ఊరుకోసం పోరుబాట

ABN , First Publish Date - 2022-01-06T06:07:02+05:30 IST

ఊరికోసం నాలుగు గ్రామాల ప్రజలు పోరు బాట పట్టారు. తమ గ్రామాల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, బోరుబావులు ఎండి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఊరుకోసం పోరుబాట
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న జానకిపురం గ్రామస్థులు(ఫైల్‌)

బిక్కేరు వాగునుంచి తరలుతున్న ఇసుక

పడిపోతున్న భూగర్భజలాలు, ఎండిపోతున్న బోరుబావులు

పంటల సాగుకూ, తాగునీటికి తప్పని తిప్పలు

ఇసుక తరలించవద్దంటూ అడ్డగూడూరు మండల ప్రజల ఆందోళన 



(ఆంధ్రజ్యోతి,యాదాద్రి) : ఊరికోసం నాలుగు గ్రామాల ప్రజలు పోరు బాట పట్టారు. తమ గ్రామాల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని, బోరుబావులు ఎండి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సాగు, తాగునీటికి కష్టాలు తప్పేలా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసు క తరలింపును ఆపకుంటే ఆత్మహత్యలకు పాల్ప డుతామని హెచ్చరిస్తూ, ఇసుక లారీలు, ఎక్స్‌కవేటర్లను అడ్డుకుంటూనే ఉన్నారు. గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తూ, కలెక్టరేట్‌ ఎదుట నిరసనలు తెలుపుతూ అడ్డగూడూరు మండల ప్రజలు ముందుకు సాగుతున్నారు.


అడ్డగూడూరు మండల పరిధిలోని బిక్కేరు వాగులో నాణ్యమైన ఇసుక లభ్యమవుతుంది. ఇక్కడి నుంచి సాగునీటి ప్రాజెక్ట్‌లకోసం ఇసుకను తరలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వుతున్నారన్న ఆరోపణలున్నాయి. వాగులో నుంచి ఇసుక తరలించ వద్దంటూ గ్రామస్థులు లారీలు, ఎక్స్‌కవేటర్లను అడ్డుకుంటూనే ఉన్నారు. ఇసుక తవ్వడంతో వ్యవసాయ బోర్లన్నీ పూర్తిగా ఎండిపోతున్నాయని, సాగుచేసిన పంటలకు నీరు అందడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కాళేశ్వరం, బస్వాపూర్‌ ప్రాజెక్టుల కోసం అనుమతి తీసుకుని, హైదరాబాద్‌వంటి నగరాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇసుక కాంట్రాక్టర్లకు ఇచ్చిన అనుమతి కంటే అధిక శాతం తరలిస్తున్నారని ఆందోళన వ్య క్తంచేస్తున్నారు. అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారని కలెక్టర్‌ పమేలాసత్పథికి ఇటీవల ఫిర్యాదుచేశారు. అడ్డగూడూరు మండలంలోని జానకిపురం, చిర్రగూడురు, లక్ష్మీదేవిపల్లి, డీ.రేపాక గ్రామస్థులుప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఇసుక తరలింపును అడ్డుకోవావాలని కలెక్టర్‌కు విన్నవిస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలు నిర్వహించారు. గత నెలలో చిర్రగూడూరు వద్ద వాగులో ఇసుక తరలింపును గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ సమయంలో ఓ మహిళా రైతు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆందోళన చేస్తున్న గ్రామస్థులు, రైతులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలిస్తుండగా మరో మహిళ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇసుక లారీలను అడ్డుకున్న పలువురిపై కేసులు నమోదు చేశారు. మరోసారి గత నెల 27వ తేదీన జానకిపురం గ్రామానికి చెందిన సర్పంచ్‌తోపాటు వందలాది మంది రైతులు, గ్రామస్థులు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. బిక్కేరు వాగులో ఇసుక తవ్వకంతో లక్షల రూపాయలు వెచ్చించి వేసుకున్న వ్యవసాయ బోర్లు ఎండిపోయాయని, తాము వేసుకున్న నారుమళ్లు కూడా ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.


వాగును పరిశీలించిన అధికారుల బృందం 

గ్రామస్థుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై రెవెన్యూ, ఇరిగేషన్‌, భుగర్భ జలవనరుల శాఖ అధికారులతో కూడిన బృం దం సభ్యులు బిక్కేరు వాగును పరిశీలించి, గ్రామస్థులతో చర్చించారు. అయితే బస్వాపూర్‌, కాళేశ్వరం ప్రాజెక్టుల కోసం 10 లారీలు తరలించి, మరో 30 లారీల ఇసుకను హైదరాబాద్‌ తరలించి విక్రయిస్తున్నారని గ్రామస్థులు అధికారులకు వివరించారు. వాగులో ఎండిపోయిన రైతుల బోర్లను కూడా చూపించారు. తమకు జీవనాధారమే ఈ వాగు నీరని, వెంటనే ఇసుక తరలింపును నిలిపివేయాలని కోరారు. గ్రామస్థుల నుంచి అధికారులు వివరాలు తీసుకుని వెనుదిరిగారు. అయితే ఇటీవల మరోసారి జానకిపురంలో ఇసుకను తరలిస్తుండటంలో గ్రామస్థులు ఆందోళన నిర్వ హించారు. అధికారులు మాత్రం ప్రభుత్వ అనుమతి మేర కు ఇసుకను తరలిస్తున్నారని పేర్కొంటున్నారు. అయితే ఇసుకను ఇలాగే తవ్వితే వ్యవసాయంతో పాటు తాగునీటికి కూడా  తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బిక్కేరు వాగులో ఇసుక తరలింపు నిలిపివేసే వరకూ పోరాటం చేసేందుకు ఆయా గ్రామాల ప్రజలు, రైతులు సన్నద్ధమవుతున్నారు.

Updated Date - 2022-01-06T06:07:02+05:30 IST