పంజ్‌షీర్‌పై తాలిబాన్ల పంజా?

ABN , First Publish Date - 2021-09-07T06:51:42+05:30 IST

ఇంతకాలం తమను ఎదిరించి నిలబడ్డ పంజ్‌షీర్‌ ప్రావిన్సును

పంజ్‌షీర్‌పై తాలిబాన్ల పంజా?

  • లోయ స్వాధీనమైనట్లు ప్రకటన
  • ఖండించిన రెబెల్స్‌.. 
  • పోరు కొనసాగుతోందని వెల్లడి
  • తాలిబాన్‌ కమాండర్‌ ఫసీ హతం
  • తొలుత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు!
  • త్వరలో ప్రకటిస్తాం: జబియుల్లా
  • మంత్రుల ప్రమాణ స్వీకారాలకు చైనా, పాకిస్థాన్‌లకు ఆహ్వానం
  • గర్భిణీ పోలీసు అధికారిణి కాల్చివేత


 కాబూల్‌/వాషింగ్టన్‌, సెప్టెంబరు 6: ఇంతకాలం తమను ఎదిరించి నిలబడ్డ పంజ్‌షీర్‌ ప్రావిన్సును పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకున్నామని తాలిబాన్లు ప్రకటించారు. ఆదివారం అర్ధరాత్రికల్లా తమ సేనలు పంజ్‌షీర్‌లోని ఎనిమిది ప్రావిన్సుల్లోకి ప్రవేశించాయని వెల్లడించారు. ఆ ప్రావిన్సు గవర్నర్‌ కార్యాలయంలో తమ సేనలు కూర్చుని ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. ఇంత కాలం పంజ్‌షీర్‌లో రెబెల్స్‌ పోరాటానికి నేతృత్వం వహించిన అహ్మద్‌ మసూద్‌, మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ విదేశాలకు పారిపోయారని తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా ముజాహిద్‌ ప్రకటించారు. ఈ పోరులో తాలిబాన్ల కీలక కమాండర్‌ ఫసియుద్దీన్‌ చనిపోయారని చెప్పారు. పంజ్‌షీర్‌లో మాజీ ఉపాధ్యక్షుడు సలేహ్‌, రెబెల్స్‌ నేత మసూద్‌ జాడ కనిపించలేదని, వారు అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారని చెప్పారు. సలేహ్‌ తజ్‌కిస్థాన్‌కు వెళ్లినట్లు పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు కథనాలు ప్రసారం చేశాయి.


అయితే.. తాలిబాన్ల ప్రకటనను రెబెల్స్‌ ఖండించారు. తాము కడదాకా పోరాడతామని ప్రకటించారు. ఈ మేరకు అహ్మద్‌ మసూద్‌ ఫేస్‌బుక్‌లో ఓ వాయిస్‌ రికార్డ్‌ను పోస్టు చేశారు. ‘‘పంజ్‌షీర్‌పై తాలిబాన్ల పోరులో పాకిస్థాన్‌ కూడా పాలుపంచుకుంటోంది. అధునాతన డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఈ దాడిలో రెబెల్స్‌ అధికార ప్రతినిధి, గత ప్రభుత్వంలో మీడియా వ్యవహారాల అధికారి ఫయీమ్‌ దాస్తీ మృతిచెందారు’’ అని వెల్లడించారు. గత ప్రభుత్వంలో అఫ్ఘాన్‌ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్‌ అయిన అబ్దుల్లా అబ్దుల్లాకు ఫయీమ్‌ దాస్తీ మేనల్లుడు.


‘‘ఫేస్‌బుక్‌ వేదికగా సమస్త అఫ్ఘాన్‌ పౌరులకు నేను ఇస్తున్న సందేశమిదే. తాలిబాన్లపై ఎక్కటికక్కడ తిరుగుబాటు బావుటా ఎగురవేయండి’’ అని మసూద్‌ ఆ వాయిస్‌ రికార్డులో పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జరిగిన డ్రోన్‌ దాడుల్లో ఫయీమ్‌తో పాటు.. అహ్మద్‌ మసూద్‌ మేనల్లుడు సాహిబ్‌ అబ్దుల్‌ వదూద్‌ జహోర్‌ కూడా చనిపోయినట్లు తెలిసింది. అటు అహ్మద్‌ మసూద్‌ విదేశీ వార్తాసంస్థతో మాట్లాడుతూ.. కాబూల్‌ వచ్చిన ఐఎ్‌సఐ చీఫ్‌ ఫయాజ్‌ అహ్మద్‌ కనుసన్నల్లో పాక్‌ వాయుసేన డ్రోన్‌ దాడులకు పాల్పడిందని పేర్కొన్నారు.  



తొలుత తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు!

