పడమటి ప్రాంతాల కోసం

ABN , First Publish Date - 2020-07-04T11:14:28+05:30 IST

తాగునీటి సమస్యతో దశాబ్దాలుగా ఇబ్బందిపడుతున్న 23 పడమటి మండలాల్లో రూ. 2800 కోట్లతో ఒక ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం

పడమటి ప్రాంతాల కోసం

రూ. 2800 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌

23 మండలాల్లో తాగునీటి సమస్యకు పరిష్కారం


కలికిరి, జూలై 3:తాగునీటి సమస్యతో దశాబ్దాలుగా ఇబ్బందిపడుతున్న 23 పడమటి మండలాల్లో  రూ. 2800 కోట్లతో ఒక ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.ఆర్థికపరమైన అనుమతుల కోసం ఎదురు చూడకుండా శుక్రవారం ప్రభుత్వం పాలనాపరమైన మంజూరు ఉత్తర్వులు జారీ చేసింది.తంబళ్ళపల్లె, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాలకు పూర్తిగా, మదనపల్లె, చంద్రగిరి నియోజకవర్గాలకు పాక్షికంగా ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీటి సమస్యకు పరిష్కారం చూపనున్నారు.


ఆరు మార్గాల్లో రుణాలు సేకరించి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సంకల్పించారు.ప్రాజెక్టుకు అవసరమైన నీటికోసం పూర్తిగా గండికోట రిజర్వాయరు పైనే ఆధారపడాల్సి వుందని అఽధికారులు అంచనా వేస్తున్నారు. గండికోట ప్రాజెక్టు నీటిని కేవీపల్లె మండలంలో నిర్మించిన అడవిపల్లె రిజర్వాయరులో నిల్వ చేసి అక్కడి నుంచి సరఫరా చేయడం ఒక మార్గం కాగా, గండికోట నుంచి నేరుగా మదనపల్లె కాలువలకు సమాంతరంగా పైపు లైన్లు, లిఫ్ట్‌ ఇరిగేషన్లు ఏర్పాటు చేసి తరలించడం రెండో మార్గంగా చెబుతున్నారు. జిల్లాలో సెక్టార్‌-1గా చేపట్టబోయే ఈ ప్రాజెక్టు బహుళార్ధకంగా కాకుండా కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితం చేయనున్నారు. ప్రాజెక్టు భౌతిక స్వరూపాన్ని రెండుగా విడగొట్టారు.


ముడి నీటిని తరలించి నిల్వచేయడానికి రూ. 1475 కోట్లు కేటాయించారు.వాటిని తాగడానికి అనువుగా మార్చి సరఫరా చేయడానికి రూ. 1325 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టుతో లబ్ధి పొందే మండలాలివే ఈ ప్రాజెక్టుతో పడమటి ప్రాంతాలకు చెందిన 23 మండలాలతోపాటు మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలు లబ్ధి పొందనున్నాయి. ఈ 23 మండలాలను మూడు జోన్లుగా విడదీసి నీటిని సరఫరా చేయడానికి ప్రతిపాదించారు. మొదటి జోన్‌లో పెద్దమండ్యం, పీటీఎం, తంబళ్ళపల్లె, బి.కొత్తకోట, మొలకలచెరువు, కురబలకోట , రెండవ జోన్‌లో నిమ్మనపల్లె, రామసముద్రం, మదనపల్లె , పుంగనూరు, చౌడేపల్లె, సోమల, గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలు, మూడవ జోన్‌లో కలికిరి, కేవీ పల్లె, కలకడ, పీలేరు, రొంపిచెర్ల, పులిచెర్ల, సదుం, ఎర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు మండలాలున్నాయి. 

Updated Date - 2020-07-04T11:14:28+05:30 IST