జ‘టి’లం..

ABN , First Publish Date - 2020-06-06T10:05:40+05:30 IST

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కాళేశ్వరం

జ‘టి’లం..

సిద్దిపేట జిల్లాలో 16 మండలాల్లో ప్రమాద ఘంటికలు  

ములుగులో 49 మీటర్ల అడుగులో జలాలు

మెదక్‌ జిల్లావ్యాప్తంగా 30 గ్రామాల్లో  బోర్ల తవ్వకాలపై నిషేదం 

రంగంపేటలో  39 అడుగులకు పడిపోయిన వైనం


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట/మెదక్‌, జూన్‌ 5:   ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కాళేశ్వరం జలాలు పరవళ్లు తొక్కుతున్నా సిద్దిపేట జిల్లాలో భూగర్భజలాలు మాత్రం పైకి రావడం లేదు. పాతాళం దాటి నీటి గలగలలు వినిపించడంలేదు. సగటున 15 మీటర్ల లోతులో నీరు ఉన్నట్లు అధికారుల సర్వే వెల్లడించినా అంతకు కిందికే ఉన్నట్లు తెలుస్తున్నది. మెదక్‌ జిల్లాలోనూ భూగర్భజలమట్టాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. కొల్చారం మండలం రంగంపేటలో భూగర్భజలమట్టాలు 39.10 మీటర్ల మేరకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా 20 మీటర్లలోపు జలమట్టాలు నిలకడగా ఉంటేనే ఆ ప్రాంతం నీటి సౌలభ్యం కలిగి ఉంటుందని మెదక్‌ జిల్లా భూగర్భజల నిపుణులు చెబుతున్నారు.  అయితే గతేడాదితో పోల్చితే మెరుగైన పరిస్థితులున్నప్పటికీ ఆశించిన స్థాయిలో భూగర్భజలాలు  లేకపోవడం ఒకింత ఆందోళన కలిగించే విషయం..

                    

ములుగులో 49 మీటర్ల లోతులో

సిద్దిపేట జిల్లాలో 23 మండలాలున్నాయి. అందులో 16 మండలాల్లో భూగర్భజలాల స్థాయి ప్రమాదకరంగా ఉంది. ములుగు మండల కేంద్రంలో అత్యధికంగా 49 మీటర్ల లోతులో భూగర్భజలాలున్నాయి. ఆ తర్వాత దౌల్తాబాద్‌ మండలం ముబారస్‌పూర్‌లో 36 మీటర్ల లోతులో నీళ్లున్నాయి.  దుబ్బాక, జగదేవ్‌పూర్‌, గజ్వేల్‌, కొండపాక, మిరుదొడ్డి, నంగునూరు, ములుగు, సిద్దిపేటఅర్బన్‌, వర్గల్‌, రాయపోల్‌, మద్దూరు, కొమురవెల్లి, హుస్నాబాద్‌, అక్కన్నపేట మండలాలు సమస్యాత్మక, అతి సమస్యాత్మక పరిధిల్లో ఉన్నాయి. 10 మీటర్ల లోతు నుంచి 49 మీటర్ల లోతువరకు ఇక్కడ నీటి వనరులు నెలకొన్నాయి. చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్‌, చేర్యాల, మర్కుక్‌, కోహెడ, బెజ్జంకి, తొగుట మండలాలు సేఫ్‌ జోన్‌లో ఉన్నాయి. 


గతేడాది కంటే ఆందోళనకరం

గతేడాది  మేలో సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సగటున భూగర్భ జలాలు 20 మీటర్ల లోతులో ఉండగా ఈ ఏడాది మేలో 15 మీటర్లకు పెరిగాయి. 5 మీటర్లపైకి ఎగబాకినట్లుగా సర్వేలో తేలినప్పటికీ గత ఏపిల్ర్‌తో పోల్చితే ఒక మీటరు లోతుకు జలాలు పడిపోయాయి. గతేడాది నవంబర్‌లో 10 మీటర్ల అడుగులో ఉన్న జలాలు కేవలం ఆరునెలల వ్యవధిలోనే 20 మీటర్ల అడుగుకు చేరడం ఒకింత ఆందోళనకరమైన విషయమే. 


గోదావరి జలాలపైనే గంపెడాశలు

ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లలోకి గోదావరి జలాలు చేరాయి. అనంతగిరి, రంగనాయకసాగర్లు జలకళను సంతరించుకున్నాయి. తాజాగా కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్‌లోకీ నీటిని విడుదల చేశారు. చిన్నకోడూరు, బెజ్జంకి, తొగుట, కొండపాక, గజ్వేల్‌, మర్కుక్‌, జగదేవపూర్‌, కోహెడ, కొమురవెల్లి మండలాలకు ఈ కాళేశ్వరం జలాలు చేరుతున్నాయి. సుమారుగా 100 వరకు చెరువులు నిండాయి. అయినప్పటికీ భూగర్భ జలాలు పైకిరాలేదు. కాలువలు, చెరువులు, చెక్‌డ్యాముల్లో నీళ్లు ఉన్నప్పటికీ బోర్లు, బావుల్లో నీటి ఊట పెరగలేదని రైతులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే కాళేశ్వరం జలాలు జిల్లాలో ప్రవేశిస్తున్న క్రమంలో మరికొంత సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. 