ప్రభుత్వ ఏర్పాటుపై తాలిబాన్ల అధికార ప్రతినిధి జబియుల్లా మాట్లాడారు. ‘‘ఇప్పుడు అఫ్ఘాన్‌ మొత్తం మా నియంత్రణలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు తుది దశలో ఉన్నాయి, తొలుత తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. పూర్తిస్థాయి ప్రభుత్వ ఏర్పాటుకు కొంచెం సమయం పడుతుంది. మా ప్రభుత్వంపై పాక్‌ సహా విదేశీ శక్తుల అజమాయిషీ ఉండబోదు’’ అని వివరించారు. సుప్రీంలీడర్‌గా అంతా అనుకుంటున్నట్లుగానే అఖుంద్‌జాదా పేరును ఆయన ప్రకటించారు. ఐఎ్‌సఐ చీఫ్‌ కాబూల్‌ పర్యటనపై స్పందిస్తూ.. ఆయన తమ భావి అధ్యక్షుడు బరాదర్‌తో భేటీకి వచ్చారని తెలిపారు.


కాగా.. సుప్రీంలీడర్‌కు ఇద్దరు డిప్యూటీలు ఉంటారని.. వారిలో మొదటివాడు ముల్లా బరాదర్‌ కాగా, రెండోవాడు ముల్లా అబ్దుస్‌ సాలం అని తాలిబాన్‌ వర్గాలు వెల్లడించాయి. హక్కానీ నెట్‌వర్క్‌కు చెందిన సిరాజ్‌ హక్కానీకి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖను కేటాయిస్తారని, ఆయనే అన్ని ప్రావిన్సుల గవర్నర్లను నియమిస్తారని వివరించాయి. తాలిబాన్ల మరో కీలక నేత ముల్లా ఆమీర్‌ఖాన్‌ ముత్తఖీకి విదేశీ వ్యవహారాల బాధ్యతలను అప్పగిస్తారని తెలిపాయి.


త్వరలో జరగనున్న అఫ్ఘాన్‌ ప్రభుత్వ పెద్దల ప్రమాణ స్వీకారాలకు పాకిస్థాన్‌, చైనా, టర్కీ, ఖతార్‌, రష్యా, ఇరాన్‌లకు ఆహ్వానాలు అందినట్లు సమాచారం. కాబూల్‌ విమానాశ్రయంపై మానవబాంబు దాడి తర్వాత.. జలాలాబాద్‌లో 80 మంది ఐఎ్‌స-కే ఉగ్రవాదులను అరెస్టు చేశామని    నంగన్హార్‌ ప్రావిన్సు గవర్నర్‌ ముల్లా నేదా మహమ్మద్‌ చెప్పారు. సంగీతంపై తాలిబాన్ల సర్కారులో నిషేధం ఉన్న నేపథ్యంలో వారు ఎక్కడికక్కడ వాయిద్యాలను ధ్వంసం చేస్తున్నారు. 




పాఠశాలలు, కళాశాలల్లో పరదాలు

కో-ఎడ్యుకేషన్‌కు వ్యతిరేకమని ప్రకటించిన తాలిబాన్లు ప్రత్యేక విద్యాసంస్థలు లేని సందర్భాల్లో బాలికలు, యువతులు కొన్ని నిబంధనలను పాటించాలని ఆదేశించారు. ముఖం కప్పుకొనేలా నఖాబ్‌ ధరించాలని, తరగతుల్లో విద్యార్థినులు, విద్యార్థులకు మధ్య పరదాలు కట్టాలని హుకుం జారీ చేశారు.  కొన్ని సంస్థల్లో సోమవారం పరదా పద్ధతి కనిపించింది.


గర్భిణీ పోలీసు అధికారిణి కాల్చివేత

తాలిబాన్లు ఓ వైపు శాంతి వచనాలు వల్లెవేస్తూనే.. మరోవైపు తమకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా ఆదివారం ఘోర్‌ ప్రావిన్సులోని ఫిరోజ్కో నగరంలో నిగారా అనే ఓ మహిళా పోలీసు అధికారిని ఆమె పిల్లల కళ్ల ముందే కాల్చి చంపారు. ఆమె ఎనిమిది నెలల గర్భిణి కావడం గమనార్హం! గత ప్రభుత్వంలో ఆమె ఘోర్‌ జైలులో అధికారిణిగా పనిచేశారు. ఆ సమయంలో జైలులో ఉన్న తాలిబాన్లు ఆమెపై కక్షకట్టి ఈ దారుణానికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఘోర్‌ ప్రావిన్సులోని తాలిబాన్లు మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని కొట్టిపారేశారు. విచారణ జరిపించి, నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.


Updated Date - 2021-09-07T06:51:42+05:30 IST