుతున్న ఎంఈవోలు

నిజామాబాద్‌అర్బన్‌, జూలై 4: జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారుల తీరు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 28 మండలాలు ఉండగా అన్ని మండలాలల్లో ఇన్‌చార్జీ ఎంఈవోలే పనిచేస్తున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా మండల విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ పాఠశాలలను తనిఖీలు చేసిన దాఖలాలు కనబడడంలేదు. మం డల విద్యాశాఖ కార్యాలయాలన్నీ పైరవీలకు, ప్రైవేట్‌ పాఠశాలల అనుమతులు, ఉపాధ్యాయుల ఫైళ్లతోనే నిండిపోతుండడంతో ఎంఈవోలు తనిఖీల మాట మరచినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారి స్వయంగా రోజూ పాఠశాలలు తనిఖీలు చేస్తుంటే ఎంఈ వోలు మాత్రం ఎమ్మార్సీలకే పరిమితవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీలు, తాలుకా కేంద్రాల్లో అనుమతులు లేకుండా ప్రైవేట్‌ పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నా వాటిపై చర్యలకు ఎంఈవోలు వెనకాడుతున్నారు. జిల్లాలో ఉన్న ఒకరిద్దరు ఎంఈవోల తీరు నిత్యం వివాదాస్పదమవుతోంది. ప్రైవేట్‌ పాఠశాలలకు సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల బోధన్‌ ఎంఈవో తీరుపై ఏబీవీపీ నాయకులు జిల్లా కేంద్రంలో ఆమె దిష్టిబొమ్మను దహనం చేయడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన, మౌలిక సదుపాయాలు, తదితర విషయాలపై దృష్టిపెట్టాల్సిన ఎంఈవోలు ప్రైవేట్‌ పాఠశాల అనుమతులు, లాభం చేకూర్చే పనులే చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ పాఠశాలలు

మండల కేంద్రాలు, తాలుకాలు, మున్సిపాలిటీలతో పాటు జిల్లా కేంద్రంలో ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచే విచ్చలవిడిగా ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల నుంచి మొదలుకుని హైస్కూల్‌ వరకూ ఏ స్కూల్‌ ఏర్పాటు చేయాలన్నా ఖచ్చితంగా విద్యాశాఖ అనుమతి తీసుకోవాలి. కానీ ఈ విద్యాసంవత్సరం కోసం అనుమతుల విషయమై విద్యాశాఖ సైట్‌ను క్లోజ్‌ చేశారు. అయినా ప్రభుత్వ అనుమతులు లేకుండానే జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రారంభమవుతున్నాయి. జిలా ్లకేంద్రంలో మైచోటా స్కూల్‌ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిర్వహిస్తుండగా ఆ పాఠశాలకు అనుమతి లేదని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రకటన ఇచ్చినా ఇప్పటికీ ఆ పాఠశాలపై చర్యలు తీసుకోకపోవడం ఎంఈవోల తీరును తెలియజేస్తోంది. అనుమతులు లేకుండానే నగరంలోని వర్నీరోడ్‌ల ఒక బ్రాంచ్‌, పొచమ్మగల్లిలో మరో బ్రాంచ్‌ను సదరు స్కూల్‌ ప్రారంభించి తరగతులు నిర్వహిస్తున్నా అధికారులు చర్యలకు వెనకాడుతున్నారు. 

అనవసర విషయాల్లో జోక్యం

ప్రభుత్వ పాఠశాలల పనితీరుతో పాటు అనుమతులు లేని ప్రైవేట్‌ పాఠశాలలపై ఎంఈవోల అజమాయిషీ ఉంటుంది. కానీ కొందరు ఎంఈవోలు ప్రభుత్వ పాఠశాలల విషయాలు వదిలి అనవసర విషయాలు, తమకు ఆదాయం వచ్చే విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నిజామాబాద్‌ ఎమ్మార్సీ పరిధిలో నాలుగు మండలాలు ఉండగా ఇక్కడ ప్రైవేట్‌ పాఠశాలలు అధిక సంఖ్యలో ఉండడంతో ఎమ్మార్సీ కార్యాలయంలో నిత్యం సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో ఎమ్మార్సీ అధికారి, సిబ్బంది కుమ్మక్కై ఇష్టారీతిన వ్యవహరిస్తూ చర్యలకు వెనకాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నగరంలో ఇటీవల ఒక కోచింగ్‌ సెంటర్‌ అనుమతుల విషయంలో సదరు అధికారి అన్నీతానై వ్యవహరించి అనుమతులు ఇప్పించినట్లు తెలుస్తోంది. మై చోటా స్కూల్‌ రెండు బ్రాంచీలకు అనుమతులు లేకున్నా త్వరలో అనుమతులు వస్తాయని సదరు ఎంఈవో విద్యార్థి సంఘాల నాయకులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల అనుమతుల వ్యవహారంలో జిల్లాలోని ఎంఈవో కార్యాలయాల్లో ముడుపుల వ్యవహారం జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో ప్రైవేట్‌ విద్యాసంస్థల అసోసియేషన్‌ నగర ప్రతినిధితో కలిసి ఎంఈవో ప్రైవేట్‌ పాఠశాలల అనుమతుల వ్యవహారం నడుపుతున్నట్లు సమాచారం. బోధన్‌ ఎంఈవోకు సైతం ఐదు మండలాల ఇన్‌చార్జి ఉండడంతో ఆమె తీరు వివాదాస్పదమవుతోంది. ఇటీవల బోధన్‌ లో ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్న రూంను విద్యార్థి సంఘాల ఆందోళనతో సీజ్‌ చేసినా తిరిగి తె రవడం వివా దాస్పద మైం ది. 

అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు ఫ దుర్గాప్రసాద్‌, డీఈవో

జిల్లాలో అనుమతులు లేకుండా ప్రైవేట్‌ పాఠశాలలు, కోచింగ్‌ సెంటర్‌లు నిర్వహించవద్దని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. నగరంలో మైచోటా స్కూల్‌ పేరుతో రెండు బ్రాంచ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఇప్పటికే ఆ పాఠశాలలకు అనుమతి లేదని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అనుమతులు లేకుండా నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.