యుద్ధం మొదలైంది..

ABN , First Publish Date - 2022-08-24T05:16:37+05:30 IST

టీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలయ్యిందని, ఇక యువకులు బిస్తర్‌ సర్దుకుని రావాల్సిన సమయం వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.

యుద్ధం మొదలైంది..
బందోబస్తు మధ్య బండి సంజయ్‌ని ఇంటికి తీసుకువస్తున్న పోలీసులు


- ఆగినచోటు నుంచే యాత్ర ప్రారంభిస్తాం

- కూతురును కాపాడుకునేందుకే అడ్డుకున్నారు

- నిజాయితీ ఉంటే కవితను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి

-  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీఆర్‌ఎస్‌పై యుద్ధం మొదలయ్యిందని, ఇక యువకులు బిస్తర్‌ సర్దుకుని రావాల్సిన సమయం వచ్చిందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం ఉదయం ఆయనను జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం  వరంగల్‌ మీదుగా కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తీసుకొచ్చి గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ విలేకరులతో మాట్లాడుతూ 21 రోజులుగా ప్రశాంత వాతావరణంలో పోలీసుల అనుమతి తీసుకుని ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహిస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తమపై దాడులు చేసినా జెండా పట్టుకుని ప్రజల కోసం యాత్ర చేస్తున్నామని చెప్పారు. 


అరెస్టుకు కారణం చెప్పండి..


తనను అరెస్టు చేయడానికి కారణమేమిటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. శాంతి భద్రతల సమస్య టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు, కార్యకర్తల వల్లనే తలెత్తుతున్నదని ఆరోపించారు. రాళ్లు, రాడ్లు, కోడిగుడ్లు పట్టుకుని తన యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారిని అరెస్టు చేయకుండా తమను అరెస్టు చేయడమేమిటని ప్రశ్నించారు. సీఎం ఆదేశాలతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని, వారు అడ్డుకుంటే తమకేమి కాదని అన్నారు. కేసీఆర్‌ సీఎం కావడం వల్లనే దాదాగిరీ చేస్తున్నాడన్నారు. వేల కోట్ల రూపాయలు ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.  ఎక్కడ యాత్రను ఆపారో అక్కడి నుంచే తిరిగి యాత్రను కొనసాగిస్తామని, 27న జేపీ నడ్డాతో వరంగల్‌ సభను నిర్వహించి తీరుతామని సంజయ్‌ స్పష్టం చేశారు. ఢిల్లీలో లిక్కర్‌ స్కాం బయట పడిందని, అందులో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందనే ఆరోపణలు వస్తున్నందునే, ఆమెను కాపాడుకునేందుకు ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారన్నారు. దేశ్‌కీ నేత కేసీఆర్‌ దేశం మొత్తాన్ని లిక్కర్‌ స్కాంలో ముంచుతారని ఎద్దేవా చేశారు. 21 రోజులుగా క్రమశిక్షణతో యాత్ర చేస్తున్నామని, అడ్డుకోవాలని వస్తున్న ఆదేశాలతో పోలీసులే బాధ పడుతున్నారని అన్నారు. లిక్కర్‌ స్కాంపై ఈఎం స్పందన కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నదని సంజయ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌శ్రేణులు బీజేపీ కండువాలు కప్పుకుని దాడులు చేయడం సిగ్గు చేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు నిరసన దీక్ష నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సంగ్రామయాత్రలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సంజయ్‌ యువతకు విజ్ఞప్తి చేశారు. సమావేశంలో బీజేపీ నాయకులు ధర్మారావు, పన్నాల శ్రీరాములు, కొండేటి శ్రీధర్‌, యశ్వంత్‌రెడ్డి పాల్గొన్నారు.


