సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. ప్రధాని నుంచి సీఎం వరకు ఈ బాలికకు రివార్డుల ప్రకటనలు.. ఇప్పుడు ఈమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిస్తే..

ABN , First Publish Date - 2021-11-26T18:31:05+05:30 IST

సరిగ్గా 13 ఏళ్ల క్రితం భారత ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన నరమేథానికి ఆమె ప్రత్యక్ష సాక్షి.

సరిగ్గా 13 ఏళ్ల క్రితం.. ప్రధాని నుంచి సీఎం వరకు ఈ బాలికకు రివార్డుల ప్రకటనలు.. ఇప్పుడు ఈమె ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలిస్తే..

సరిగ్గా 13 ఏళ్ల క్రితం భారత ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన నరమేథానికి ఆమె ప్రత్యక్ష సాక్షి.. బాధితురాలు కూడా.. కాలు కోల్పోయి కష్టాల్లో ఉన్నా కూడా ఆ బాలిక తన బాధ్యతగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది.. ఎంతో మందిని బలిగొన్న రాక్షసుడిని శిక్షించడంలో ప్రభుత్వానికి సహాయపడింది.. అప్పుడు ఆమె ధైర్యాన్ని, తెగువను అందరూ మెచ్చుకున్నారు.. ప్రధాని నుంచి సీఎం వరకు అందరూ ఆ బాలికను ప్రశంసించారు.. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించారు.. అయితే వారి మాటలన్నీ నీటి మీద రాతలేనని ఆమెకు తెలిసొచ్చింది.. 13 ఏళ్లు గడిచినా వారి హామీలు నెరవేరలేదు.. ఆమె కుటుంబం ప్రస్తుతం దుర్భర పరిస్థితుల్లో ఉంది.. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. 


`నా పేరు దేవికా రోతవాన్. ఇప్పుడు నా వయసు 22 సంవత్సరాలు. 13 ఏళ్ల క్రితం 9 ఏళ్ల వయసులో ఉండగా 2008 నవంబర్ 26న ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్‌కు వెళ్లాను. పుణెలో ఉన్న నా సోదరుడిని కలిసేందుకు ట్రైన్ ఎక్కేందుకు మా నాన్నతో కలిసి బయలుదేరాను. ట్రైన్ కోసం 12వ నెంబర్ ప్లాట్‌ఫామ్‌లో ఎదురుచూస్తుండగా స్టేషన్‌లోని ప్రజలందరూ బిగ్గరగా అరుస్తూ పరిగెత్తడం ప్రారంభించారు. పేలుళ్ల చప్పుళ్లు కూడా వినిపించాయి. మా నాన్న నా చేయి పట్టుకుని పరిగెత్తారు. అప్పుడే నా కుడి కాలులో ఓ బుల్లెట్ దిగింది. దీంతో నేను కింద పడిపోయాను. ఒక వ్యక్తి నవ్వుకుంటూ ప్రజలను తుపాకీతో కాలుస్తున్నాడు. చూస్తుండగానే నా చుట్టూ ఎంతో మంది కుప్పకూలిపోయారు. 


రక్తం బాగా పోవడంతో నేను స్పృహ కోల్పోయాను. కళ్లు తెరిచేసరికి సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో ఉన్నాను. ఆరు నెలల్లో ఆరు శస్త్రచికిత్సలు చేసిన తర్వాత నన్ను డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత ఒకరోజు మా నాన్నకు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది. `కసబ్‌ను మీ కూతురు గుర్తుపట్టగలదా`? అని అడిగారు. నేను సాక్షిగా ఉండేందుకు అంగీకరించాను. కోర్ట్ రూమ్‌కు వెళ్లి కసబ్‌ను గుర్తు పట్టాను. ఆ కార్యక్రమం తర్వాత మా జీవితం మొత్తం మారిపోయింది. నేను కసబ్‌ను గుర్తుపట్టానని తెలిసి మా బంధువులు, స్నేహితులు మాకు దూరమయ్యారు. పాకిస్థాన్ తీవ్రవాదులు ఎప్పటికైనా మమ్మల్ని చంపేస్తారని, మాతో స్నేహం చేస్తే వారికి కూడా ప్రమాదమని అందరూ దూరమయ్యారు. 


నేను కసబ్‌ను గుర్తుపట్టడంలో సహాయం చేసినందుకు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి ప్రశంసించారు. నాకు ఇల్లు ఇస్తామని, మా కుటుంబాన్ని ఆదుకుంటామని హామీలిచ్చారు. ఆ తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు. రాజకీయ నాయకుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్‌ చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. నేను, మా అన్నయ్య దివ్యాంగులం. మా తండ్రి వ్యాపారం పూర్తిగా నాశనం అయింది. అందుకే మాకు రావాల్సిన పరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించామ`ని దేవిక తెలిపింది. 

Updated Date - 2021-11-26T18:31:05+05:30 IST