కొల్చారంలో 39 మీటర్ల అడుగున

మెదక్‌జిల్లాలోని ఏకైన మధ్యతరహా ప్రాజెక్టు ఘణపురంలో నీటి జాడేలేదు. కుడి, ఎడమ కాలువలైన ఎంఎన్‌, ఎఫ్‌ఎన్‌ కెనాళ్లలో నీటిప్రవాహం లేదు. ఘణపురం ఆయకట్టు పరిధిలో సుమారు 25వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులు వరిసాగు చేస్తారు. ఈ ఏడాది వానాకాలంలో  వ్యవసాయశాఖ రూపొందించిన ప్రణాళికలో 30వేల పైచిలుకు ఎకరాల్లో వరి నాట్లు వేయనున్నట్లు సమాచారం. అయితే కాలువల్లో నీరు లేకపోవడంతో జిల్లాలో భూగర్భజలాలు తగ్గిపోతూనే ఉన్నాయి. కొల్చారం మండలం రంగంపేటలో భూగర్భజలమట్టాలు 39.10 మీటర్ల మేరకు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా 20 మీటర్ల లోపు జలమాట్టాలు నిలకడగా ఉంటేనే ఆ ప్రాంతం నీటి సౌలభ్యం కలిగి ఉంటుందని మెదక్‌ జిల్లా భూగర్భజల నిపుణులు చెబుతున్నారు. 


మెదక్‌ జిల్లాలో మే లో జిల్లా భూగర్భజలవనరులశాఖ శాస్త్రవేత్తలు నీటిమట్టాలను పరిశీలించగా కౌడిపల్లి మండలంలో 26.60 మీటర్లు, నర్సాపూర్‌లో 33 మీటర్లు, చేగుంట 26.20, పెద్దశంకరంపేట 26.50 మీటర్లు, శివ్వంపేట 32.32 మీటర్లు, టేక్మాల్‌ 37 మీటర్లు, వెల్దుర్తి 24 మీటర్ల లోతులో నీటి నిల్వలున్నట్లు గుర్తించారు. జిల్లాలో 9.60 మీటర్ల కనిష్ట లోతులో మెదక్‌ పట్టణంలోని పిల్లికొటాల్‌ లో నీరు లభ్యమౌతుండగా కొల్చారం మండలంలో 39.10 మీటర్ల దిగువకు నీరు చేరడం గమనార్హం. నిజాంపేటమండలం నస్కల్‌, చేగుంట మండలం చందాయిపేటలోనూ జలమట్టాలు తగ్గిపోతున్నాయి. ఈయేడు వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే జలమట్టాలు పెరిగే అవకాశముంది. 


వరిసాగు సజావుగా సాగేనా

వ్యవసాయశాఖ వానాకాలం సాగు ప్రణాళిక ప్రకారం జిల్లాలో లక్షా20 వేల ఎకరాల్లో రైతులు వరి సాగుచేయనున్నారు. అయితే మెదక్‌ జిల్లావ్యాప్తంగా 64వేల వ్యవసాయ బోరుబావుల ద్వారా రైతులు సాగు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతుండగా అనధికారికంగా లక్ష పైచిలుకు బోర్లు వేసినట్లు తెలుస్తోంది. తూప్రాన్‌, మనోహరాబాద్‌, చేగుంట, నర్సాపూర్‌ మండలాల  పరిధిలో భూగర్భజలాలను అత్యధికంగా వినియోగిస్తూ వ్యవసాయం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు 30 గ్రామాల్లో భూగర ్భజలాలు క్రమేపి తగ్గిపోతుండడంతో బోర్ల తవ్వకాలపై నిషేధం విధించారు.


కేవలం తాగునీటి కోసమే తప్ప మిగతా అవసరాలకు బోరుబావులు తవ్వకూడదని అధికారులు ఆంక్షలు విధించారు. నిజాంపేట మండలంలో జలశక్తి అభియాన్‌ద్వారా 75 చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు సర్వే జరిపి జలమట్టాల పెంపుదలకు నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో బోరుబావుల వద్ద వాననీటి సంరక్షణ నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారులు ఆ వైపుగా ఉపాధిహామీ కింద ఇంకుడు గుంతలు, తదితర భూగర్భజలాలు పెరిగేందుకు పనులను చేపట్టడం లేదు. 


గతేడాదితో పోలిస్తే ఒకింత మెరుగు

మెదక్‌ జిల్లాలో భూగర్భజల మట్టాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే ఒకింత మెరుగ్గానే ఉన్నాయి. 2019 మేలో జిల్లాలో 26.36 మీటర్ల లోతులో భూగర్భజలాలు లభ్యంకాగా 2020 మేలో 22.72 మీటర్ల పైకి రావడంపై జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి శ్రీనివాస్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. వరి పంటకు నీటి వినియోగం అధికంగాఉంటుండడంతో గత రెండేళ్లుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించేవారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే వరి సాగుకు నీరు అందుతుంది. లేదంటే రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

Updated Date - 2020-06-06T10:05:40+05:30 IST