ఈ టిప్స్‌ పాటిస్తే స్మార్ట్‌ఫోన్‌ సేఫ్‌

ABN , First Publish Date - 2022-01-01T05:30:00+05:30 IST

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే జీవితం ముందుకు సాగని

ఈ టిప్స్‌ పాటిస్తే స్మార్ట్‌ఫోన్‌ సేఫ్‌

చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేనిదే జీవితం ముందుకు సాగని రోజులివి. బిజినెస్‌, షాపింగ్‌, బ్యాంకింగ్‌, కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ సహా అన్నింటికీ ఏకైక సాధనం స్మార్ట్‌ఫోన్‌. ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ నివేదిక ప్రకారం రోజుకు యాభై కంటే ఎక్కువసార్లు స్మార్ట్‌ఫోన్‌ను వాటి వినియోగదారులు చెక్‌ చేస్తూ ఉంటారు. ఈ వినియోగం కారణంగానే హ్యాకర్లు, సైబర్‌ నేరగాళ్ళు దృష్టి అటు మళ్లిందంటే అతిశయోక్తి కాదు. అయితే కొన్ని టిప్స్‌ పాటిస్తే వినియోగదారులు తమ డివైస్‌ను సేఫ్‌ ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. 


వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ చెక్‌

వైర్‌లెస్‌ నెట్‌వర్క్‌ను మనం కోరుకుంటాం. ఇల్లు లేదా ఆఫీసులో పనిచేసుకోవడంతో మొదలుపెట్టి, మొబైల్‌ హాట్‌స్పాట్‌ వరకు దేనికైనా ఇది వర్తిస్తుంది. డివైస్‌ ఏదైనా వాయుమార్గంలోనే డేటాను బదిలీ చేస్తుంది. అసలు సెక్యూరిటీ రిస్క్‌ ఇక్కడే ఉంది. ఈ క్రమంలో మొదట చేయాల్సిన పని, అవసరం లేదు అనుకున్నప్పుడు వైర్‌లెస్‌ కనెక్షన్‌ను టర్నాఫ్‌ చేయాలి. మాల్వేర్‌ను కట్టడి చేసేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వినియోగంలో ముఖ్యంగా ఈ హాట్‌స్పాట్స్‌, తెలియని నెట్‌వర్క్‌లతోనే ఇబ్బంది ఎదురవుతుంది. 


కాల్‌ ప్రొటెక్షన్‌

ఫిషింగ్‌ కాల్స్‌(ఫైనాన్షియల్‌ మోసాల కోసం చేసే అనుచిత కాల్స్‌)తో చాలా ప్రమాదం. బర్నర్‌, ఫైర్‌వాల్‌ అనే రెండు యాప్‌లతో వీటి నుంచి తప్పించుకోవచ్చు. కొత్త ఫోన్‌ నంబర్లను జనరేట్‌ చేయడం ద్వారా బర్నర్‌     

వ్యక్తిగత సమాచారాన్ని ప్రొటెక్ట్‌ చేస్తుంది. ఐఓఎస్‌ వినియోగదారులను ఫైర్‌వాల్‌ రక్షిస్తుంది. అనుచిత కాల్స్‌ రింగ్‌ కూడా వినకుండానే నేరుగా వాయిస్‌ మెయిల్‌కు పంపేందుకు ఫైర్‌వాల్‌ తోడ్పడుతుంది.


అప్లికేషన్స్‌తో జాగ్రత్త

ప్లేస్టోర్‌ నుంచి కొత్త సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే సమయంలో అది అడిగే అనుమతులపై దృష్టి సారించాలి. బ్రౌజర్‌తో మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్ళేటప్పుడు మీరు ఇస్తున్న అనుమతులపై కూడా కన్నేయాలి.



సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌

సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లను మర్చిపోవద్దు. అటాక్‌ కాకుండా కాపాడటంలో ఇది మంచి పాత్ర పోషిస్తుంది. దీనికితోడు సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌తో అదనంగా రక్షణ లభిస్తుంది. జీపీఎస్‌ సామర్థ్యాలు కూడా తోడైతే ఫోన్‌ను పోగొట్టుకున్నప్పుడు అది ఎక్కడ ఉందన్నది కనుగొనడం సులువు అవుతుంది. 


వీపీఎన్‌

వర్చ్యువల్‌ ప్రైవేటు నెట్‌వర్క్స్‌ లేదా వీపీఎన్‌ - ప్రైవేటు నెట్‌వర్క్‌ను ఇంటర్నెట్‌ ద్వారా సేఫ్‌గా తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. మీ అసలు ఐపీ అడ్రస్‌ను దాచిపెట్టి, తాత్కాలికమైన వాటితో డేటా తీసుకోవడం, పంపుకోవడం, షేర్‌ చేసుకోవడానికి దీంతో వీలుపడుతుంది. డేటాను కాన్ఫిడెన్షియల్‌గా ఉంచుతుంది. సీక్రెట్‌ ప్లేస్‌లో దాచి ఉంచినట్లు అన్న మాట. 


Updated Date - 2022-01-01T05:30:00+05:30 IST