టీఆర్‌ఎస్‌కు గోరి కడుతారు

ABN , First Publish Date - 2022-05-16T05:30:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని, రాబోయే కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు తప్పకుండా గోరి కడతారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు.

టీఆర్‌ఎస్‌కు గోరి కడుతారు
అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఈటల రాజేందర్‌

  హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌


చిన్నకోడూరు, మే 16: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేదని, రాబోయే కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి రైతులు, ప్రజలు తప్పకుండా గోరి కడతారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చౌడారం మధిర గ్రామం ఎల్లమ్మజాలులో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ, పెద్దిరాజుల కల్యాణ మహోత్సవంలో సోమవారం ఆయన పాల్గొని మాట్లాడారు. వరి వేస్తే ఊరే అని, పంటలు వేయొద్దు అని చెప్పిన సీఎం కేసీఆర్‌ సిద్దిపేట మున్సిపల్‌ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో రూ.కోట్ల విలువ చేసే భూములను ఎందుకు తీసుకున్నారని, ప్రాజెక్టులు ఎందుకు నిర్మించారో సమాధానం చెప్పాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో బస్తాలు, హమాలీలు, రవాణా సౌకర్యం లేక, లారీల్లోని ధాన్యం అన్‌లోడ్‌కాక రోజుల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. రంగనాయకసాగర్‌ లాంటి ప్రాజెక్టుల్లో మత్స్యకారులకు సభ్యతాలు ఇవ్వకుండా వారి జీవితాల్లో మట్టి కొడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల జీవితాలు ముఖ్యమా, రంగుల ప్రపంచం ముఖ్యమా అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. పెద్ద పెద్ద రోడ్లు వేసి, గెస్ట్‌హౌజ్‌లు కట్టి రంగనాయకసాగర్‌ను ఎగ్జిబిషన్‌ సెంటర్‌లాగా చూపించడానికి అది వస్తువా, పంట పొలాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఎనిమిది సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసిగి వేసారిపోయారన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికలో మంత్రి హరీశ్‌రావు ఎన్ని జిమ్మికులు చేసిన, బెదిరింపులకు పాల్పడినా, ఓట్లను కొనే ప్రయత్నం చేసినా ప్రజలు చెంప చెల్లుమనిపించారన్నారు. హుజూరాబాద్‌లాగే రేపు సిద్దిపేట, గజ్వేల్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అదే తీర్పు ఇస్తారన్నారు. అనంతరం చిన్నకోడూరులో అంబేడ్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులార్పించారు. ఆయనవెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-05-16T05:30:00+05:30 IST