స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

ABN , First Publish Date - 2022-08-12T05:59:03+05:30 IST

ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తే ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పేర్కొన్నారు.

స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి
సంఘీభావం తెలుపుతున్న కార్మిక సంఘ నేతలు, సీపీఐ నాయకులు

ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ 

కూర్మన్నపాలెం, ఆగస్టు 11: ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తే ఆర్థిక ప్రగతి కుంటుపడుతుందని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ పేర్కొన్నారు. కూర్మన్నపాలెంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 546వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకిన్‌ ఇండియా ముసుగులో ఇండియా ఫర్‌ సేల్‌ అనే రీతిలో ప్రజా పాలన చేయంం ప్రధాని మోదీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పడుతుందన్నారు. ప్రభుత్వ రంగాలను ప్రైవేటీ వ్యక్తులకు విక్రయించాలనే తప్పుడు ఆలోచన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కినట్టవుతుందన్నారు. వేలాది మంది ప్రజల మనోభావాలతో ముడిపడి వున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఎదురయ్యే పరిస్థితులకు ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాల్సి వుంటుందని పేర్కొన్నారు. దీక్షా శిబిరానికి సీపీఐ గాజువాక నియోజకవర్గ కార్యదర్శి కసిరెడ్డి సత్యన్నారాయణ తమ బృంద సభ్యులతో విచ్చేసి సంఘీభావం తెలిపారు. ఈ నెల 26 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు విశాఖలో జరగనున్న నేపథ్యంలో కార్మికులంతా విజమవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరంధామయ్య, దేముడు, గంగవరం గోపి, ప్రసాద్‌, ఆనంద్‌, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-12T05:59:03+05:30 IST