బండి సంజయ్‌ గృహ నిర్బంధం


- ఎంపీ నివాసం వద్ద భారీ బందోబస్తు 

- జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు 


కరీంనగర్‌ టౌన్‌/క్రైం/గణేశ్‌నగర్‌/సుభాష్‌నగర్‌: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను పోలీసులు కరీంనగర్‌లో గృహ నిర్బంధం చేశారు. మూడో విడత ప్రజాసంగ్రామ పాదయాత్ర సందర్భంగా సోమవారం రాత్రి జనగాం జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం పామునూరులో బసచేసిన సంజయ్‌కుమార్‌ గంటసేపు ధర్మ దీక్ష చేపట్టి, సంగ్రామయాత్ర కొనసాగిస్తానని ప్రకటించారు. మంగళవారం ధర్మదీక్ష చేపట్టేందుకు సంజయ్‌ సిద్ధమవుతున్న తరుణంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు దీక్షను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశాలున్నాయంటూ పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్టు చేశారు. అనంతరం కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తీసుకొని వచ్చి గృహనిర్భందం చేశారు.  సంజయ్‌ని అరెస్టు చేసిన పోలీసులు ముందుగా వరంగల్‌కు తీసుకువెళ్తారని ప్రచారం జరిగింది. అనంతరం హన్మకొండ మీదుగా హుస్నాబాద్‌, కొత్తపల్లి వరకు తీసుకువచ్చి సిద్దిపేట జిల్లాకు తరలిస్తారని వార్తలు వచ్చాయి. పోలీసులు అందరి ఊహలను తలకిందులు చేస్తూ భారీ బందోబస్తు మధ్య కరీంనగర్‌ సంజయ్‌ ఇంటికి తీసుకువచ్చి గృహ నిర్బంధం చేశారు. అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌ నేతృత్వంలో కరీంనగర్‌ టౌన్‌ ఏసీపీ తులా శ్రీనివాస్‌రావు, కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ టి కరుణాకర్‌రావు ఆధ్వర్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. సంజయ్‌ ఇంటికి వెళ్లే నాలుగు రహదారులను మూసివేశారు. 


భారీగా తరలివచ్చిన కార్యకర్తలు


సంజయ్‌ని కలిసేందుకు జిల్లా నుంచే కాకుండా వరంగల్‌, హైదరాబాద్‌, సిద్దిపేట, ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఇంటివద్దనే నిలిపివేశారు. నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి వద్దకు చేరుకోవడంతో పోలీసులు మరింత బలగాలను పెంచారు. ప్రజాసంగ్రామయాత్రలో సంజయ్‌తో కలిసి ఉన్న వరంగల్‌, జనగామ జిల్లా నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు ఎంవీఎస్‌ ప్రభాకర్‌, బొడిగె శోభగాలన్న, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమతోపాటు రాష్ట్ర, జిల్లాలోని ముఖ్యనాయకులను మాత్రమే పోలీసులు సంజయ్‌ని కలిసేందుకు అనుమతిచ్చారు. 


 సంజయ్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫోన్‌


ప్రజాసంగ్రామయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం చేయడంపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. ముందుగా కేంద్రహోంశాఖమంత్రి అమిత్‌షా సంజయ్‌తో ఫోన్‌లో సంఘటనకు సంబంధించిన విషయాలను ఆరా తీశారు.   బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సంజయ్‌తో ఫోన్‌లో సంఘటన వివరాలను తెలుసుకొని సంజయ్‌ అరెస్టును ఖండించారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తోన్న ప్రజాధరణతో సీఎం కేసీఆర్‌ ఆందోళకు గురవుతున్నారన్నారు, ప్రజాస్వామ్యయుతంగా పోరాడి, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌, కేసీఆర్‌కు చరమగీతం పాడుతామని ట్వీట్‌ చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌చుగ్‌, పలువురు కేంద్ర మంత్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి నాయకులు సంజయ్‌కి ఫోన్‌ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 


 ప్రజా సంగ్రామయాత్రకు అనుమతి రద్దుచేస్తూ నోటీసుల జారీ 


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ రాష్ట్రంలో చేపడుతున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దుచేస్తున్నామని, ప్రజా సంగ్రామయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు సంజయ్‌కి నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ధర్మసాగర్‌ సీఐ కరీంనగర్‌లోని సంజయ్‌ నివాసానికి వచ్చి నోటీసులను అందజేసినట్లు పోలీసులు తెలిపారు. 


 సంజయ్‌ ఇంటి ముట్టడికి టీఆర్‌ఎస్‌ యత్నం... 


ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు చల్ల హరిశంకర్‌ ఆధ్వర్యంలో నాయకులు కోల ప్రశాంత్‌,  టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్‌ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్‌తోపాటు మరికొంత మంది కార్యకర్తలు ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఇంటి వరకు రాకుండానే అడ్డుకొని అరెస్టు చేసి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 


 పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనం


ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించడాన్ని నిరసిస్తూ  మేయర్‌ యాదగిరి సునీల్‌రావు ఆధ్వర్యంలో తెలంగాణచౌక్‌లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్‌శ్రేణులు దహనం చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ప్రజాసంగ్రామయాత్ర, ధర్మదీక్షను భగ్నంచేసి సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు హౌస్‌ అరెస్టు చేశారని ఆరోపిస్తూ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్‌ దుబాల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జ్యోతినగర్‌లోని వివేకానందచౌక్‌లో ఆ పార్టీశ్రేణులు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మలను దహనం చేశారు. జిల్లావ్యాప్తంగా ఓవైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీ నాయకులు పోటాపోటీగా ఆందోళనలు, నిరసనలు చేపట్టారు.


Updated Date - 2022-08-24T05:16:37+05:30 IST